బిగ్ బ్రేకింగ్: రేపటి నుండే పురపోరు

by  |
State Election Commission
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పురపోరు మొదలైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్​ షెడ్యూల్​ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల పర్వం మొదలుకానుంది. అదే రోజున రిటర్నింగ్​ అధికారులు తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు. ఈ నెల 18న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు. 19న నామినేషన్ల పరిశీలన ఉండగా… 20న తిరస్కరించిన నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 21న నామినేషన్లపై అభ్యంతరాలను పరిష్కరిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 22న అవకాశం కల్పించారు. అదే రోజున సాయంత్రం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను, గుర్తులను విడుదల చేస్తారు.

ఈ నెల 30న పురపాలికల్లో పోలింగ్​ నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ ఉంటుంది. అనివార్య కారణాలతో రీపోలింగ్​ ఉంటే వచ్చేనెల 2న నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మే 3న నిర్వహిస్తున్నట్లు ఎస్​ఈసీ ప్రకటించింది. రాష్ట్రంలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈసారి ప్రచారానికి ఆరు రోజుల సమయం విధించారు. ఈ నెల 22న అభ్యర్థుల తుది జాబితా తర్వాత ప్రచారం ఉంటోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం 28న సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించారు.

వరంగల్​ కార్పొరేషన్​లో 66, ఖమ్మంలో 60, నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో 20, సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీలో 43, నల్గొండ జిల్లా నకిరేకల్​ మున్సిపాలిటీలో 20, మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో 27, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఏడు పురపాలికల్లో మొత్తం 11,26,221 మంది ఓటర్లు ఉండగా… 5,53,862 మంది పురుషులు, 5,72,121 మంది మహిళలు, 236 మంది ఇతరులున్నారు. మొత్తం 248 వార్డులను విభజించారు. 1532 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల కోసం 203 రిటర్నింగ్​ అధికారులు, 203 మంది అసిస్టెంట్​ రిరట్నిగ్​ అధికారులు, 6070 పోలింగ్​ సిబ్బంది, 1555 మంది కౌంటింగ్​ సిబ్బంది, 97 మంది జోనల్​ అధికారులు, 33 ఫ్లయింగ్​ స్క్వాడ్​ బృందాలు, 22 సర్వెలైన్స్​ బృందాలు, 8 మంది జనరల్ అబ్జర్వర్లు, 778 మంది మైక్రో అబ్జర్వర్లు, 10 వ్యయ పరిశీలన బృందాలు, 20 మంది అదనపు వ్యయ పరిశీలన సిబ్బందిని నియమించారు. ఈ ఎన్నికలకు 2479 బ్యాలెట్​ బాక్స్​లను వినియోగిస్తున్నారు.



Next Story

Most Viewed