విద్యార్థి దశలోనే.. చిరంజీవి జీవితంలో మరో కోణం

by  |
విద్యార్థి దశలోనే.. చిరంజీవి జీవితంలో మరో కోణం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో కీలకంగా పనిచేసిన డాక్టర్ కొల్లూరి చిరంజీవి జీవితంలో చాలామందికి తెలియని మరో కోణం ఉంది. సీపీఐ (ఎంఎల్) సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ నాయకుడైన కొండపల్లి సీతారామయ్యకు ఆయన గతంలో కుడి భుజంగా పనిచేసారు. ఆ పార్టీ ఏర్పడిన తొలినాళ్ళలో తెలంగాణలో విద్యార్థులను సమీకరించడంలో చిరంజీవి చేసిన కృషి, చూపిన చొరవ ఆయనకు బాధ్యతలు అప్పచెప్పడానికి దోహదపడింది. గత కొంతకాలంగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందారు. వైద్య చికిత్సకు ఆర్థిక సమస్యలు తోడు కావడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రభుత్వం పది లక్షల రూపాయలను అందించింది. మంత్రి ఈటల రాజేందర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి చిరంజీవిని పరామర్శించారు. వైద్యులు చేసిన కృషి ఫలించక కొల్లూరు చిరంజీవి మృతి చెందారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969లో ఉధృతంగా జరిగే సమయానికి కొల్లూరి చిరంజీవి ఓ విద్యార్థి. ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ వెనకబాటుతనం, సంస్కృతి, దొరల ఆధిపత్యం లాంటి అనేక అంశాలను అవగాహన చేసుకున్నారు. భూస్వామి దోపిడీ, వ్యవసాయ సంబంధాలను సైతం ఆకళింపు చేసుకున్నారు. అక్కడి నుంచే ఆయనలో ఆలోచించే ధోరణి పెరిగింది. తార్కిక పద్ధతుల్లో విషయాలను అధ్యయనం చేసే క్రమంలో శాస్త్రీయ దృక్పథం, వామపక్ష భావజాలం వైపు మళ్ళారు.

సీపీఐ (ఎంఎల్) సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పడిన తొలి నాళ్ళలోనే నాయకుడు కొండపల్లి సీతారామయ్యతో పరిచయం ఏర్పడింది. చారు మజుందార్ చనిపోయిన తర్వాత సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ నిర్వహణ కోసం కేఎస్ వెళ్ళాల్సి వచ్చింది. ఆ సమయంలో కేజీ సత్యమూర్తి, ముక్కు సుబ్బారెడ్డి లాంటివారు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో రీజినల్ ఆర్గనైజింగ్ కమిటీ నిర్వహణను కొల్లూరు చిరంజీవి చూసుకునేవారు. మల్లోజుల వేణుగోపాల్, నల్లా ఆదిరెడ్డి, మల్లా రాజిరెడ్డి, సాహు లాంటి దాదాపు ముప్పై మంది అప్పటి విద్యార్థులను పార్టీలోకి సమీకరించడంలో చిరంజీవి క్రియాశీలకంగా కృషి చేశారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతూ మధ్యలోనే ఆపేశారు. పార్టీ కార్యకలాపాలను కరీంనగర్ జిల్లాలోనూ విస్తరించడంలో ఉత్తమ ఆర్గనైజర్‌గా వ్యవహరించారు.

విద్యార్థులకు విప్లవ పాఠాలను బోధించడంలో చిరంజీవితో పాటు ముక్కు సుబ్బారెడ్డి, సత్యమూర్తి లాంటివారూ చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన అనుభవం, వామపక్ష భావజాలాన్ని అవగాహన చేసుకోవడంతో ఎమర్జెన్సీ సమయంలోనూ రహస్యంగానే నక్సలైట్ కార్యకలాపాలను నిర్వహించడం, విద్యార్థులను పార్టీవైపు ఆకర్షితులను చేయడం లాంటివాటిలో యాక్టివ్‌గా ఉన్నారు. కేఎస్‌తో ఉన్న సాన్నిహిత్యం, ఆర్వోసీ బాధ్యతల్లో ఉన్నందున నాగపూర్‌లో జరిగిన కమిటీ సమావేశానికి హాజరయ్యే క్రమంలో చిరంజీవి అరెస్టయ్యారు. కొన్ని రోజులకే అప్రూవర్‌గా మారారు. చిరంజీవి ఇచ్చిన సమాచారంతో కేఎస్ కూడా అరెస్టయ్యారు. ఆ తర్వాత సికింద్రబాద్ కుట్ర కేసులో కేఎస్ పేరును పోలీసులు చేర్చారు.

