యాంటికితెరా మెకానిజం @ ఆస్ట్రానమి కాలిక్యులేటర్, ఫస్ట్ కంప్యూటర్

by  |

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఎన్నో ఆధునాతన టెలిస్కోప్స్, శాటిలైట్స్, ఇతర పరికరాల సాయంతో గ్రహాల గుట్టు, ఖగోళ రహాస్యాలను కనుగొంటున్నాం. కానీ పురాతన కాలంలో గ్రహాల మధ్య దూరాలు, నక్షత్రాల కదలికలు, క్యాలెండర్ తేదీలు, సూర్యచంద్రుల పరిభ్రమణాలు, ఖగోళ వస్తువుల స్థానాన్ని ఎలా లెక్కించారు? అంటే దానికి సమాధానం ‘యాంటికితెరా మెకానిజం’. పూర్వీకుల మేధస్సుకు, పురాతన ప్రపంచంలోని గొప్ప అద్భుతాలకు, ఇంజనీరింగ్ చరిత్రకు, అధునాతన ఖగోళ సిద్ధాంతాలకు ‘యాంటికితెరా మెకానిజం’ అనే సాధనం సాక్ష్యంగా నిలిచింది. క్రీపూ 2వ శతాబ్దంలో రూపొందించిన అతి పురాతనమైన ఈ పరికరాన్నిరోమన్ కాలం నాటి నౌక శిథిలాల్లో 1901లో కనుగొన్నారు. ఆనాటి నుంచి యాంటికితేరా మెకానిజం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. ఖగోళ కాలిక్యులేటర్‌గా, ప్రపంచంలోని మొట్టమొదటి ఆనలాగ్ కంప్యూటర్‌గా పరిశోధకులు వర్ణిస్తున్న ఈ పరికరం ఎలా పనిచేస్తుందో శాస్త్రవేత్తలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకోసం యూనివర్శిటీ కాలేజ్ లండన్ (యుసిఎల్) పరిశోధకుల బృందం దాని త్రీడీ మోడల్‌ను రీక్రియేట్ చేశారు.

Antikythera Mechanism2

ఏప్రిల్ 1900లో గ్రీకుకు చెందిన స్పాంజ్ డైవర్ల బృందం, ఆంటికిథెరాలోని పాయింట్ గ్లైఫాడియాకు 60 మీటర్ల లోతులో ఒక పురాతన రోమన్ గాలెయన్ (లార్జ్ మల్టీ డెక్ సెయిలింగ్ షిప్స్/ఆర్మడ్ కార్గో క్యారియర్స్) శిథిలాలను కనుగొంది. కాంస్య, పాలరాయి విగ్రహాలు, కుండలు, ప్రత్యేకమైన గాజు వస్తులు, నగలు, నాణేలు మొదలైన వాటితో సహా క్రీస్తుపూర్వం 150 నుండి 100 మధ్య నాటి అనేక కళాఖండాలు వారికి లభించాయి. ఆ విలువైన కళాఖండాల మధ్య ఇత్తడి, కాంస్యాలతో పాటు, కలపతో చేసిన ఓ శిథిలమైన వస్తువు కూడా లభించింది. అయితే రెండు సంవత్సరాల తర్వాత దాన్ని గమనించిన చరిత్రకారులు, ఆ పరికరం గురించి ప్రపంచానికి చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అదే ‘యాంటికితెరా మెకానిజం’. కంప్యూటర్ పురాతన రూపంగా అభివర్ణిస్తున్న ఈ పరికరంలో మూడో వంతు మాత్రమే లభించింది. 82 అవశేష శకలాల్లో కనీసం 30 గేర్లను కలిగి ఉంది. సూక్ష్మమైన భాగాలతో పాటు, సంక్లిష్టమైన నిర్మాణం కావడంతో దీని పూర్తి రూపం ఎలా ఉండేదో, ఇది ఎలా పనిచేసేదో అని పరిశోధకులు గుర్తించలేకపోయారు. దీని కచ్చితమైన ఆపరేషన్ ఏంటి అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు. దీని వెనుక కవర్ మీద విశ్వం వర్ణనతో పాటు, ఐదు గ్రహాల కదలికలు ఎలా ఉన్నాయో వివరించారు.

