రాజకీయ చెరలో యువత

by Disha edit |
రాజకీయ చెరలో యువత
X

ప్రశ్నించే తత్వం ఏర్పడితే ప్రమాదకరమని భావించి పాలకులు యువజనులను చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు. రాజకీయ ప్రయోజనం, రాజకీయ లబ్ధి, ప్రలోభాలు, వాగ్దానాలతో యువతను ప్రజానీకాన్ని నిరంతరం మోసగిస్తున్న పాలకులు కనీసం యువత పట్ల నైనా తమ సామాజిక బాధ్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఇదే కోరుకుంటున్నారు. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు, మేధావులు యువజనులతో ప్రత్యేక సమ్మేళనాలు నిర్వహించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేయాలి.

రాజకీయాలంటే ఒక త్యాగం, ఒక నిస్వార్థం, ఒక పరిపాలన దక్షత, ప్రజా సంక్షేమం. ఇవన్నీ కలగలిసినవారే రాజకీయాలలో చిరస్థాయిగా నిలుస్తారు. వారే చరిత్ర పుటలకు ఎక్కుతారు. వర్తమాన సమాజానికి మార్గదర్శకులు అవుతారు. 'త్యాగం వలన అమృతత్వం లభిస్తుందని, మనిషి గుణాలలో త్యాగం మహోన్నతమైనదని' పండితులు చెబుతారు. నిజానికి త్యాగం అంటే అందరిని వదులుకోవడం కాదు. అందరి కోసం తనని వదులుకోవడం. మన పురాణాలు, ఇతిహాసాలలో త్యాగధనులైన మహాపురుషుల కథలు ఎన్నో ఉన్నాయి. తండ్రి సంతోషం కోసం సామ్రాజ్యాన్ని వదులుకున్న భీష్ముడు, సర్వజన హితంలోనే నిజమైన సౌఖ్యం ఉందని నమ్మిన ముగ్గులుడులాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి.

మనిషి మహాత్ముడిలా ప్రవర్తించాలనే నియమం లేదు. మంచి మనిషిగా బతికుంటే చాలు. సమాజానికి ఉపకారం చేయకపోయినా అపకారం చేయకూడదని బుద్ధుని రాజనీతి తెలియజేస్తుంది. స్వార్థ రాహిత్యంతో కూడిన ప్రతి కార్యం మనిషిని ధర్మత్వం వైపు నడిపిస్తుంది. అలాంటి త్యాగ గుణం మనిషిని మహానుభావుడిగా మారుస్తుంది. బుద్ధుడు, గాంధీ మొదలైన వారు తమ ఆదర్శాలతో అందరి మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి వారి అడుగుజాడలలో ప్రతి ఒక్కరూ నడవాలి. పరోపకార బుద్ధిని ప్రదర్శిస్తూ సత్ప్రవర్తనతో రాజకీయ వ్యవహారాల శైలిని నిర్వహించడం త్యాగం గుణం గల వ్యక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది పరిపాలనా వ్యవస్థకు, భవిష్యత్ వర్తమాన సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది.

అభివృద్ధి పథం వైపు నడిపించాలి

నేటి రాజకీయ వ్యవస్థ ఆ విధంగా లేదు. పరిపాలనలో క్రియాశీలకం, పారిశ్రామిక విధానం, విద్యా విధానం, ఆర్థిక విధానం, యువజన విధానం కూడా స్పష్టంగా ఉండవలసిన అవసరం ఉంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మొదలు రాష్ట్ర స్థాయి పాలకుల వరకు యువజన విధానాన్ని మొరటుగా, దిక్కు మొక్కు లేని చుక్కాని లేని నావగా తయారు చేస్తున్నారు. దేశంలో 40 శాతానికి పైగా యువత ఉన్నారు. కానీ, వారికి స్పష్టమైన విధానం లేని కారణంగా యువత గణనీయంగా నిర్వీర్యం కావడం ఆందోళన కలిగించే అంశం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో యువజన విధానం అంటూ ఉండాలి.

మానవ వనరులుగా ఉన్న యువజనులను వినియోగించుకొని పాలనలో భాగస్వాములు చేసుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం 2016 లో యువజన విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికీ స్పష్టమైన యువజన విధానం లేదు. అభివృద్ధిలో క్రియాశీల భూమిక పోషించే యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన, స్వయం ఉపాధికి రుణ సౌకర్యం, ఆర్థిక సహకారం అందిస్తే వారు అభివృద్ధిలో భాగస్వాములు అయి ఉంటారు. అవి లేని కారణంగానే అసాంఘిక కార్యక్రమాల వైపు ఆకర్షితులై అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. అందుకే వారికి సరైన స్థానం కల్పించే విధంగా యువజన విధానం ప్రకటించాలి.

ఎదురు తిరుగుతారని భయపడి

ప్రేమ వైఫల్యాలు, మత్తుపానీయాలు, నిరాశా నిస్పృహలు, తల్లిదండ్రుల మందలింపులు లాంటివి మనం చూస్తున్నాం. వాహనాలు వేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతో తనతోపాటు ఇతరుల ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయి. ప్రాణం అంటే విలువ లేని, మనిషి అంటే గౌరవం లేని దౌర్భాగ్యకర పరిస్థితికి యువత నెట్టివేయబడింది. యువజనులు క్రియాశీలకంగా ఉంటూ. విద్యావంతులు అయితే ప్రశ్నించే తత్వం ఏర్పడితే ప్రమాదకరమని భావించి పాలకులు యువజనులను చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు.

రాజకీయ ప్రయోజనం, రాజకీయ లబ్ధి, ప్రలోభాలు, వాగ్ధానాలతో యువతను ప్రజానీకాన్ని నిరంతరం మోసగిస్తున్న పాలకులు కనీసం యువత పట్ల నైనా తమ సామాజిక బాధ్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఇదే కోరుకుంటున్నారు. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు, మేధావులు యువజనులతో ప్రత్యేక సమ్మేళనాలు నిర్వహించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేయాలి.

డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి

కేయూ, వరంగల్

98495 77610


Next Story