ముందుకా.. వెనక్కా?

53

“ముందు నుయ్యి.. వెనక గొయ్యి..” ఇప్పుడు ఉద్యోగ సంఘాలది ఇదే పరిస్థితి. ఏండ్ల తరబడి పేరుకున్న సమస్యలను ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. అటు ప్రభుత్వానితో పోరాటం చేసేందుకు ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఇటు కిందిస్థాయి ఉద్యోగులకు సమాధానం చెప్పలేక.. వారిని సముదాయించలేని స్థితి. ఇక పీఆర్సీ అంశంలో ఉద్యోగుల విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి. పీఆర్సీ వస్తుందా.. లేదా అనేది సందేహంగానే భావిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఎమ్మెల్సీ ఎన్నికలో, వచ్చేనెలలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయితే ఇక పీఆర్సీ అంశం మళ్లీ పెండింగ్‌లో పడ్డట్లే. దీంతో ఉద్యోగ సంఘాలపై నేతలు ఒత్తిడి తెస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగుల ఆకాంక్షలను సీఎం కేసీఆర్ దాకా ఎలా తీసుకుపోవాలనే సంకటస్థితిలో ఉద్యోగ సంఘాలున్నాయి. ప్రస్తుతం ఉద్యోగ జేఏసీ నుంచి ఉపాధ్యాయ సంఘాలు, ఆర్టీసీ కార్మికులు విడిపోగా.. పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖ, కమర్షియల్ ట్యాక్స్, అబ్కారీ వంటి శాఖలు ఉన్నా లేనట్టే. ఎందుకంటే చాలా అంశాల్లో ఆ సంఘాలే సొంతంగా పరిష్కారానికి దిగుతున్నాయి. దీంతో జేఏసీ అవసరం లేకుండానే వ్యవహరిస్తున్నారు. ఉద్యోగ సంఘాల్లో పెద్ద యూనియన్​గా భావించే టీఎన్జీఓతో పాటు టీజీఓ, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, డ్రైవర్ల సంఘం మాత్రమే యాక్టివ్‌గా ఉంటున్నాయి. అటు రెవెన్యూ సంఘం కూడా సంబంధం లేదన్నట్టే వ్యవహరిస్తోంది. ప్రస్తుతం పీఆర్సీ అంశంలో మాత్రం జేఏసీగానే ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఫిట్‌మెంట్ అంశం సాగదీతలోనే ఉంది. సీఎం కేసీఆర్ షెడ్యూల్ ప్రకటించినా.. ఎటూ తేలడం లేదు. త్రిసభ్య కమిటీ ఉన్నతాధికారుల బృందం వేతన సవరణ కమిషన్​ నివేదికను కనీసం చదవలేదు. దీంతో ఎప్పుడు తేలుతుందనేది ఎవరికీ తెలియని ప్రశ్నగానే మారింది. కానీ ఉద్యోగ సంఘాల జేఏసీ మాత్రం ఎంతో కొంత ఆశ పెట్టుకుంది. అయితే ఇప్పుడు ఒక్కోరోజు గడుస్తున్నకొద్దీ పీఆర్సీ అంశంలో వ్యతిరేకత బయటకు వస్తోంది. ముందుగా ఉద్యోగ సంఘాలపై ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి భజన సంస్థగా మారాయంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో దీనిపై విస్తృతంగా వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల ఆగ్రహాన్ని సీఎం దాకా ఎలా తీసుకుపోవాలనే సందిగ్ధంలో జేఏసీ ఉంటోంది.

ఉద్యమం చేస్తే తట్టుకుంటామా..?

పలు అంశాలపై సీఎం కేసీఆర్​ఉద్యోగులకు తీపివార్త అంటూ ప్రకటన చేస్తున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. గతనెల 30న ఉద్యోగ సంఘాలను విందుకు పిలిచిన సీఎం కేసీఆర్ పీఆర్సీ, పదోన్నతులు, బదిలీల అంశంపై హామీలిచ్చారు. పీఆర్సీ నివేదికను రెండు వారాల్లో తేలుస్తామన్నారు. కానీ ఇప్పటికీ ముడికూడా విప్పడం లేదు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి తీసుకువస్తామని ప్రకటించారు. రెండు వారాలు దాటినా దానిపై ఉలుకు పలుకూ లేదు. పదోన్నతులకు సంబంధించిన అంశంలో రెండేండ్ల సర్వీసుకు కుదిస్తూ సోమవారం ఫైల్‌పై సీఎం సంతకం చేశారు. అయితే ఉపాధ్యాయుల పదోన్నతుల విషయం కోర్టుకెక్కింది. ఇక పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం వెనకాడుతోంది. ఏజ్ పెంపు నిర్ణయాన్ని టీజీఓ వ్యతిరేకిస్తోంది. కింది స్థాయి ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వానికి చెప్పేందుకు కూడా ఉద్యోగ సంఘాలు జంకుతున్నాయి. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే తట్టుకుంటామా? అనే భయంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదే అతి ఎక్కువ కాలం పీఆర్సీ

