అందరి అభిప్రాయం అదే.. సొంత పార్టీకే ఈటల మొగ్గు..?

294
Eatala Rajendar

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్​ సొంత పార్టీ ఏర్పాటు చేసేందుకే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై తన సొంత నియోజకవర్గం నుంచి విదేశాల్లో ఉన్న సన్నిహితుల వరకూ అభిప్రాయాలను తీసుకుంటున్నారు. మరోవైపు ఈటల వర్గం సొంత పార్టీ ఏర్పాటుపై బీసీ వర్గాల నేతలు, గులాబీ బహిష్కృతులు, తెలంగాణ ఉద్యమకారుల నుంచి సైతం అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.

ఈటల కోసం కాదంటూనే కొత్త పార్టీని ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందంటూ చర్చిస్తున్నారు. ఇప్పటికే పలువురు తెలంగాణ ఉద్యమకారులతో మాట్లాడుతున్నారు. మెజార్టీ వర్గాలు సొంత పార్టీ అయితేనే మనుగడ ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

అధికార ‘గురి’ వద్దు..

బీసీ వర్గాలే ఎజెండాగా, అంబేద్కర్​ లక్ష్యాలే ఆశయంగా పార్టీ ఉండాలని పలువురు సూచిస్తున్నారు. దీనికి ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమం నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్​కు దూరమైనవారు, టీఆర్ఎస్​ దూరం పెట్టిన వారందరినీ కలుపుకుపోవాలని, ఇదే ప్రధాన ఎజెండాగా ఉంటే రాష్ట్రంలో గట్టి పోటీ ఉంటుందని ఈటలకు సూచిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పార్టీల మాదిరిగా ఒకే తరహా ఎజెండా… అధికారంపైనే గురి పెట్టుకుని ఉంటే మాత్రం కష్టమైన పరిస్థితులు ఉంటాయని, దీనిపై అన్ని వర్గాలతో చర్చించుకోవాలంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుముకగా నిలిచిన ప్రొపెసర్​ కోదండరాం నుంచి మొదలుకుని చెరుకు సుధాకర్, గాదె ఇన్నయ్య, విజయరామారావుతో సహా ఇప్పుడు సోషల్​ మీడియాతో హల్‌చల్ చేస్తున్న తీన్మార్​ మల్లన్న వరకు అందరితో జట్టు కట్టాలనే అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఎలా ఉంటుంది…?

మరోవైపు ఈటల వర్గం నుంచి కొంతమంది పార్టీ గుర్తు ఏర్పాటుపై ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ ఏర్పాటు కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్​ వరకూ కొంతమంది ఎన్నికల సంఘంలో పని చేసిన మాజీ అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయిన 49 పార్టీల వివరాలు, పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పేరుతోనే ఈటల పార్టీ ఉండాలనే కోణంలో వెతుకుతున్నట్లు సమాచారం. పార్టీ కోసం ముందుగా ఎలా ముందుకెళ్లాలి, పాత పార్టీ పేరును తీసుకుంటే ఎలా మార్పిడి చేసుకోవాలనే అంశాలపై కూడా ఆరా తీస్తున్నారు.

మెల్లగా… విమర్శలకు పదును..

ఇక మంత్రివర్గం నుంచి బర్తరఫ్​ చేసిన తర్వాత కూడా ఓపికతో ఉన్న మాజీ మంత్రి ఈటల… నియోజకవర్గానికి వెళ్లి, అక్కడ మద్దతుదారులతో చర్చల అనంతరం విమర్శలకు పదును పెడుతున్నారు. తప్పుడు సలహాలతో సీఎం తనపై కక్ష కడుతున్నట్లు చెప్పిన మంత్రి… మంత్రివర్గంలో ఉండి కూడా ప్రగతిభవన్​కు వెళ్లే పరిస్థితి లేదని, సీఎంను కలిసేందుకు వెళ్లినా అవకాశం రాదని, అహంకారంతో ఉంటారంటూ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మంత్రులు తనపై చేసిన విమర్శలను కూడా తిప్పికొట్టారు.

రేపో, మాపో రాజీనామా..?

కాగా, రాజేందర్​ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు రోజులుగా తన మద్దతుదారులు, పలువురు పార్టీ నేతలు, ఉద్యమ సమయంలోని సన్నిహితులతో చర్చించిన ఈటల… రేపో, మాపో ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి నుంచి సొంత నియోజకవర్గమైన హుజురాబాద్​లో వెంట నడిచే పార్టీ నేతలు, సన్నిహితులు, హితులతో విడతలవారీగా సమావేశమవుతున్నారు. సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అటు ఉమ్మడి జిల్లా, రాష్ట్రస్థాయి నుంచి కూడా పలు ప్రజా సంఘాలు ఈటలకు మద్దతు ప్రకటిస్తున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..