దెబ్బ మీద దెబ్బ.. ఈటల రాజేందర్‌పై మరో కేసు..?

by  |
దెబ్బ మీద దెబ్బ.. ఈటల రాజేందర్‌పై మరో కేసు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో రైతులకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలపై మంత్రి ఈటల రాజేందర్ పై దర్యాప్తు కొనసాగుతోంది. 66 ఎకరాల మేరకు అసైన్డ్ భూములు ఈటలకు చెందిన జమున హచరీస్ కంపెనీ ఆధీనంలో ఉన్నట్లు కలెక్టర్ హరీష్ నేతృత్వంలోని బృందం గుర్తించింది. 20 మంది రైతులు తమ భూములను కబ్జా చేసినట్లు ఫిర్యాదు చేశారు. అందులో చాలా మంది ఈటల పేరును నేరుగా ప్రస్తావించారు. కొందరు మాత్రం సూరి పేరిట ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఐతే సదరు భూముల కబ్జాతో పాటు మరో కేసును నమోదు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అసైన్డ్ భూములను ఆక్రమించుకొని అర కిలో మీటర్ రోడ్డు వేశారు. అప్పుడు ఏపుగా చెట్లను కొట్టేసినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. పలువురు రైతుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిసింది. అవన్నీ రైతుల భూముల్లో ఉన్నవే. కానీ వాటిని కొట్టేసేందుకు కూడా అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. అలా అనుమతి తీసుకోకుండానే చెట్లను నరికేశారన్న అభియోగాన్ని కూడా మంత్రి ఈటల, ఆయన అనుచరులపై నమోదు చేయనున్నట్లు తెలిసింది. వాల్టా చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చట్ట రీత్యా చర్యలు తీసుకోనున్నట్లు ఓ అధికారి ‘దిశ’కు చెప్పారు.

సొంత భూముల్లో పెరిగిన చెట్లను నరకడానికి కూడా వాల్టా చట్టం ప్రకారం అటవీ శాఖ అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా ఏ రకమైన చెట్లను కొట్టేసినా చట్టరీత్యా చర్యలు తీసుకునే వీలుంది. చట్ట ఉల్లంఘన జరిగినట్లుగానే భావిస్తున్నారు. ఐతే ఏ రకమైన చర్యలు ఉంటాయో వేచి చూడాలి. ఇటీవల రాష్ట్రంలో హరితహారం పథకాన్ని అమలు చేస్తోన్న క్రమంలో చెట్ల నరికివేతపై సీరియస్ గానే ఉంటున్నారు. రెండేండ్ల క్రితం బంజారాహిల్స్ లో షాపింగ్ మాల్ కు అడ్డంగా ఉన్నాయని ఇంటి యజమానికి మూడు చెట్లను కొట్టేయించారు. దాన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు అతడికి రూ.39,600 జరిమానా విధించారు. అలాగే అనుమతి లేకుండా చెట్లు కొట్టేసిన గేటెడ్ కమ్యూనిటీకి అటవీ శాఖ అధికారులు భారీ జరిమానా విధించారు. కూకట్ పల్లిలోని ఇందు ఫార్చూన్ ఫీల్డ్ లో అనుమతి లేకుండా 40 చెట్లు కొట్టేశారు. దానికి 80 మొక్కలు నాటి సంరక్షించాలని, అలాగే రూ.53,900 జరిమానా కట్టించుకున్నారు.

ఇప్పుడు అర కి.మీ. పొడవునా కొట్టేసిన చెట్ల సంఖ్యను ఎలా గుర్తిస్తారో వేచి చూడాలి. ఎప్పుడో కొట్టేశారన్న ఆరోపణలపై దర్యాప్తు ఎలా కొనసాగిస్తారో అర్ధం కావడం లేదు. మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు తమ భూములను కబ్జా చేశారని ఫిర్యాదు చేసిన రైతుల నుంచే చెట్ల నరికివేతపై సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈటలపై ఎన్ని చెట్లు కూలనున్నాయోనని అధికార వర్గాల్లోనూ ఆసక్తిగా మారింది. అలాగే జరిమానా విధించడంలోనూ ఎంత లెక్క ఉంటుందో మరి.. ఎన్ని మొక్కలను పెంచాలని షరతు విధిస్తారో త్వరలోనే వెల్లడి కానుంది.


Next Story

Most Viewed