‘హల్వా’ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్మలా సీతారామన్

by  |
‘హల్వా’ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్మలా సీతారామన్
X

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ ప్రక్రియ చివరి దశకు చేరిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం హల్వా కార్యక్రమాన్ని నిర్వహించారు. నార్త్ బ్లాక్‌లోని ఫైనాన్స్ మినిస్ట్రీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, ఫైనాన్స్ సెక్రెటరీ(రెవెన్యూ) డాక్టర్ ఏబీ పాండే, ఎక్స్‌పెండిచర్ సెక్రెటరీ టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్, మరో అధికారి తుహిన్ కాంత పాండేలు పాల్గొన్నారు. సాధారణంగా పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశానికి సుమారు పది రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం 70 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్నది.

బడ్జెట్ ప్రక్రియ ముగిసి డాక్యుమెంట్‌ల ప్రింటింగ్ దశ ప్రారంభిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కానీ, ఈ సారి బడ్జెట్ పూర్తిగా పేపర్‌లెస్ కావడంతో డాక్యుమెంట్లను వివిధ వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేయడాన్ని ప్రారంభించారు. అలాగే, బడ్జెట్ వివరాలన్నీ సులువుగా యాక్సెస్ చేయడానికి యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రారంభించారు. హల్వా కార్యక్రమం మొదలు బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులందరూ బంధుమిత్రులందరికీ దూరంగా ఉండాల్సి ఉంటుంది. బడ్జెట్ వివరాలు లీక్ కావద్దనే ఉద్దేశంతో కుటుంబీకులతో ఎలాంటి అనుసంధానమూ లేకుండా గడుపుతారు.

Next Story

Most Viewed