వాస్తవంగా పీఆర్సీ అంశంలో చాలా సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశాయి. 1986లో ఎన్టీ రామారావు హయాంలో ఉద్యోగ సంఘాల తరపున నాయకత్వం వహించిన స్వామినాథన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపారు. 52 రోజులు సమ్మె చేశారు. అప్పటికి పీఆర్సీ పెండింగ్‌లో ఉన్న సమయం రెండేండ్లు మాత్రమే. ఆ తర్వాత ఉద్యోగులపై ఉక్కుపాదం మోపిన చంద్రబాబు హయాంలో కూడా ఉద్యోగ సంఘాలు నిరసనలకు దిగాయి. టీఎన్జీఓ నాయకత్వం వహించింది. అనంతరం తెలంగాణ ఉద్యమంలో విధులన్నీ పక్కనపెట్టి ఉద్యమంలో భాగస్వాములయ్యారు. టీఎన్జీఓ ఉద్యమంలోకి వచ్చిన తర్వాతే ఉద్యమం వేడెక్కింది. ఇలా ఉద్యమాలు చేసిన ఉద్యోగ సంఘాలు ఇప్పుడు కనీసం డిమాండ్​చేసేందుకు కూడా నోరెత్తని పరిస్థితి. ఎప్పుడు, ఎలా మాట్లాడితే ఇరుక్కుంటామనే భయంలో ఉంటున్నారు. వాస్తవంగా పీఆర్సీ ఎక్కువ కాలం సాగదీసింది కూడా ఇప్పుడే. ఉద్యోగ వర్గాల చరిత్రలో 25 నెలల కాలమే అతి ఎక్కువ కాలం పట్టిన పీఆర్సీ. ఆ తర్వాత ఇప్పుడు స్వరాష్ట్రంలో 31 నెలల పాటు ఎదురుచూస్తూనే ఉన్నారు.

అశ్వత్థామరెడ్డి ఉత్థాన పతనం సాకుగా..!

ఆర్టీసీ కార్మికులను ఏకం చేసి 53 రోజులు సమ్మె చేయడంలో ముందుండి నడిపించిన ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డిపై ప్రభుత్వం పగబట్టింది. కక్ష సాధిస్తోంది. ఆర్టీసీ యూనియన్లను పక్కన పెట్టించిన సీఎం కేసీఆర్ కార్మికులను ఏదో విధంగా దగ్గర చేసుకున్నారని స్పష్టమైంది. దీంతో అశ్వత్థామరెడ్డి ఉద్యోగానికి కూడా దూరమయ్యారు. ఈ పరిస్థితిని సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలకు ఉదాహరణగా చూపిస్తున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అందుకే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై వ్యతిరేక జెండా ఎత్తేందుకు వెనకడుగు వేస్తున్నాయంటున్నారు. ఈ పరిణామాల్లో ఉద్యోగ సంఘాలు మాత్రం అత్యంత సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయని స్పష్టంగా చెబుతున్నారు. ప్రభుత్వంతో సయోధ్యగా ఉంటూనే సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని, ఉద్యమం చేస్తే సంఘాలకే ప్రమాదమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కిందిస్థాయి ఉద్యోగులు మాత్రం తిరుగుబాటు చేస్తేనే సమస్యలు సాధించుకుంటామని ఉద్యోగ జేఏసీపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లా సమావేశాలకు వెళ్తే తిరగబడుతున్నారు. అందుకే జేఏసీ, టీఎన్జీఓ, టీజీఓ తరపున జిల్లా పర్యటనలను రద్దు చేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ నుంచి స్పష్టమైన వైఖరి వచ్చిన తర్వాతే జిల్లా స్థాయి సమావేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.