రౌడీయిజానికి రాజకీయం ముసుగు వేస్తే..!

by Ravi |   (  Updated:2026-02-11 01:00:52  IST  )

ప్రభుత్వాలు మారినప్పుడు కక్ష సాధింపు చర్యలు సహజమని భావించే కాలంలో, ప్రస్తుత ప్రభుత్వం చట్టాన్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లడాన్ని కొందరు అలుసుగా తీసుకుంటున్నారు.

రౌడీయిజానికి రాజకీయం ముసుగు వేస్తే..!
X

ప్రభుత్వాలు మారినప్పుడు కక్ష సాధింపు చర్యలు సహజమని భావించే కాలంలో, ప్రస్తుత ప్రభుత్వం చట్టాన్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లడాన్ని కొందరు అలుసుగా తీసుకుంటున్నారు. చట్టబద్దమైన పాలన దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వ పాలననీ చేతగాని తనం అనుకోవడం వైసీపీ అవివేకానికి తార్కాణం..

చట్టాన్ని అమలు చేయడమంటే హింస చేయడం కాదు, తప్పు చేసిన వారికి చట్టం ద్వారా శిక్ష పడేలా చూడటం. ఈ మౌనాన్ని చేతకాని తనంగా భావిస్తే, చట్టం తన పని తాను చేసుకుపోయినప్పుడు వచ్చే ఫలితం తీవ్రంగా ఉంటుంది.

విశ్వసనీయత నిజంగా ఉందా?

రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సహజం. గెలిస్తే తన ఇష్టారాజ్యంగా పాలిస్తామంటే కుదరదు.. ప్రజల్లో ఒక రకమైన భయాందోళన సృష్టించి, ఏవేవో అంశాలను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించడం అనేది తగదు.. అధికారంలో ఉన్నప్పుడు సమర్ధించి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని వ్యతిరేకిస్తాం అంటే కుదరదు. ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.. ఒక రాజకీయ నాయకుడిగా పాటించాల్సిన కనీస విలువలు, ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన కనీస విశ్వసనీయత లేకుండా వైసీపీ రాజకీయం నడిపింది. ఇప్పుడు కూడా అలాగే నడపాలని చూస్తోంది. ప్రత్యర్థి పార్టీల నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. తాను చేస్తే నీతి, ప్రత్యర్థి చేస్తే బూతు అన్నట్టు రాజకీయం చేస్తోంది.

వాలంటీర్ల కంటే ఘోరమైన బతుకులు!

రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లను రాజకీయ అవసరాలకు వాడుకుని రోడ్డున పడేసిన జగన్, ఇప్పుడు తన సొంత పార్టీ నేతలను కూడా అదే బాటలో నడిపిస్తున్నారు. బూతులు మాట్లాడితేనే పదవులు, గుర్తింపు దక్కుతాయనే భ్రమలో ఉన్న నేతలు.. ఆ భాష వల్లే ప్రజల్లో చీదరింపుకు గురవుతున్నారు.. వ్యక్తిగత ప్రతిష్టను పణంగా పెట్టి పార్టీ కోసం తిట్లు తింటున్నా, కనీసం నైతిక మద్దతు ఇచ్చే నాథుడు లేకపోవడం వైసీపీ నేతల దుస్థితికి అద్దం పడుతోంది. వాలంటీర్లకైనా కనీసం గుర్తింపు ఉండేదేమో కానీ, ఈ కాలకేయ నేతలకు మాత్రం సొంత పార్టీలోనే గౌరవం లేని పరిస్థితి నెలకొంది.

ఈ నేతలు పునరాలోచించుకోవాలి!

ఇన్ని అవమానాలు, ఇంతటి నిర్లక్ష్యం ఎదురవుతున్నా ఇంకా ఆ పార్టీలో కొనసాగడం అంటే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే.. తప్పు చేసినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంటే, కాపాడే వారు లేక, కనీసం ఓదార్చే వారు లేక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ఈ నేతలు తమ భవిష్యత్తుపై పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వాడుకుని వదిలేసే సంస్కృతి ఉన్న చోట విధేయత చూపడమంటే, తమ రాజకీయ జీవితాన్ని తామే చేజేతులా సమాధి చేసుకోవడమే.. సిగ్గులేని ఈ బానిస బతుకుల కంటే, స్వతంత్రంగా ఉండటమే మేలనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

నాటి సంఘటనలు మరచిపోయారా?

