కరోనా కష్టాల్లోనూ మెరుగ్గా ఎఫ్ఎంసీజీ పరిశ్రమ!

by  |
కరోనా కష్టాల్లోనూ మెరుగ్గా ఎఫ్ఎంసీజీ పరిశ్రమ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి అనేక సవాళ్లను తెచ్చిపెడుతున్న సమయంలో దేశీయ ఎఫ్ఎంసీజీ పరిశ్రమ మెరుగ్గా వృద్ధి కనబరుస్తోంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశీయ ఎఫ్ఎంసీజీ పరిశ్రమ వార్షిక ప్రాతిపదికన 9.4 శాతం వృద్ధి నమోదు చేసింది. నిత్యావసర సరుకులు, ఆహారేతర, ఆహార పదార్థాలు పరిశ్రమ వృద్ధికి దోహదపడ్డాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు పరిశ్రమకు అండగ నిలిచినట్టు ప్రముఖ ఇంటిలిజెన్స్ మార్కెటింగ్ సంస్థ నీల్సన్ ఐక్యూ అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా సెకెండ్ వేవ్ ఉన్న ప్రస్తుత పరిస్థితుల నుంచి రెండో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ కొత్త వ్యాపార విధానాలను అందుకోగలదని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో గ్రామీణ మార్కెట్లు వార్షిక ప్రాతిపదికన 14.6 శాతం వృద్ధి చెందిందని, మెట్రో నగరాలు సైతం వరుస రెండు త్రైమాసికాల్లో క్షీణత తర్వాత మార్చి త్రైమాసికంలో 2.2 శాతం వృద్ధి చెందింది.

సాంప్రదాయ ఎఫ్ఎంసీజీ పరిశ్రమ వర్గాలు రెండంకెల వృద్ధిని సాధించగా, ఈ-కామర్స్ సాధారణ వృద్ధి క్రమాన్ని కొనసాగిస్తున్నాయని నీల్సన్ ఐక్యూ నివేదిక తెలిపింది. గ్రామీణ మార్కెట్లలో పరిశ్రమ వృద్ధి డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 14.2 శాతం నుంచి 14.6 శాతానికి మెరుగడవం సానుకూల పరిణామం. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయని, దీనివల్ల వరుసగా మూడో ఏడాది గ్రామీణ మార్కెట్లు వృద్ధిని కొనసాగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. భారీ వ్యయం, వేతనాల పెరుగుదల, కీలకమైన పంటల కనీస ధరల పెంపు లాంటి పరిణామాలతో గ్రామీణ మార్కెట్లో వినియోగాం పెరిగిందని నివేదిక వివరించింది.

ఇక, ఇన్‌పుట్ ఖర్చుల వ్యయం సరుకుల ధరలు పెరగడానికి దారితీసినప్పటికీ, గ్రామీణ మార్కెట్లు ఎఫ్ఎంసీజీ పరిశ్రమ వృద్ధికి మద్దతు ఇచ్చాయి. చిల్లర వ్యాపారులు స్టాక్ ఉంచుకోవడం కంటే వ్యాపార వృద్ధిపై దృష్టి కేంద్రీకరించారని, దీనివల్ల సాంప్రదాయ వాణిజ్యం ఈ-కామర్స్ అమ్మకాల కంటే మెరుగ్గా ఉందని నీల్సన్ ఐక్యూ నివేదిక అభిప్రాయపడింది. ఆహార, ఆహారేతర వస్తువుల విభాగాల్లో కూడా వినియోగ వృద్ధి సానుకూలంగా ఉంది. ఇంట్లో వాడే ఆహార పదార్థాల వినియోగం పెరగడంతో ఈ విభాగంలో వృద్ధి నమోదైందని నివేదిక వెల్లడించింది.



Next Story

Most Viewed