- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గళమెత్తిన యువత - ఉలిక్కిపడ్డ పాలకవర్గం!
నీట్ ప్రశ్నపత్రం లీక్ వివాదం, పరీక్షల్లో పారదర్శకత కోసం విద్యార్థుల ఉద్యమం, విద్యా వ్యవస్థలో సంస్కరణల అవసరం, పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టం, ప్రభుత్వ జవాబుదారీతనం, ప్రజాస్వామ్య హక్కులు, యువత పాత్ర..

పోటీ పరీక్షలపై నమ్మకం దెబ్బతింటే, అది కేవలం విద్యార్థుల భవిష్యత్తునే కాదు.. మొత్తం విద్యా వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మారుస్తుంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు దారితీయగా, పరీక్షల్లో పారదర్శకత, జవాబుదారీతనం, వ్యవస్థాగత సంస్కరణల కోసం యువత చేపట్టిన ఉద్యమం జాతీయ చర్చగా మారింది.
ఈ ఉద్యమం కేవలం ఒక పరీక్ష గురించే కాదు.. న్యాయమైన అవకాశాలు, బాధ్యతాయుత పాలన, ప్రజా స్వామ్య విలువల కోసం సాగిన పోరాటంగా నిలిచింది. అయితే ప్రభుత్వం తగిన విధంగా స్పందించక పోవడం, ఈ ఉద్యమంపై ఫాసిస్ట్ ప్రభుత్వ అణిచివేతతో రణరంగంగా మారింది. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ దేశ ప్రజలను కలిచి వేసింది. మూడు రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలు, ర్యాలీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇర కాటంలోకి నెట్టింది.
యువత నైతిక విజయమే కానీ!
పరీక్షల్లో పారదర్శకత లేకపోతే విద్యా వ్యవస్థతో పాటు ప్రభుత్వాల విశ్వసనీయత కూడా దెబ్బతింటుంది. 2022 తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ లీకేజీ ఇందుకు ఉదాహరణ. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని కొన్ని సంస్కరణలను ప్రకటిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఎవరూ ఆటలాడనివ్వమని హామీ ఇచ్చారు. పరీక్షా వ్యవస్థను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చేందుకు చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, పేపర్ లీక్‌లకు పాల్పడిన వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టం–2024ను మరింత కఠినతరం చేసే సవరణ బిల్లుకు ఆమోదం తెలుపుతూ, పేపర్ లీక్ నేరాలకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, ₹10 కోట్ల వరకు జరిమానా, కనీస జైలు శిక్షను 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచే ప్రతిపాదనలు చేశారు.
మంత్రి రాజీనామాను కోరి సాధించారు..
పేపర్ లీక్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. పేపర్ లీక్ మాఫియాలు, కోచింగ్ సెంటర్లు, మధ్యవర్తులు, పరీక్షా వ్యవస్థలో అక్రమాలకు సహకరించే సంస్థలపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని బలోపేతం చేయనున్నారు.. ఈ బిల్లును త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, వాటి సమర్థ అమలు, దర్యాప్తు వేగం, జవాబుదారీతనం కూడా అంతే ముఖ్యమని అంటున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ చేపట్టే ఈ సంస్కరణలు ప్రజా డిమాండ్‌ను సంతృప్తి పరచలేకపోయాయి.. దేశ విద్యా వ్యవస్థకు బాధ్యత వహిస్తున్న మంత్రి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలనేది యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు ప్రధాన డిమాండ్‌గా మారింది. ఎట్ట కేలకు నిన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఇది యువత నైతిక విజయమే.. అయితే యువత భవిష్యత్తుకు న్యాయం జరగాలంటే ప్రజాభిప్రాయంతో వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు, శాశ్వత పరిష్కారాలు అవసరం. అణచివేత పరిష్కారం కాదని గుర్తెరగాలి.
బహుజన నాయకత్వ వేదికగా ఉద్యమాలు..
దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని చెప్పే ప్రభుత్వాలే, యువత పారదర్శకత, న్యాయం కోరితే పోలీస్ లాఠీ చార్జీలు, అరెస్టులు, నిర్బంధాలతో స్పందించడం ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మొన్న జంతర్ మంతర్ వద్ద యువతపై జరిగిన దాడి ఇందుకు నిదర్శనం. ఈ ఘటనలు అణగారిన వర్గాల స్వరాన్ని అణచివేయడంతో పాటు సామా జిక, రాజకీయ ఆధిపత్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. మరో వైపు యువత పోరాటంపై బురదజల్లే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయినా జెన్ జీ యువత నికార్సైన పోరాటం ప్రభుత్వాలను కదిలించింది. తమ భవిష్యత్తు గురించి మాట్లా డితే వినే ప్రభుత్వం కావాలా? లేక ప్రశ్నించే స్వరాన్ని అణచివేసే వ్యవస్థ కావాలా? అని యువత పోరాటం అల్టిమేటం జారీ చేసింది. ఎట్టకేలకు ప్రభుత్వం తలొగ్గి సీజేపీ పార్టీ నాయకులతో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా పరీక్షా వ్యవస్థలో సంస్కరణలు, కఠిన చట్టాలు తీసుకువస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. శాంతియుత నిరసనకారులపై కేసులు పెట్టబోమని పేర్కొన్నది.
సామాజిక న్యాయ సాధనలో కొత్త అధ్యాయం..
కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామాపై ప్రతిష్టంభన నెలకొన్న నిన్న రాజీనామా చేశారు. ఈ పరీక్ష లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన పోరు సామాజిక న్యాయ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఒక దళితుడు అభిజీత్ దీప్కే నాయకత్వంలో, ఒక ఆదివాసీ సోనమ్ వాంగ్ చుక్ స్ఫూర్తితో ఈ నిరసన ఉద్యమం ప్రజ్వరిల్లింది. ఈ ఉద్యమాల పరిణామాలను పరిశీ లిస్తే...బహుజన రాజకీయాలే ప్రతిపక్షమై ఇప్పుడు జాతిని నిర్వచిస్తున్నాయి, నడిపిస్తున్నాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తు రాజకీయాల్లో బహుజనులే దిశానిర్దేశం చేస్తారనే సంకేతాలను ఇస్తున్నాయి.
-సంపతి రమేష్
79895 79428






