ఏజెన్సీలో ఫైనాన్సర్ల పాగా

by  |
ఏజెన్సీలో ఫైనాన్సర్ల పాగా
X

దిశ, వాజేడు: పచ్చని ఏజెన్సీ పల్లెల్లో ఫైనాన్సర్లు పాగా వేశారు. మధ్యతరగతి చిరువ్యాపారులపై దృష్టి పెట్టి వారి అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీ వ్యాపారం కొనసాగిస్తూ సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. రోజుకొకరు చొప్పున ఆంధ్రా వడ్డీ వ్యాపారులు గిరిజన పల్లెల్లో తిరుగుతూ అక్రమ వడ్డీ వ్యాపారం కొనసాగిస్తున్నారు. అమాయక గిరిజనుల దగ్గర అధిక వడ్డీలు వసూలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు.

విచ్చలవిడిగా..

గిరిజన పల్లెల్లో ఫైనాన్స్ దందాను విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారు. మారుమూల మన్యం ప్రాంతమైన వాజేడు వెంకటాపురం మండలంలో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఫైనాన్స్ వ్యాపారుల చేతుల్లో చిక్కిన నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు చితికి పోతున్నారు. చిరు వ్యాపారుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఒక్కసారి వడ్డీ వ్యాపారుల చేతికి చిక్కితే వారి నుంచి బయటపడడం చాలా కష్టమని పలువురు వాపోతున్నారు.

నిబంధలకు పాతర!

ఏజెన్సీ ప్రాంతంలో వడ్డీ వ్యాపారం చేయరాదనే నిబంధన ఉన్నప్పటికీ వడ్డీ వ్యాపారం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఏజెన్సీ మండలాల్లో ఇంత జరుగుతున్నా అటు రెవెన్యూ అధికారులు ఇటు పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఏజెన్సీ ప్రజల అమాయకత్వాన్ని అంచనా వేసిన వడ్డీ వ్యాపారులు వారాల వారీగా గ్రామాల్లో తిరుగుతూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. గిరిజన గిరిజనేతర పేదల వద్ద అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కట్టడి చేసుకునేవాళ్లు లేకపోవడంతో ఫైనాన్సర్‌ల ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. అక్రమ వడ్డీ వ్యాపారులపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సిన అధికార యంత్రాంగం నిద్రమత్తులో మూలుగుతుంటే.. వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీతో పేదల నడ్డి విరుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పేపర్లపై సంతకాలు..

ఏజెన్సీ ప్రాంతంలో ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చే వడ్డీ వ్యాపారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చర్ల ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈ వడ్డీ వ్యాపారం సోమవారం మొదలుకొని ఆదివారం వరకు ప్రతిరోజు ఒక్కొక్కరు చొప్పున గిరిజన గ్రామాల్లో ద్విచక్రవాహనాలపై తిరుగుతూ వ్యాపారాన్ని మొదలు పెడతారు. ఫైనాన్స్ తీసుకునే పేదలతో పేపర్లపై సంతకాలు, వేలిముద్రలు వేయించుకొని ఆ పేపర్‌ల‌తో పాటు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఇంటి పన్ను రసీదు జిరాక్స్ కాపీలను తీసుకున్న తర్వాతనే ఫైనాన్స్ ఇస్తారు. ఫైనాన్స్ తీసుకున్న వ్యక్తులు సరైన సమయానికి వాయిదాలు చెల్లించకుంటే కోర్టులో కేసు వేస్తామని బెదిరింపులకు గురి చేస్తారు.

తీసుకునేది రూ.800.. కట్టేది 2800

ఒక వ్యక్తి రూ. 1,000 తీసుకుంటే వారికి ఎనిమిది వందలు మాత్రమే ఇస్తారు. ఆ వ్యక్తి 12 వారాల్లో ప్రతి వారం రెండు వందల రూపాయలు కడుతూ.. మరో రూ.400 అదనంగా కట్టాల్సి వస్తుంది. ఇలా ప్రజల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తూ కోట్లల్లో అక్రమ వ్యాపారం చేస్తున్నారు. వడ్డీ తీసుకున్న వ్యక్తి వాయిదా చెల్లించకుంటే ఆ డబ్బులకు వడ్డీ వేస్తారు. ఇలా వందకు పది రూపాయల వడ్డీ పేదల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఫైనాన్స్ పొందిన చిరు వ్యాపారుల ఈ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులు వడ్డీ వ్యాపారుల చెల్లిస్తూ అవస్థలు పడుతున్నారు వడ్డీ వ్యాపారులకు వడ్డీలను కట్టలేక చిరు వ్యాపారులు విసిగిపోతున్నారు. బ్యాంకులో అప్పులు పుట్టక గత్యంతరం లేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తుండడంతో మరింత ఆర్థికంగా చితికి పోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి అధిక వడ్డీ వ్యాపారాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది.

Next Story

Most Viewed