అప్పటి వైసీపీ నేతలు గంట అరగంట భాగోతాలు, అనంత బాబు డోర్ డెలివరీ అరాచకాలు, గోరంట్ల మాధవ్ విశ్వరూపాలు ఆస్వాదించిన జగన్ ఇప్పుడు అరవ శ్రీధర్ విషయంలో విలువలు అంటూ ఉపన్యాసాలు చేస్తున్నారు. తాను చేస్తే నీతి.. ఎదుటివాడు చేస్తే బూతు అన్నట్టు హంగామా చేస్తున్నారు.. నాడు చంద్రబాబు అరెస్ట్ సక్రమం అన్నారు. ఇప్పుడు మాత్రం అరెస్టులు చేస్తే అక్రమం అంటున్నారు. అయితే జనాలు అన్ని గమనిస్తున్నారన్న విషయాన్ని మరిచిపోతున్నారు. తమదైన మార్కు రాజకీయంతో ముందుకు వెళుతున్నారు. ప్రజల ఆలోచన గతి తప్పితే మాత్రం పాచిక పారుతుంది. లేకుంటే వైపీపీ మరింత పతన స్థితికి చేరుకుంటుంది.

బూతులతో దాడి చేయడమే రాజకీయమా?

రాజకీయ విమర్శలు సిద్ధాంతపరంగా ఉండాలి కానీ, వ్యక్తిగత దూషణలుగా మారకూడదు.. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా వాడుతున్న భాష రాష్ట్ర రాజకీయ సంస్కృతిని దిగజార్చుతోంది. దీన్ని ఆదిలోనే అరికట్టకపోతే, భవిష్యత్ తరాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కాలకేయ ధోరణితో రెచ్చిపోతున్న వారికి చట్టపరమైన కఠిన చర్యలే సరైన మందు. నోటి పారుదలని ప్రజాస్వామ్య హక్కుగా భావించలేం. ప్రజల్లో అలజడి సృష్టించి, ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలనేది ఒక వ్యూహాత్మక కుట్రలా కనిపిస్తోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రభుత్వం సహనం కోల్పోయేలా చేసి, ఆపై బాధితుడి కార్డు ప్లే చేయాలనేది పాత పద్ధతి. ఇలాంటి వ్యూహాలను చిత్తు చేయాలంటే, ప్రభుత్వం ఊహించని రీతిలో, పక్కా ఆధారాలతో చట్టపరమైన ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

వణుకు పుట్టిస్తేనే.. భయం !

గతంలో డీజీపీ వంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని కూడా రాజకీయ అవసరాలకు వాడుకున్న తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ల ముందే ఉంది. ఇప్పుడు ఆ వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతోంది. చట్టం తన పని తాను చేయనివ్వడం అంటే అధికారులకు స్వేచ్ఛ నివ్వడం. దీన్ని ప్రభుత్వం బలహీనతగా భావించడం వైసీపీ నేతల అవివేకం. వ్యవస్థలు ఒక్కసారి యాక్టివేట్ అయితే, అరాచక శక్తులకు పారిపోయే దారి కూడా దొరకదు. ప్రజాస్వామ్యంలో అడ్డగోలుగా తిడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిని ఉపేక్షించడం అంటే పరోక్షంగా వారిని ప్రోత్సహించడమే అవుతుంది. మిగిలిన వారు ఇలాంటి ధైర్యం చేయకుండా ఉండాలంటే మొదట్లోనే చెలరేగే వారిపై కఠినంగా వ్యవహరించాలి. రౌడీయిజానికి రాజకీయం ముసుగు వేస్తే అది చెల్లదని నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది..

-వాసంశెట్టి సుభాష్

కార్మికశాఖ మంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Next Story