మక్కల పైసలు ఎప్పుడిస్తరు అసలు?

by  |
మక్కల పైసలు ఎప్పుడిస్తరు అసలు?
X

దిశ, ఆదిలాబాద్: చివరి గింజ దాకా ప్రభుత్వమే కొంటది.. దళారులకు అమ్ముకోవద్దు.. 15 రోజుల్లో మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పడంతో మేమంతా ప్రభుత్వ కాంటాల్లో మక్కలు అమ్ముకున్నాము.. 40 రోజులు గడుస్తున్నా చిల్లిగవ్వ కూడా రాలేదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్చి చివరి వారంలో ప్రారంభమైన కొనుగోళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రులు, శాసనసభ్యులు తమ గ్రామాలకు వచ్చి మార్క్ ఫెడ్ కేంద్రాల్లో మక్కలు అమ్ముకోవాలని చెప్పడంతో మురిసిపోయామని, మద్దతు ధర లభిస్తదని మేం ఆశ పడ్డామని రైతులు చెబుతున్నారు. పంట వేసినప్పటినుంచి చేసిన అప్పులు… అప్పులుగానే ఉన్నాయి.. ప్రభుత్వం డబ్బులు ఇస్తే గానీ అప్పులు తీరవు.. పైసలు ఎప్పుడు వస్తాయని అధికారులను అడిగితే సరిగా చెప్పడంలేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇంకా సాగుతున్న కొనుగోళ్లు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మక్క కొనుగోళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పూర్తి కావాల్సిన కొనుగోళ్లు మార్క్ ఫెడ్ అలసత్వం వల్ల పూర్తి కాలేదు. కూలీలు, లారీల కొరత ఏర్పడిందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 8 నుంచి 10 లక్షల క్వింటాళ్ల మక్కల కొనుగోలు లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో మక్క పంట పది శాతం మేర మాత్రమే సాగు అవుతుంది. మిగతా 90 శాతం నిర్మల్ జిల్లాలో సాగవుతుంది. ఇప్పటి వరకు 5 లక్షల 30 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు పూర్తయ్యాయి. మిగతా మొత్తం పూర్తి కావాలంటే మరో 15 రోజులు పట్టేలా ఉంది.

చెల్లింపులు ఎప్పుడు…?

ఉమ్మడి జిల్లాలో మార్చి నెల చివరి వారంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. సుమారు 40 రోజుల కిందట రైతులు మార్క్ ఫెడ్ కేంద్రాల్లో అమ్ముకోవడం ప్రారంభించారు. 15 రోజుల్లో డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని అధికారులు చెప్పారు. అయితే ఇంతవరకు ఏ ఒక్క రైతుకు కూడా చిల్లిగవ్వ జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 1760 ల మద్దతు ధరతో ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే కొనుగోలు చేసిన మక్కలకు సంబంధించి సుమారు రూ. వంద కోట్లకు పైగానే డబ్బులు చెల్లించాల్సి ఉంది. చివరిదాకా కొనుగోలు సాగితే మరో రూ. వంద కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ, ఇప్పటివరకు అధికారులు రైతులకు డబ్బులు చెల్లించే విషయంలో చర్యలు తీసుకోకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.

చెప్పిందొకటి…చేస్తున్నదొకటి : జ్ఞానీ సింగ్, రైతు, రాణాపూర్

నిర్మల్ జిల్లా రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేసిన మార్క్ ఫెడ్ ఇప్పటి దాకా డబ్బులు ఇవ్వలేదు. 15 రోజుల్లో బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని చెప్పినారు. కానీ నలభై రోజులు గడిచిపోయింది. ఇప్పటిదాకా డబ్బులు రాలేదు. ఎప్పుడు వస్తాయని అధికారులను అడిగితే తలా తోకా లేని సమాధానం చెబుతున్నారు.

Tags: Makkalu, Farmers, Money, Markfed, Office, Bank Account


Next Story

Most Viewed