ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్.. పేదపిల్లల కోసం బడి బస్సు

by  |
ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్.. పేదపిల్లల కోసం బడి బస్సు
X

దిశ, ఫీచర్స్ : కొవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల ఎడ్యుకేషన్ సెక్టార్ సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. స్కూళ్లు తెరుచుకోక, ఆన్‌లైన్ క్లాసులు వినే స్థోమత లేక చాలామంది పిల్లలు చదువుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో వెనుకబడిన వర్గాల పిల్లలకు చదువు చెప్పాలనుకున్న ముంబై వాసి ఓ బస్సును తరగతి గదిగా మార్చేశాడు. కొన్నాళ్లుగా ఓ బస్సు ఖాళీగా ఉండటాన్ని గమనించిన సోషల్ వర్కర్ అశోక్ కుర్మి.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. ఈ మేరకు ఆగస్టు 15వ తేదీన 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొబైల్ పాఠశాలను ప్రారంభించాడు.

మురికివాడల పిల్లలకు ఆన్‌లైన్ యాక్సెస్..

కుర్మి తన ప్రయత్నంలో భాగంగా.. మురికివాడల్లో నివసించే పేదపిల్లలు, వసతులు లేక వర్చువల్ క్లాసులకు దూరమైన వారికి సహాయం చేయాలని యోచించాడు. ప్రస్తుతానికి ఈ స్కూల్.. ఓల్డ్ ఆంటోప్ హిల్ పోస్ట్ ఆఫీస్‌ వద్ద నడుస్తుండగా, దశలవారీగా వివిధ డిపార్ట్‌మెంట్స్‌ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా ‘సియోన్స్ ఫ్రెండ్స్ సర్కిల్’ తరఫున ఈ పాఠశాలకు నిధులు అందించిన కొంతమంది.. సామాజిక ప్రయోజనం కోసం వారి ఆదాయం నుంచి ఒక శాతాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఇక పాండమిక్ టైమ్‌లో శాంటా వేషం ధరించి జనాలకు మాస్క్‌లు పంపిణీ చేసిన కుర్మి.. స్పైడర్‌మ్యాన్ వేషంలో ముంబైలోని పలు బహిరంగ ప్రదేశాలను కూడా శుభ్రపరిచాడు. అంతేకాదు డోరెమోన్ గెటప్‌లో వెళ్లి మురికివాడల్లో నివసించేవారికి ఉచితంగా హెయిర్ కట్ చేశాడు.

దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో దాదాపు 2.96 కోట్లకు పైగా పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు డిజిటల్ డివైస్‌లు లేవు. ప్రధానంగా బీహార్‌ రాష్ట్రంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అయితే మొత్తం 2.96 కోట్ల మందిలో ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల విద్యార్థులను చేర్చలేదు. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఉత్తర ప్రదేశ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల డేటా ఇంకా అందలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.


Next Story