Antikythera Mechanism3

ఒలింపిక్స్, క్యాలెండర్ తేదీలు, గ్రహాల స్థితిగతులు, గ్రహణాలు, ఖగోళ ఘటనల గురించి అంచనా వేయడానికి చేతితో తిప్పే ఈ పురాతన పరికరం గ్రీకుల మేధస్సును చాటిచెబుతుంది. అయితే ఈ పరికరం వెనుక భాగం మెకానిజాన్ని గత అధ్యయనాల్లో కనుగొన్నారు. ఇటీవలి కాలంలో ఎక్స్-కిరణాలు, సిటి స్కాన్ ఉపయోగించి యాంటికిథెరా మెకానిజం లోపలి నిర్మాణ శైలిని పరిశోధకులు పరిశీలించారు. కానీ దాని ముందు భాగంలో ఉన్న గేర్ సిస్టమ్ పనివిధానం మాత్రం ఇప్పటివరకు ఓ అంతుచిక్కని రహస్యంలా ఉండిపోగా, బాబిలోనియన్ ఆస్ట్రానమీ, ప్లాటో అకాడమీ గణిత సిద్ధాంతాలు, పురాతన గ్రీకు ఆస్ట్రానామికల్ థియరీల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ పరికరం ముందు ప్యానల్ మొత్తాన్ని తాజాగా రీక్రియేట్ చేశారు. ఈ త్రీడీ కంప్యూటర్ మోడల్ ఉపయోగించి ‘యాంటికితెరా మెకానిజం’ పని విధాన రహాస్యాన్ని తెలుసుకోవాలని యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకోసం ఇప్పుడు ఆధునిక మెటీరియల్స్ ఉపయోగించి యాంటీకిథెరా పూర్తి స్థాయి నమూనాను తయారు చేయాలనుకుంటున్నారు.

Antikythera Mechanism4

‘ఇప్పుడు కంప్యూటర్ మోడల్ తయారైంది, ఇక ఫిజికల్ వెర్షన్స్ తయారు చేయాలనుకుంటున్నాం. మొదట ఆధునిక పద్ధతులను ఉపయోగించి పరికరం పనిచేస్తుందో లేదో తనిఖీ చేసి, ఆపై పురాతన గ్రీకులు ఉపయోగించిన పద్ధతులను అమలు చేసి చూస్తాం. ప్రాచీన గ్రీకులు ఇలాంటివి నిర్మించగలిగారు అనే దానికి ఎటువంటి ఆధారాలు లేకపోగా, ఇదో మిస్టరీగా మిగిలిపోయింది. ఒకవేళ గ్రీకులు దీన్ని తయారు చేసి ఉంటే, దీన్ని పరీక్షించడానికి మనకున్న ఏకైక మార్గం పురాతన గ్రీకు మార్గంలో నిర్మించడానికి ప్రయత్నించడమే. అందుకే పురాతన గ్రీకు సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకున్నాం. ఈ పరికరం ఎవరి కోసం, ఎవరు నిర్మించారు అనే దానిపై చాలా చర్చలు కూడా ఉండగా, ఆ సమయంలో జీవించిన, జీనియస్ ఇంజనీర్ ఆర్కిమెడిస్ మాత్రమే ఇలాంటి పరికరం తయారు చేసి ఉంటాడని చాలామంది భావిస్తున్నారు. అతనికి మాత్రమే ఆ సామర్థ్యముందని, మరెవరికీ ఆ నాలెడ్జ్ లేదన్నది వాస్తవం. అతడు కాకుండా..ఒకవేళ గ్రీకులు తయారు చేసి ఉంటే, ఇప్పటివరకు బయటపడని ఇలాంటి పరికరాలను తయారు చేయడానికి ఈ పద్ధతులను ఉపయోగించారా లేదా యాంటికిథెరా యంత్రాంగం కాపీలు ఎక్కడైనా ఉన్నాయా లేవా? అనేది అంతుచిక్కడం లేదు. అన్ని ఫిజికల్ ఎవిడెన్స్‌ల‌కు అనుగుణంగా రూపొందిన మొదటి త్రీడీ మోడల్ మాదే. అంతేకాదు శాస్త్రీయ శాసనాల్లోని మెకానిజం వివరణలతో ఇది సరిపోతుంది’ అని సైంటిస్ట్ వొజ్‌సిక్ పేర్కొన్నాడు.

Next Story