మళ్లీ జనసేన గూటికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..?

by  |
మళ్లీ జనసేన గూటికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..?
X

దిశ, వెబ్ డెస్క్: పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తన ఉనికిని చాటుకుంది. పల్లెల్లో తన సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో 27 శాతం ఓట్లను రాబట్టి పలు ప్రాంతాల్లో సర్పంచ్ పదవులను కైవసం చేసుకుంది. ఈ పరిణామాలు జనసేన పార్టీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఇదే ఉత్సాహంతో మున్సిపల్, జెడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు జనసేన పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇలాంటి తరుణంలో మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న లక్ష్మీనారాయణ విశాఖపట్నం లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఓట్ల శాతంపై ఓ న్యూస్ చానెల్ డిబేట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీనారాయణ జనసేన పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ తమ ఓట్ల శాతాన్ని మరింత పెంచుకుందని చెప్పుకొచ్చారు. పార్టీపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీలో తిరిగి చేరతారా అంటే..పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే చేరతానంటూ చెప్పుకొచ్చారు.

అయితే పార్టీ వీడిన లక్ష్మీనారాయణ తిరిగి పార్టీలో చేరితే పార్టీకి మంచిదేనని పలువురు అంటున్నారు. ఇదే సందర్భంలో మరికొందరు ఆయన పార్టీ వీడిన అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. అప్పట్లో లక్ష్మీనారాయణ ఆరోపణలపై జనసైనికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఆయన రాకను జనసైనికులు స్వాగతిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

జనసేన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత లక్ష్మీనారాయణ మరే ఇతర పార్టీలో చేరలేదని..అలాగని జనసేన పార్టీపై విమర్శలు చేయలేదని పలువురు గుర్తు చేస్తున్నారు. ఆయన చేరిక వల్ల పార్టీకి మంచిదే తప్ప నష్టమేమీ లేదని పలువురు అంటున్నారు. లక్ష్మీనారాయణ రాకను చూసి మరికొందరు తిరిగి వచ్చే అవకాశం లేకపోలేదని పలువురు జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. మెుత్తానికి లక్ష్మీనారాయణ మనసులో మాట బయటపెట్టారు మరి ఆయన్ను పార్టీలో చేర్చుకుంటారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


Next Story