కాక్‌పిట్ టు కుకింగ్ పాట్..

by  |
కాక్‌పిట్ టు కుకింగ్ పాట్..
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఉద్యోగం కోల్పోయినంత మాత్రాన జీవితాన్ని కూడా లాస్ అయినట్లు కాదు. తలచుకుంటే ఏమైనా చేయొచ్చు. ఏదైనా సాధించొచ్చు. ముంబైకి చెందిన 22 ఏళ్ల యంగ్ బిజినెస్ అనాలిస్ట్ ఆదిత్య చందనే కూడా ఉద్యోగం పోగొట్టుకున్న జాబితాలో ఉన్నాడు. కానీ, ఆయన కుంగిపోలేదు. మరో ఉద్యోగం కోసం వెతుక్కోలేదు. తన డ్రోన్ ఫ్లైయింగ్ హ్యాబీని ప్రొఫెషనల్‌గా మార్చుకుని, డ్రోన్ ఫొటోగ్రఫీలో ముందుకు సాగుతున్నాడు. మలేషియన్ పైలట్ అజ్రిన్ మొహమ్మద్ జవావి కూడా ఉద్యోగం కోల్పోవడంతో, నూడుల్ స్టాల్ ప్రారంభించాడు. అతని కుటుంబ సభ్యులు జవావి నూడుల్ స్టాల్ ఫొటోలను నెట్టింట్లో షేర్ చేయడంతో, జవావి నూడుల్ స్టోర్‌కు కస్టమర్లు క్యూ కడుతున్నారు.

జవావి రెండు దశాబ్దాలపాటు పైలట్‌గా సేవలందించాడు. కానీ, కరోనా కారణంగా తన ఉద్యోగం కోల్పోయాడు. దాంతో జవావి తన కుటుంబాన్ని పోషించుకునేందుకు చెఫ్‌గా కొత్త అవతారం ఎత్తాడు. ‘కెప్టెన్ కార్నర్’ పేరుతో కౌలంలపూర్‌లో నూడుల్ స్టాల్ ప్రారంభించి, అచ్చంగా పైలట్‌లానే తయారై తన కస్టమర్లకు ఫుడ్ సర్వీస్ అందిస్తున్నాడు. కెప్టెన్‌గా ఫ్లైట్ నడిపిన వ్యక్తి, రోడ్డు మీద నూడుల్స్ అమ్ముకోవడం ఏంటని జవావి ఏనాడు భావించలేదు. పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలుచుకున్నాడు. అందుకు జవావి కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. మలేషియా ఫేవరేట్ ఫుడ్స్ మి కర్రీ, మి హన్ సూప్, లక్స ఉటారాలను సూపర్‌గా చేస్తాడని జవావి తండ్రి చెబుతున్నాడు. తన కొడుకు ఇన్‌స్పైరింగ్ స్టోరీని ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతోపాటు, తన కొడుకు ఫుడ్ స్టాల్‌కు రావాల్సిందిగా జవావి తండ్రి నెటిజన్లను కోరాడు. జవావి కూతుళ్లు కూడా తన తండ్రి ఫుడ్ స్టాల్‌‌ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. దాంతో ఎంతోమంది మలేషియన్లు జవావి ‘కెప్టెన్ కార్నర్‌కు’ వస్తున్నారు.

‘‘జీవితంలో కష్టాలు సహజం, చాలెంజెస్ స్వీకరించండి, ఎప్పుడూ గివ్ అప్ చేయకుండా, ముందుకు సాగాలి. విమానాన్ని నేను ఎప్పుడూ ముందుకే తీసుకెళ్లే వాణ్ని’’ అని జవావి అంటున్నాడు.

నిజమే మరి, కరోనా పాండమిక్ ఎంతోమందికి ఉపాధి లేకుండా చేసింది. కానీ, కొంతమంది స్వయం ఉపాధి కల్పించుకున్నారు. రోడ్డున పడ్డవారికి ఉద్యోగం కల్పించే స్థాయికి ఎదిగారు. ఉద్యోగం కోసమో, ప్రభుత్వం అందించే పథకాల కోసమో వెయిట్ చేస్తూ కూర్చుకుండా ఇలా సొంత ఆలోచనలతో వ్యాపారం ప్రారంభిస్తే మరి కొంతమందికి ఉపాధి కల్పించిన వాళ్లమవుతాం.



Next Story