అలా వద్దు.. నేరుగా కలవండి!

by  |
అలా వద్దు.. నేరుగా కలవండి!
X

దిశ, మెదక్ : యావత్ ప్రపంచం కరోనా వైరస్ తో యుద్ధం చేస్తుంటే సైబర్ నేరగాళ్లు మాత్రం తమకేమి పట్టనట్లు వారి పని వారు చేసుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈఎంఐల విషయంలో ఆర్బీఐ మారటోరియం ప్రకటించింది. దీన్నే ఆసరాగా చేసుకుని అడ్డగోలుగా దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. దీంతో అధికారులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. సైబర్ మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ కష్ట పరిస్థితుల్లో ఈఎంఐలు కట్టడం కత్తిమీద సాములా మారింది. ప్రజలకు చేతిలో పని లేకుండా పోవడంతో డబ్బు సంపాదన ఆగిపోయింది. ఉన్న కొంత డబ్బు ఈఎంఐలకు చెల్లిస్తే చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోతుంది. దీంతో ఆర్బీఐ ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించుకోవాలని చాలామంది రుణగ్రహీతలు ఆసక్తితో ఉన్నారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. బ్యాంక్ ఈఎంఐలు, మనప్పురం, ముత్తూట్ లాంటి గోల్డ్ లోన్ సంస్థలతోపాటు మందుబాబులకు కూడా గాలం వేస్తున్నారు. ప్రస్తుతం మందు దొరకడంలేదు. తాము పంపిన లింక్ ద్వారా డబ్బులు పంపిస్తే . . మందు మీ ఇంటివద్దకే డోర్ డెలివరీ చేస్తామని నమ్మిస్తున్నారు. ఆ మాటలు నిజమని నమ్మి, వారు పంపే, మెసేజ్ లు, ఓటీపీలు, లింక్ ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తే చేతులు కాల్చుకోక తప్పదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంక్ సిబ్బంది ఎటువంటి మెయిల్స్ , ఫోన్ కాల్స్ చేయరు.. బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు, ఓటీపీ నంబర్ వంటి వివరాలేవీ ఎవరికీ వెల్లడించొద్దని, ఏదైనా సందేహాలు ఉంటే నేరుగా బ్యాంక్ బ్రాంచ్ నే సంప్రదించడం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు.

Tags: banks, EMI, accounts, details, cyber crime

Next Story

Most Viewed