- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ విజయం.. మొత్తం మహిళల గెలుపు కాదు!
ప్రపంచ మహిళా వరల్డ్ కప్‌లో భారత జట్టు విజయం సాధించడంతో మహిళలు ఎగిరి గంతేసారు. ఎన్నో కష్టాల కోర్చి అమ్మాయిల గెలుపు పురుషస్వామ్య వ్యవస్థలో ఒక కొత్త చరిత్ర. పురుషులు మాత్రమే కైవసం చేసుకున్న

ప్రపంచ మహిళా వరల్డ్ కప్‌లో భారత జట్టు విజయం సాధించడంతో మహిళలు ఎగిరి గంతేసారు. ఎన్నో కష్టాల కోర్చి అమ్మాయిల గెలుపు పురుషస్వామ్య వ్యవస్థలో ఒక కొత్త చరిత్ర. పురుషులు మాత్రమే కైవసం చేసుకున్న క్రికెట్ నేలమీద మహిళలు కూడా కాలు మోపడం, ఇదేదో పురుషులకు సంబంధించిన ప్రత్యేక నైపుణ్యం ఏమీ కాదని రుజువు చేయడం భారత మహిళలకు గొప్ప స్ఫూర్తినిచ్చింది. అయితే, నేటి ఆర్థిక సామాజిక నేపథ్యంలో ఈ మహిళల గెలుపుని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
భారత మహిళా జట్టును ప్రగతిశీల రచయితలూ, కార్యకర్తలూ ప్రశంసించడం వరకు ఓకే. కానీ, ఇదేదో సామాజిక జీవితాల్లో ఒక గొప్ప మార్పును తీసుకొస్తుందని ఎంతో మంది భావిస్తున్నట్టు జరుగుతుందా? ఆటల వెనుక పెట్టు బడిదారీ వ్యవస్థ ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్న కార్పొరేట్ దిగ్గజాలు ఉన్నాయి. ఆటగాళ్లనే వేలం వేటల్లో కొనేసుకునే స్థాయికి నేటి క్రికెట్ వ్యాపారం కొనసాగింది. జాతీయ, అంతర్జాతీయ బడా పెట్టుబడిదారీ వర్గం దీన్ని బడా పరి శ్రమగా మార్చేసింది. ప్రపంచీకరణలో ఎలక్ట్రానిక్ మీడి యాలో అభివృద్ధితో ఇది మరింత వేగవంతం అయింది.
హృదయంతో హత్తుకోవలసిందే.. కానీ
ఏ చిన్న సంఘటన అయినా సరే.. అంతకు ముందున్న ప్రగతి నిరోధక భావజాలానికి ఎదురు తిరిగి ఏ చిన్న మార్పును అందించినా సరే దాన్ని హృదయంతో హత్తు కోవాల్సిందే. అలానే మహిళలే లేని క్రికెట్ నేల మీద మహిళలు దిగి క్రికెట్‌లో తమ గెలుపు రుచి చూపించడం హర్షించాల్సిన విషయం. అయితే, ఈ గెలుపు దేశంలోని మహిళలు అందరికీ అందితేనే అది నిజమైన గెలుపు అవుతుంది. కానీ, వాస్తవ పరిస్థితి అలా ఉండదు. పారి శ్రామిక విప్లవం ముందుకు వెళ్లిన కొద్దీ మహిళలు కూడా ఉత్పత్తి ప్రక్రియలో అవసరం అయ్యారు. నేడు కాల్ సెంటర్, టూరిజం, హోటల్, రిసెప్షన్, ఎయిర్ హోస్టెస్ మొదలైన అసంఖ్యాకమైన రంగాల్లో మహిళలే ఎక్కువగా లాభాల సంచులు కార్పొరేట్లకు పంచి పెడుతున్నారు.
ఈ వినోదం.. ఈ వర్గాలకు అవసరం!
క్రికెట్ ఆటగాళ్లకు వేలం వెర్రిగా రాజుల కాలం లాగా లక్షల, కోట్ల రూపాయల ధన దానధర్మాలు ఉంటాయి. వేలం పాటలు కూడా ఉంటాయి. ఇదంతా కూడా వారి శ్రమకు తగ్గ జీతం కాదు కదా. అసలు వారు ఏ రకమైన సామాజిక ప్రయోజనం గల ఉత్పత్తి చేస్తున్నారని అనుకోవాలి? అయినా, ఇలాంటి వినోదాలు ఈ వ్యవస్థలో బాగా డబ్బున్న వర్గాలకు అవసరం. ఎందరో మహిళలు ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొని ఈ క్రికెట్ ప్రపంచంలోకి వచ్చారన్నమాట కాదనలేం. అది వ్యక్తిగత విజయం అవుతుంది. కానీ సామాజిక విజయం ఎలా అవుతుంది? వీరి గెలుపుతో మహిళల పరిస్థితిలో దేశంలో ఏ రకంగానైనా మార్పు జరుగుతుందా? ఈ క్రీడాకారులు ధనవంతులవుతారు. ఏవో కంపెనీల ప్రొడక్ట్‌లను ప్రమోట్ చేయడానికి పనికొస్తారు. సినీ సెలబ్రిటీలను మనం చూస్తూనే ఉన్నాం కదా! హానికరమైన కూల్ డ్రింకులు, పిల్లలకు నష్టం చేసే చిప్స్ ప్యాకెట్స్ వంటివి డబ్బు కోసం ప్రమోట్ చేసే సెలబ్రెటీలు మనకు కనిపిస్తూనే ఉన్నారు.