జైలు నుంచి బైటకు వచ్చిన తర్వాత దాదాపు పుష్కర కాలం పాటు సైలెంట్‌గానే ఉండిపోయిన చిరంజీవి ఆ తర్వాత కాన్షీరాం ఫిలాసఫీ వైపు ఆకర్షితులయ్యారు. మార్క్సిస్టు మేధావులు మార్క్స్, ఏంగెల్స్ లాగానే డాక్టర్ అంబేద్కర్‌ను సైతం తత్వవేత్తగా గుర్తించాలనే డిమాండ్‌తో కాన్షీరాం వైపు మొగ్గు చూపారు. ఆ సిద్ధాంతాన్ని వివిధ సెక్షన్ల ప్రజల్లోకి తీసుకెళ్ళడంపై దృష్టి పెట్టారు. సీపీఐ (ఎంఎల్) సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ‌లో పనిచేస్తున్న క్రమంలో మతతత్వం పోషించే పాత్ర, ప్రజలను సెంటిమెంటల్‌గా ఉద్యమంవైపు మళ్ళకుండా చూడటం లాంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగిన చిరంజీవి బీజేపీ సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకించేవారు. కేవలం మతం ఆధారంగానే అది ప్రజల మెదళ్ళను కలుషితం చేస్తోందని బలంగా నమ్మిన చిరంజీవి చివరి వరకూ అదే వైఖరితో ఉన్నారు.

సీపీఐ (ఎంఎల్) సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ నుంచి బైటకు రావడానికి నాయకత్వంతో ఏర్పడిన విభేదమని చెప్పినప్పటికీ ఎమర్జెన్సీ తర్వాతి కాలంలో పోలీసు నిర్బంధం లాంటిది కారణమని ఆయనతో పాటు ఉద్యమంలో పనిచేసినవారు గతంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణ విషయంలో మాత్రం ఎలాంటి రాజీ లేకుండా పార్టీలకు అతీతంగా సంపూర్ణ సహకారాన్ని అందించారు.

1947 ఫిబ్రవరిలో వరంగల్ జిల్లాలో పుట్టిన చిరంజీవి తల్లిదండ్రుల నుంచి అందిన సహకారంతో విద్యా సంబంధ విషయాల్లో ముందుండేవారు. తల్లి ఉపాధ్యాయురాలు, తండ్రి ఆర్మీ అధికారిగా ఉన్నందున చదువులో ఎప్పుడూ ముందుండేవారు. మార్కిజం మొదలు అంబేద్కర్ ఆలోచన వరకు అనేక అంశాలను అధ్యయనం చేసిన డాక్టర్ కొల్లూరి చిరంజీవి చివరకు కాన్షీరాం ఫాలోవర్‌గా మారిపోయారు. కాన్షీరాం ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఆయన ఆంగ్ల ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించి తెలుగు రాష్ట్రాల ప్రజల చెంతకు తీసుకెళ్ళడంలో చిరంజీవి సొంతంగా చొరవ తీసుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు దేశవ్యాప్తంగా తిరిగారు. బహుజన పత్రిక పేరుతో ఒక పత్రికను తెలుగులో పెట్టి దాని ద్వారా బీఎస్పీ సిద్ధాంతాలను ప్రజలకు అర్థం చేయించడంలో ఎడిటర్‌గా యాక్టివ్‌గా వ్యవహరించారు.

తెలంగాణ మలి దశ ఉద్యమంలోనూ యాక్టివ్‌గానే ఉన్న చిరంజీవి రాష్ట్ర వెనకబాటుతనం, అన్యాయం లాంటి విషయాల్లో స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించేవారు. తొలి దశ ఉద్యమ అనుభశాలను ఈ తరం యువతకు వివరించేవారు. అప్పట్లో కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థిగా ఉంటూ తోటి విద్యార్థులను కూడగట్టి జై తెలంగాణ నినాదంతో అప్పటి కాంగ్రెస్ నేతలను హడలెత్తించిన అంశాలను ఈ తరం యువతకు వివరించేవారు. చివరకు తెలంగాణ డెమొక్రటిక్ అండ్ సెక్యులర్ అలయెన్స్ అనే సైద్ధాంతిక గ్రూపును ఏర్పాటు చేశారు. తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న పాండురంగా రెడ్డి లాంటివారు మాత్రమే కాకుండా వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా ఉన్నవారి వరకు మేధావులందరితో కలిసి ఈ గ్రూపును యాక్టివ్‌గా నడిపించేవారు.

కొల్లూరు చిరంజీవి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు మంత్రులు, 1970వ దశకంలో ఆయన పిలుపుతో పీపుల్స్ వార్ పార్టీలో చేరి వివిధ కారణాలతో బైటకు వచ్చి రకరకాల ఉద్యోగాల్లో స్థిరపడినవారు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి దశ ఉద్యమం, పీపుల్స్ వార్ పార్టీ యాక్టివిటీస్, బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంత వ్యాప్తి, ఆ తర్వాత మేధోపరమైన చర్చా వేదిక లాంటివాటితో అనుబంధం ఉన్నవారు చిరంజీవి మృతి పట్ల దుఃఖం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed