సెప్టెంబర్ త్రైమాసికంలో రికవరీ దిశగా ఎఫ్ఎంసీజీ రంగం

by  |
సెప్టెంబర్ త్రైమాసికంలో రికవరీ దిశగా ఎఫ్ఎంసీజీ రంగం
X

దిశ, వెబ్‌డెస్క్: జనవరి-మార్చి త్రైమాసికంలో కొవిడ్-19 మహమ్మారి కారణంగా డీలాపడిన తర్వాత ఎఫ్ఎంసీజీ పరిశ్రమ సెప్టెంబర్ త్రైమాసికంలో కోలుకునే సంకేతాలను నమోదు చేసిందని మార్కెట్ల పరిశోధనా సంస్థ నీల్సన్ వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన 1.6 శాతం వృద్ధిని ఎఫ్ఎంసీజీ పరిశ్రమ సాధించినట్టు నీల్సన్ తెలిపింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగ వస్తువుల(ఎఫ్ఎంసీజీ) రంగంలో వృద్ధి, లాక్‌డౌన్ పరిమితులను సడలించడం ద్వారా ఆర్థికవ్యవస్థ వృద్ధికి కూడా దోహదపడుతోందని నీల్సన్ పేర్కొంది.

అయితే, త్రైమాసిక పరంగా గమనిస్తే… ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ వృద్ధి, గతేడాది ఇదే కాలంలో వృద్ధి కంటే 19 శాతం క్షీణించింది. ఉత్పత్తి, వినియోగదారు విశ్వాసం సన్నగిల్లడం, సరఫరాలో భారీగా అంతరాయాల కారణంగానే ఈ క్షీణత నమోదైందని నీల్సన్ వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన ఎఫ్ఎంసీజీ రంగంలోని అన్ని రకాల ఉత్పత్తుల వ్యాపారం రికవరీ సంకేతాలు చూస్తున్నామని నీల్సన్ పేర్కొంది.

లాక్‌డౌన్ కొనసాగిన త్రైమాసికంలో వినియోగదారులు అవసరమైన ఆహార పదార్థాల ఖర్చులకు ప్రాధాన్యతమివ్వడంతో, అన్‌లాక్ సమయంలో ఇది రెండంకెల వృద్ధిని సాధించింది. ఆహారేతర(గృహ సంరక్షణ, వ్యక్తిగత రక్షణ) ఉత్పత్తుల్లో ఇదే స్థాయి ధోరణి నమోదైందని తెలుస్తోంది. ఎఫ్ఎంసీజీల మార్కెట్ పరంగా చూస్తే..గ్రామీణ ప్రాంతాల్లో ఈ రంగం 10.6 శాతం వృద్ధిని సాధించిందని నీల్సన్ నివేదిక వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో స్థిరమైన వృద్ధి ఉందని నీల్సన్ పేర్కొంది.


Next Story

Most Viewed