ధరలేమో మండిపోయే.. ఉత్పత్తి కరిగిపోయే!

by  |
ధరలేమో మండిపోయే.. ఉత్పత్తి కరిగిపోయే!
X

ధరలు దిగిరావు.. పారిశ్రామిక ఉత్పత్తి పైకి చేరదు. ఇప్పటికే ఆర్థిక మందగమనం గురించి ఆందోళన పడుతుంటే తాజాగా ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు మరింత భయపెడుతున్నాయి. బుధవారం ప్రకటించిన ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఆందోళన స్థాయి నుంచి భయంలోకి నెడుతున్నాయి. కొవిడ్-19 మహమ్మారితోపాటు అంతర్జాతీయ కంపెనీలన్నీ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఫ్యాక్టరీ ఉత్పత్తిలో సంకోచం ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బగా ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. చైనాలో విజృంభించిన కరోనా వైరస్ వల్ల దేశీయంగా ప్రతికూల ప్రభావం చూస్తున్నాం. ఎందుకంటే చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో ఒకటి. ఆ దేశంలో అనేక కర్మాగారాలు తాత్కాలికంగా మూసివేయడంతో ఇండియాలో ఎలక్ట్రానిక్స్, ఆటో పరిశ్రమ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చైనా నుంచి వచ్చే విడి భాగాలు, ముడి పదార్థాల దిగుమతులపైనే ఇక్కడ పారిశ్రామికరంగం ఆధారపడి ఉంది.

పారిశ్రామిక ఉత్పత్తి సూచీ

2002-03లో సార్స్ వ్యాపించినప్పుడు చైనాతో ఇండియా వాణిజ్య విలువ అతి తక్కువగా 4.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అప్పటి నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరానికి 19 రెట్లు పెరిగి 87 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దేశీయంగా వినియోగం మందగించడం, పెట్టుబడుల డిమాండ్ నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 5 శాతంతో 11 సంవత్సరాల కనిష్ఠ స్థాయికి దిగజారినట్టు అంచనా. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధి రేటు 5.8 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచికలో 40% వాటా కలిగిన ఆరు మౌలిక వసతుల రంగాలు డిసెంబరులో సానుకూలంగా మారాయి. నాలుగు నెలల అనంతరం 1.3 శాతానికి చేరుకున్నాయని పరిశ్రమల శాఖ గత నెలలో విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో తయారీరంగం -1.2 శాతం, విద్యుత్ రంగం -0.3 శాతం క్షీణించగా కోల్ ఇండియా మెరుగైన పనితీరు కారణంగా మైనింగ్ 5.4 శాతాన్ని నమోదు చేసింది. వినియోగ ఆధారిత వస్తువులలో కన్స్యూమర్ డ్యూరబుల్స్ -6.7 శాతం, కన్స్యూమర్ నాన్-డ్యూరబుల్స్ -3.7 శాతంగా నమోదయ్యాయి. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి డిమాండ్‌ను సూచించే మూలధన వస్తువులు -18.2 శాతంతో 12 నెలల కనిష్ఠానికి దిగజారాయి. డిసెంబర్‌లో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు -69.7%, అలోయ్, స్టెయిన్‌లెస్ స్టీల్ -54%, ఎలక్ట్రిక్, నాన్-ఎలక్ట్రిక్ మీటర్లు -54% క్షీణించాయి.

డిసెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ మరింత క్షీణించడం, ద్రవ్యోల్బణం సుమారు ఆరేళ్ల గరిష్ఠానికి చేరుకోవడంతో ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలమే అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తయారీరంగంలో ఉత్పత్తి తగ్గిపోవడమే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 1.8 శాతం నుంచి -0.3 శాతానికి చేరడం గమనార్హం. 2018 డిసెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 2.5 శాతంగా ఉండేది. 2019 ఆగస్టుకు ఇది -1.4 శాతం, సెప్టెంబర్‌లో -4.6 శాతం, అక్టోబర్‌లో -4 శాతంగా నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. వరుసగా మూడు నెలలపాటు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ క్షీణించిన తర్వాత నవంబర్‌లో మాత్రమే 1.8 శాతం వృద్ధిని సాధించగలిగింది. తయారీరంగంలో ఉత్పత్తి డిసెంబర్‌కు 1.2 శాతం క్షీణించింది. ఇది 2018 డిసెంబరులో 2.9 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ధరల సెగ

గడిచిన కొన్ని నెలలుగా కనీస అవసరాలైన పప్పులు, కూరగాయల ధరలు మండుతున్నాయి. వినియోగదారుల ధరల ఆధారిత సూచీలను అనుసరించి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు. దీంతో జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.59 శాతంగా నమోదైంది. ఇది ఆరేండ్ల గరిష్ఠానికి చేరుకోవడం ప్రమాద గంటికలను మోగిస్తోంది. గతంలో 2014 మేలో 8.33 శాతం నమోదవడమే ఇప్పటివరకు అత్యధికం. 2019 జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 1.9 శాతం, అదే ఏడాది డిసెంబరులో 7.30 శాతంగా నమోదైంది. 2019 డిసెంబరులో కూరగాయల ధరలు దాదాపు 55 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఆహార పదార్థాల ధరల్లో 13.63 శాతం పెరుగుదల నమోదైంది.


Next Story

Most Viewed