పెట్రోల్ బంకులో ఘరానా మోసం.. ఆందోళనకు దిగిన వాహనదారులు

by  |
పెట్రోల్ బంకులో ఘరానా మోసం.. ఆందోళనకు దిగిన వాహనదారులు
X

దిశ, కామారెడ్డి: పెట్రోల్ బంక్ నిర్వాహకులు వాహనదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అసలే పెట్రోల్ ధరలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు పెట్రోల్ బంకుల నిర్వాహకులు తక్కువ పెట్రోల్ పోస్తూ ఘరానా మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రహదారిలో నూతనంగా ఏర్పాటైన ఎస్సార్ పెట్రోల్ బంకులో లీటర్ పెట్రోల్ కు 150 నుంచి 250 ఎంఎల్ పెట్రోల్ తక్కువగా రావడంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. గత రెండు రోజులుగా కొత్తగా ఏర్పాటైన ఎస్సార్ పెట్రోల్ బంకులో పెట్రోల్ బాగుంటుందని అనేక మంది వాహనదారులు బంకుకు క్యూ కట్టారు. ఇదే అదునుగా భావించిన బంక్ నిర్వాహకులు ఘరానా మోసానికి తెర లేపారు.

లీటర్ పెట్రోల్ కు 150 నుంచి 250 ఎంఎల్ పెట్రోల్ కోత విధిస్తున్నారు. పెట్రోల్ బంకులో జీరో రీడింగ్ చూసుకుని పెట్రోల్ పోసుకుని వాహనదారులు చడిచప్పుడు లేకుండా వెళ్తున్నారు. సోమవారం కొందరు వినియోగదారులకు పెట్రోల్ పై అనుమానం వచ్చి బాటిల్ లో పెట్రోల్ వేసుకుని చెక్ చేశారు. దాంతో బంక్ నిర్వాహకుల మోసం బయటపడింది. ఒక్కో లీటర్ కు 150 నుంచి 250 ఎంఎల్ పెట్రోల్ తక్కువగా వస్తుందని గమనించి ఆందోళనకు దిగారు. బంకు నిర్వహకుల వద్ద గల కొలత బాటిల్ లో పెట్రోల్ పోసి చూడగా డొల్లతనం బయటపడింది. దాంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న వాహనదారులతో నిర్వాహకుడు వాగ్వాదానికి దిగారని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొండని అంటున్నారని వాహనదారులు తెలిపారు.

పెట్రోల్ మోసంపై నిలదీసిన తర్వాత ఇప్పుడు వేసుకుంటే కరెక్టుగా వస్తుందని చెప్తున్నారని వాహనదారులు తెలిపారు. అసలే లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పెరిగిన పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తుంటే ఇలా ప్రజలను నిలువునా ముంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పెట్రోల్ బంకులపై అధికారులు చర్యలు తీసుకుని బంకును సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు, తూనికలు కొలతల అధికారులు బంక్ వద్దకు చేరుకుని విచారణ జరుపుతున్నారు. అధికారులు తనిఖీలు చేపట్టగా పెట్రోల్ సరిగ్గానే వస్తుంది. కిందిస్థాయి సిబ్బంది నాజిల్ ప్రెస్ చేయడం వల్ల పెట్రోల్ తక్కువగా వచ్చి ఉంటుందని అధికారులు చెప్తున్నారు.


Next Story

Most Viewed