TGPSC OTR Update: ఓటీఆర్ సవరణపై మరో కీలక అప్డేట్.. అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

by Jakkula.Mamatha |   (  Updated:2026-03-12 14:01:46  IST  )

టీజీపీఎస్సీ (TGPSC) నిర్వహించే ఉద్యోగ నియామక ప్రక్రియలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్(OTR) అనేది అత్యంత ముఖ్యమైనది.

TGPSC OTR Update: ఓటీఆర్ సవరణపై మరో కీలక అప్డేట్.. అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!
X

దిశ,వెబ్‌డెస్క్: టీజీపీఎస్సీ (TGPSC) నిర్వహించే ఉద్యోగ నియామక ప్రక్రియలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్(OTR) అనేది అత్యంత ముఖ్యమైనది. భవిష్యత్తులో టీజీపీఎస్సీ విడుదల చేసే నోటిఫికేషన్లకు అభ్యర్థికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, కుల ధ్రువీకరణ, స్థానికత(Local/Non-local) వంటి అన్ని వివరాలు ఒకే చోట డిజిటల్ రూపంలో ఓటీఆర్‌లో భద్రపరచబడతాయి. దీంతో ప్రతి నోటిఫికేషన్‌కు మళ్ళీ పూర్తి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. అందువల్ల టీజీపీఎస్సీ విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది.

ఒక్కసారి OTR పూర్తి చేస్తే భవిష్యత్తులో వచ్చే గ్రూప్-1, 2, 3, 4 వంటి ఏ నోటిఫికేషన్‌కైనా కేవలం మీ TGPSC ID మరియు పుట్టిన తేదీతో లాగిన్ అయి సంబంధిత పోస్టులకు ఫీజు చెల్లించి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. గత నెల(ఫిబ్రవరి) 25 వరకు ఉన్న ఓటీఆర్ సవరణ గడువు కమిషన్ మార్చి 25 వరకు పొడిగించింది. అభ్యర్థుల అభ్యర్థనలు మరియు సర్టిఫికేట్ల అప్లోడింగ్‌లో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా టీజీపీఎస్సీ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు మాత్రమే ఓటీఆర్‌లో పొందుపరిచేందుకు వెసులుబాటు కల్పిస్తుంది.

ఏడాదికి రెండు సార్లు..?

టీజీపీఎస్సీ తాజాగా ఒక కొత్త సంస్కరణను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇక పై అభ్యర్థులు ఏడాదికి రెండుసార్లు మాత్రమే తమ ఓటీఆర్‌ను అప్‌డేట్ చేసుకునే వీలుకల్పిస్తుంది. ప్రతి ఏటా జనవరి, జూన్ నెలల్లో సుమారు 10 రోజుల పాటు ఈ విండో అందుబాటులో ఉంటుంది. ఈ తరుణంలో కొత్తగా పొందిన విద్యార్హతలు లేదా ఇతర మార్పులను మాత్రమే నమోదు చేసుకోవాలి.

ముందుగా తనిఖీ చేసే సర్టిఫికేట్స్ ఇవే!

ఓటీఆర్‌లో నమోదు చేసిన కుల, ఆదాయ, క్రిమీలేయర్, నాన్ క్రిమీలేయర్, విద్యార్హతల వివరాలను టీజీపీఎస్సీ ముందస్తుగా తనిఖీ చేస్తుంది. ఈ క్రమంలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌లో పొందుపర్చిన విద్యార్హతల ఆధారంగా భవిష్యుత్తులో ఏదైనా నోటిఫికేషన్లకు వారు అర్హులా? లేదా అనేది టీజీపీఎస్సీ గుర్తిస్తోంది. అందులో నమోదు చేసిన వివరాలను టీజీపీఎస్సీ మీసేవ, యూనివర్సిటీ, ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్య సహాయంతో పరిశీలిస్తుంది. ఎవరైన తప్పుడు ధ్రువీకరణతో నమోదు చేసినట్లు వెల్లడైతే వెంటనే వారి ఓటీఆర్ రద్దు చేస్తుంది.

తప్పనిసరి మార్పులు..

రాబోయే కొత్త నోటిఫికేషన్లకు(గ్రూప్-1, 2, 3, 4) దరఖాస్తు చేయాలంటే పాత ఓటీఆర్ వివరాలను అప్‌డేట్ చేయడం ఇప్పుడు తప్పనిసరిగా పేర్కొంది. ప్రస్తుతం ఓటీఆర్‌ సవరణలో చేయాల్సిన మార్పులు ఇవే.

*అభ్యర్థులు తమ తాజా కలర్ ఫోటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

* విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లను డిజిటల్ రూపంలో అప్‌లోడ్ చేయాలి.

*కొత్తగా పొందిన అదనపు విద్యార్హతలను నమోదు చేయడంతో పాటు దానికి సంబంధించిన ధ్రువపత్రాలు సమర్పించాలి.

*ఓటీఆర్‌లో అదనపు అర్హతలు చిరునామా, EWS, నాన్ క్రిమీలేయర్ కేటగిరీలు, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ మినహా మిగతా వివరాలు అప్‌డేట్ చేయడానికి వీల్లేదు

*ఎస్సీ వర్గీకరణలో జరిగిన మార్పుల దృష్ట్యా, ఆ కేటగిరీ అభ్యర్థులు తమ వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.

*గమనిక:అభ్యర్థులు పాత TSPSC ఐడీని ఉపయోగిస్తుంటే.. అందులో ముఖ్య విషయాన్ని గమనించాలి. అది ఏంటంటే.. ప్రస్తుతం లాగిన్ అయినప్పుడు 'TS' స్థానంలో 'TG' అని టైప్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన అంకెలు అవే ఉంటాయి.

Next Story