వరల్డ్ టుడే:జూనోసెస్‌తో జర పదిలం

by Disha edit |
వరల్డ్ టుడే:జూనోసెస్‌తో జర పదిలం
X

వన్యప్రాణులు, జంతువులు జీవవైవిధ్యానికి ఎంతో అవసరం. సకల ప్రాణికోటికి రక్షణే మాధవ సేవ అని భావించి పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉంటూనే, జూనోటిక్ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉందాం. సమస్త ప్రజానీకం జంతు సంబంధ వ్యాధి వ్యాప్తి పట్ల సంపూర్ణ అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యకర కుటుంబాలను నిర్మించుకోవాలని కోరుకుందాం.

జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అంటువ్యాధుల గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. అందులో ఒకటి మన జీవితాలను అతలాకుతలం చేసిన కరోనా. దీంతోపాటు ప్లేగు, రాబిస్ వ్యాధులు కూడా ఈ కోవకు చెందినవే. ఇలా జంతువుల నుంచి మనుషులకు సోకే అంటువ్యాధులను 'జూనోసెస్' అంటారు. కుక్కల నుంచి మనుషులకు వ్యాపించే రాబిస్ వ్యాధికి లూయిస్ పాశ్చర్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త 1885 జూలై ఆరున టీకాను కనిపెట్టారు. ఆ విజయానికి గుర్తుగా యేటా ఈ రోజును 'ప్రపంచ జూనోసెస్ దినోత్సవాన్ని' జరుపుకుంటారు. ఇలా జంతువుల నుండి సుమారుగా 200 జూనోటిక్ వ్యాధులు ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.

అధిక శాతం రోగాలు ఇవే

ఇండ్లలో పెంచుకునే సాధు జంతువుల వలన అనేక వ్యాధులు మనుషులకు సోకుతాయి. మనకు సంక్రమిస్తున్న అంటురోగాలలో 66 శాతం ఈ జూనోటిక్ వ్యాధులే. ప్రపంచవ్యాప్తంగా యేటా దాదాపు బిలియన్ జూనోటిక్ కేసులు నమోదవుతున్నాయి. మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయి. సరిగా ఉడకని జంతు మాంసం, జంతువులు కొరికిన పండ్లు తినడం, పరిశుభ్రంగా లేని జంతువులతో ఉండటం వలన జూనోటిక్ వ్యాధులు మానవులకు సోకుతాయి.

వ‌ృద్ధులు, గర్భిణులు, ఐదేండ్ల లోపు చిన్నపిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారు వీటితో జాగ్రత్తగా ఉండాలి. దేశంలో 75 శాతం కేసులు, అధిక శాతం మరణాలు జునోటిక్ వ్యాధులతో జరుగుతున్నాయి. అధిక జనాభా, పేదరికం, అవగాహనా లేమి, నిరక్షరాస్యత, వైద్య ఆరోగ్య వసతుల లేమి, వ్యక్తిగత అపరిశుభ్రత, పరిసరాల అపరిశుభ్రత, టీకాలు వేయించుకోకపోవడం లాంటివి జునోటిక్ వ్యాధులకు కారణంగా కేంద్ర ఆరోగ్య శాఖా గుర్తించింది.

తగు జాగ్రత్తలు తీసుకుంటూ

ఈ వ్యాధుల కట్టడికి అల్లోపతి వైద్యులు, వెటర్నరీ వైద్యులు, అంటువ్యాధుల నిపుణులు సమన్వయంతో పని చేయాలి. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, పరిశుభ్ర ఆహారం తీసుకోవడం, జంతువులను తాకిన తరువాత చేతులు శుభ్రం చేసుకోవడం, పెంపుడు జంతువులకు ఎప్పటికప్పుడు టీకాలు వేయించడం, జంతువులు తిరిగే పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటివి ఈ వ్యాధులు సోకకుండా అడ్డుకుంటాయి.

వన్యప్రాణులు, జంతువులు జీవవైవిధ్యానికి ఎంతో అవసరం. సకల ప్రాణికోటికి రక్షణే మాధవ సేవ అని భావించి పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉంటూనే, జూనోటిక్ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉందాం. సమస్త ప్రజానీకం జంతు సంబంధ వ్యాధి వ్యాప్తి పట్ల సంపూర్ణ అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యకర కుటుంబాలను నిర్మించుకోవాలని కోరుకుందాం.

నేడు 'ప్రపంచ జూనోసెస్ దినోత్సవం'


డా: బుర్ర మధుసూదన్ రెడ్డి

కరీంనగర్‌, 9949700037



Next Story

Most Viewed