కొడుకు ఉన్నా లేనట్టే.. వీధుల్లోనే ఉంటూ చివరకు..

159

దిశ, కామారెడ్డి : కరోనా భయం కన్నవాళ్లను కూడా దరిదాపుల్లోకి రానియడం లేదు. ఇంటి నుంచి గెంటేయబడిన తండ్రి అకాల మరణం పొందాడు. ఈ విషయం తెలిసినా కొడుకు తండ్రిని చివరి చూపు చూసేందుకు కూడా ముందుకు రాలేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

నిజాంసాగర్‌కు చెందిన జనార్ధన్ చారిని మూడు రోజుల కిందట కొడుకు రాజు, అతని భార్య ఇంటి నుంచి గెంటేశారు. దాంతో ఎటు పోవాలో తెలియక కామారెడ్డికి వచ్చాడు. పట్టణంలోని ముశ్రీఫ్ బాగ్ కాలనీలో పరాయి వాళ్ళ అరుగులపై ఉంటున్నాడు. స్థానికులు అయ్యోపాపం అని వాళ్ళు తినేదాంట్లో కాస్త అతనికి కూడా పెట్టారు. తీరా తెల్లవారాక చూడగా జనార్దన్ చారి తుదిశ్వాస విడిచాడు. ఎలాగోలా కొడుకు, కోడలు ఫోన్ నంబర్ తీసుకున్న స్థానికులు ఫోన్ చేసి విషయం చెప్పగా తమకు సంబంధం లేదని వారు తెగేసి చెప్పారు. చేసేదేమీ లేక చివరకు మున్సిపల్ సిబ్బందికి ఫోన్ చేయగా పోలీసు సిబ్బంది వచ్చి మృతదేహాన్ని అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..