సామాజిక శాస్త్రం:'సోషల్' సాలెగూడులో యువత

by Disha edit |
సామాజిక శాస్త్రం:సోషల్ సాలెగూడులో యువత
X

ప్రజా చైతన్యమే సోషల్ మీడియా అక్రమాలకు విరుగుడు. మంచిని ప్రోత్సహించాలి. ప్రజా సమస్యలను సమర్థవంతంగా వివరించి విశ్లేషించి, పరిష్కరించడానికి ప్రయత్నించే ఇతర వేదికలను ఆదరించాలి. ప్రజలకు ఉపయోగపడని విషయాలను, ప్రసారం చేస్తున్న సంస్థలను తిరస్కరించాలి. భాష, ఆలోచన, విధానం, ఆచారాలు, పండుగలు మన దేశ సంస్కృతి అని గుర్తించాలి. వ్యసనాలకు దూరంగా ఉంటూ వీటన్నింటిని కాపాడుకోవాలి. సోషల్ మీడియా అంతా చెడ్డదని కాదు, దీని వినియోగంతో మంచి మార్పులు వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. కరోనా సమయంలో యువత సోషల్ మీడియాలో గ్రూపులుగా ఏర్పడి అమూల్య సేవలు అందించారు. టీనేజ్ దశకు కూడా చేరుకోని పిల్లలలో నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఉంది.

నేటి సాంకేతిక ప్రపంచంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి సులభంగా అందుబాటులోకి వచ్చింది. స్వల్ప కాలంలోనే అనేక సామాజిక మీడియా సైట్లు ఉద్భవించి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సాధారణంగా సోషల్ మీడియా ప్రజలకు కమ్యూనికేట్ చేయడానికి, వారితో పరస్పర చర్చలు, సంబంధాలు కొనసాగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఉద్యమాలు మొదలుకొని, ఊసుపోని సరదా కబుర్ల వరకు సోషల్ మీడియా చక్కని ప్లాట్ ఫామ్. దీనిని ఎంతలా ఉపయోగించుకోవాలనేది యువతకు తెలియకపోవడమే అసలు సమస్య. సోషల్ మీడియా ఒక సాలెగూడు. అంతకు మించి విష వలయం. ఒక్కసారి అందులోకి దూరితే తిరిగి బయటకు రాలేం. 2006 నుంచి 2016 వరకు రోజుకు గంట లేదా రెండు గంటలు ఉండేది.

4జీ టెక్నాలజీ అందుబాటులోకి రాగానే యువత జీవితంలో సోషల్ మీడియా ఒక భాగమైంది. వారి చదువులో తీవ్ర ప్రభావం చూపింది. ఎంతలా అంటే పాఠ్యపుస్తకంలోని పాఠాలు కూడా అర్థం చేసుకోలేనంతగా. సమాచార మాధ్యమాలు ప్రజల పురోగతికి తోడ్పడే సాధనాలుగా ఉండాలి. కానీ, ఇవి జీవిత ప్రమాణాలు, ఆలోచనలు, సంస్కృతి, సాహిత్యాల మీద తీవ్ర ప్రభావాలను కలిగించి, మన రాజకీయ, సామాజిక, దిశ దశను మార్చేస్తున్నాయి. సోషల్ మీడియాతో మానవుడు ప్రపంచాన్ని చూసే కోణం మారిపోయింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ వంటి వేదికలను యువత నుంచి వృద్ధుల వరకు వినియోగిస్తున్నారు. భారతీయులు సోషల్ మీడియా మీద సగటున రోజుకు రెండు గంటల 40 నిమిషాలు గడుపుతున్నారు. 18 -24 ఏండ్ల యువత మరింత ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కేవలం ఈ వయసువారితోనే ఫేస్‌బుక్‌కు 9.72 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌కు 6.9. కోట్ల మంది వినియోగదారులు భారత్‌లో ఉన్నారు. అధిక సమయం గడుపుతూ ప్రమాదకర అంశాలు చదువుతుండటం, చూస్తుండటం వలన మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

కొలమానంగా మారిపోతున్నది

యునిసెఫ్ వివరాల ప్రకారం 15-24 ఏండ్ల వయసున్న భారతీయ యువతలో ప్రతి ఏడుగురిలో ఒకరు డిప్రెషన్‌కు గురవుతున్నారు. దీని వలన ఆత్మవిశ్వాసం లోపించటం, ఏకాగ్రత, లేకపోవడం ఇతరులతో వ్యవహరించే పద్ధతి, సంభాషించే విషయంలో సమస్యలు ఎదుర్కోవడం వంటివి తలెత్తుతున్నాయి. చేస్తున్న పని మీద, చదువుల మీద దృష్టి పెట్టలేకపోవడం, దుందుడుకుతనం, ఆత్మహత్య ఆలోచనలు వంటివి జరుగుతున్నాయి.

తాము పెట్టిన పోస్ట్‌కు ఎన్ని లైకులు వచ్చాయన్నది తన అందానికి కొలమానంగా చాలా మంది భావిస్తున్నారు. శారీరక అందం గురించి తీవ్రంగా ఆలోచించడం, హీరో, హీరోయిన్‌లలాగా ఉండాలనుకోవడం, అలా లేకపోతే బాధపడడం యువతలో విపరీతంగా పెరిగిపోతోంది. సోషల్ మీడియా వేదికలలో అల్గారిథం వినియోగం కారణంగా ఒక వ్యక్తి ఇష్టపడే రంగాలకు సంబంధించిన అంశాలను మళ్లీ మళ్లీ చూపిస్తూ ఉండటంతో ఈ సమస్య మరింత క్లిష్టంగా మారింది. ఫిట్‌నెస్ పోస్టులు చూసి కండలు పెంచాలనే లక్ష్యంతో విపరీతంగా తినడం, నియంత్రణ లేకుండా వ్యాయామం చేయడం వంటి సమస్యల బారిన పడుతున్నారు.

మంచి కోసం వినియోగం

ప్రజా చైతన్యమే సోషల్ మీడియా అక్రమాలకు విరుగుడు. మంచిని ప్రోత్సహించాలి. ప్రజా సమస్యలను సమర్థవంతంగా వివరించి విశ్లేషించి, పరిష్కరించడానికి ప్రయత్నించే ఇతర వేదికలను ఆదరించాలి. ప్రజలకు ఉపయోగపడని విషయాలను, ప్రసారం చేస్తున్న సంస్థలను తిరస్కరించాలి. భాష, ఆలోచన, విధానం, ఆచారాలు, పండుగలు మన దేశ సంస్కృతి అని గుర్తించాలి. వ్యసనాలకు దూరంగా ఉంటూ వీటన్నింటిని కాపాడుకోవాలి.

సోషల్ మీడియా అంతా చెడ్డదని కాదు, దీని వినియోగంతో మంచి మార్పులు వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. కరోనా సమయంలో యువత సోషల్ మీడియాలో గ్రూపులుగా ఏర్పడి అమూల్య సేవలు అందించారు. టీనేజ్ దశకు కూడా చేరుకోని పిల్లలలో నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోడానికి అవసరమైన విధానాలను రూపొందించాలి. అందుకు సమగ్ర పరిశోధనలు జరగాలి. బాధితులకు కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలబడాలి. విద్యా రంగంలోనూ, పని ప్రదేశాలలోనూ తీసుకురావాల్సిన మార్పుల గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది.

గుంపెల్లి గౌతమ్

కేయూ, వరంగల్

77021 53467


Next Story