క్రికెట్ నిలువెల్లా వ్యాపారమే!
అశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజలు ఇలా ఎంగేజ్ కావడం చాలా అవసరం. అలానే యువతరం, మధ్య తరగతి జనాలు తమ పనీ పాటా మానుకొని నిరంతరం ఈ క్రికెట్‌లో మునిగి ఆయా కార్పొరేట్ మీడియాల టీఆర్‌పీని ఘనంగా పెంచుతూ ఉంటేనే వారి లాభాల సంచులు బరువవుతాయి. మన దేశంలో విద్య, వైద్యం లాగానే, క్రికెట్ కూడా ఆ ప్రయోజనాన్ని ఈ వర్గానికి అందించింది. ఆట గాళ్లను కొనేసి వారితో ఆడించడం కూడా వ్యాపారమయం చేసింది. క్రికెట్‌లో గెలుపు కూడా దేశభక్తిగా ప్రమోట్ చేసింది. క్రికెట్‌లో డబ్బుతో పాటు మత విద్వేష రాజకీయాలు మిక్స్ అయిపోతాయి. మహిళా క్రీడాకారులైనా మున్ముందు అదే జరుగుతుంది. ఎన్నికల వంటకాలలో నాయకులకు ఈ మసాలా బాగా పనికొస్తుంది. క్రికెట్ వ్యాపార సరుకుగా మారి నేడు ఒక మత్తు మందుగా అవ తరించింది. ఇప్పుడు ఈ మత్తులో అమ్మాయిలను కూడా ముంచబోతున్నారు. పాలకవర్గాలకు ఇదే సదుపాయం కూడా. ఈ మత్తు కోసం మనం గర్వపడాల్సింది?
ఇక్కడా లాభపడేది కార్పొరేట్ వర్గమే..!
క్రికెట్ ఆటలో పురుషులు గెలిచినా, మహిళలు గెలిచినా పురుషులు ఆడినా, మహిళలు ఆడినా సాధారణ ప్రజలకు జరిగే న్యాయం ఏమీ ఉండదు. రెండు మూడు రోజుల తర్వాత ప్రజలు ఇది మరిచిపోతారు. కానీ, పెట్టు బడిదారులకు మరో అవకాశం కూడా దొరుకుతుంది. ఇన్నాళ్లు పురుషుల క్రికెట్‌తో విపరీతమైన వ్యాపారం చేసుకున్న ఈ వర్గానికి మరో అవకాశం లభించింది. మహిళల క్రికెట్ పోటీలు కూడా ఈ రకంగానే కొనసాగిస్తే మరో కొత్త పరిశ్రమకు అవకాశం ఉంటుందని ఈ వర్గానికి అనిపించొచ్చు. కాబట్టి ఈ రోజైనా, భవిష్యత్తులో అయినా ప్రయోజనం పొందగలిగేది, ప్రయో జనం కోసం ప్రణాళిక వేసుకునేది కార్పొరేట్ వర్గమే.
మహిళా క్రికెటర్ల పాదముద్రలు ఏవైపు?
మహిళలు ఆటగాళ్లుగా ముందుకు రావచ్చు. కొన్ని కంపెనీలకు ప్రకటనల అంబాసిడర్లుగా మారొచ్చు. కానీ, దేశంలోని కోట్ల కొలది మహిళలు ఈ ప్రక్రియ ద్వారా ప్రయోజనం పొందేది ఏమీ ఉండదు. వారు పని చేసే పని స్థలాల్లో జీతాలు అలానే ఉంటాయి. సామాజిక జీవితంలో వారి పట్ల ప్రవర్తన అలానే ఉంటుంది. ఇది చూసి ప్రగతిశీల శక్తులు సంబరపడాల్సినంత విషయం ఏముందని? క్రికెట్ నేలమీద మహిళా క్రీడాకారుల పాద ముద్రలు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో మార్పు తీసుకు వస్తాయా?
-కేశవ్
ఆర్థిక, సామాజిక విశ్లేషకులు
98313 14213






