వ్యాక్సిన్ వేసుకోకున్నా సర్టిఫికెట్.. టార్గెట్ పూర్తి చేయడమే వారి లక్ష్యం

by  |
vaccination
X

దిశ, శేరిలింగంపల్లి: దేశవ్యాప్తంగా అందరికీ కరోనా వ్యాక్సిన్ వేసేందుకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే దేశ వ్యాప్తంగా 110 కోట్ల పైచిలుకు మందికి వ్యాక్సిన్ వేసినట్లు అధికారిక వెబ్‌సైట్ కొవిన్‌లో అప్‌డేట్ చేశారు. అయితే ఇందులో అసలు వ్యాక్సిన్ వేసుకున్నది ఎంతమంది అనేదానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ వేయకున్నా వేసినట్లు పేర్లు నమోదు చేస్తున్నారా? అంటే అవుననే చెప్పాలి. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. నెల రోజుల క్రితమే మృతి చెందిన మా తాతకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసినట్లు మెసేజ్ చేశారని పేర్కొంటూ ఇటీవల ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా.. మరోసారి వైద్యాధికారులు వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్లు మెసేజ్ చేసి వారి పనితీరు ఎలా ఉందో చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో నివాసం ఉండే సువర్ణ అక్టోబర్ 19న ఉదయం 11.56 నిమిషాలకు వారి అమ్మగారి ఊరిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. అప్పుడే వారి ఫోన్ నెంబర్‌కు మీరు విజయవంతంగా వ్యాక్సిన్ వేయించుకున్నారు అంటూ మెసేజ్ వచ్చింది.

తాజాగా.. వారి అత్తగారి ఊరిలో ఈనెల 12న మధ్యాహ్నం 2.07 గంటలకు మళ్లీ మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు మరోసారి మెసేజ్ వచ్చింది. అంతేకాదు సెకండ్ డోస్ ఎప్పుడు వేసుకోవాలో డేట్ కూడా మెన్షన్ చేశారు. దాదాపు నెల ముందుగానే టీకా వేయించుకున్న తనకు ఇదేంటి ఇప్పుడు వేయించుకున్నట్లు మెసేజ్ వచ్చింది అని ఆమె ఆందోళనతో గ్రామంలోని పీహెచ్‌సీ సిబ్బందిని సంప్రదిస్తే.. మీరు వేయించుకున్నా.. వేయించుకోకపోయినా మాకు టార్గెట్ ఉంది కాబట్టి అందరికీ వేసినట్లు వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తున్నాం. ఓటర్ లిస్ట్ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ వేసినట్లు ఎంటర్ చేస్తున్నామని తెలిపారు. మీరు హైదరాబాద్‌లో ఉంటున్నా, గ్రామ ఓటర్ లిస్ట్‌లో పేరుంది కాబట్టి ఇక్కడ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. అలాగే వారి భర్త అనారోగ్య కారణాలతో వ్యాక్సిన్ వేయించుకోలేదు. కానీ ఆయనకు తెలియకుండానే వ్యాక్సిన్ వేసుకున్నట్లు మెసేజ్ పంపారు అధికారులు.

ఆధార్ జిరాక్స్ ఉంటే చాలు

ఇంటింటికీ తిరిగే ఆశావర్కర్లు ఏదో ఓ సందర్భంలో సేకరించిన వ్యక్తిగత ఆధార్ కార్డుల్లో ఉండే అడ్రస్‌లు, ఫోన్ నెంబర్ల ఆధారంగా కరోనా వ్యాక్సిన్ వేసినట్లుగా ధృవీకరిస్తూ కొవిన్ యాప్‌లో ఆ డీటైల్స్ ఎంటర్ చేస్తుండడంతో ఆటోమేటిక్‌గా వ్యాక్సిన్ పూర్తి అయ్యిందని మెసేజ్‌లు ఫార్వర్డ్ అవుతున్నాయి. దీంతో అసలే వేసుకోలేని వారు, గతంలో వేరేచోట వేసుకున్న వారికి కూడా తాజాగా వ్యాక్సిన్ వేసుకున్నట్లు మెసేజ్‌లు వస్తున్నాయి.

ఇలా అయితే ఎలా..

కరోనా కట్టడి దిశగా ప్రయత్నాలు చేయాల్సిన వైద్యాధికారులు కేవలం టార్గెట్ పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో వ్యాక్సిన్ వేయకున్నా, ఆల్రెడీ వేరేచోట వేసుకున్నా యాప్‌లో ఎంటర్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఏదో ఒకరిద్దరికో కాదు చాలా చోట్ల ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలా అయితే కరోనా కట్టడి సాధ్యమేనా..? తిరిగి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది వైద్య ఆరోగ్యశాఖ అధికారులకే తెలియాలి అని మండిపడుతున్నారు.



Next Story