అసలు ఉగ్రవాదులను పట్టుకోరా..?

by Ravi |   (  Updated:2025-05-15 00:30:39  IST  )

పహెల్గాం ఉగ్రదాడి తర్వాత మన సైనిక దళం ఉగ్రవాదుల స్థావరాలను పసిగట్టి, 25 నిమిషాల్లో వాటిని పేల్చేసి, శెభాష్ అనిపించుకున్నాయి.

అసలు ఉగ్రవాదులను పట్టుకోరా..?
X

పహెల్గాం ఉగ్రదాడి తర్వాత మన సైనిక దళం ఉగ్రవాదుల స్థావరాలను పసిగట్టి, 25 నిమిషాల్లో వాటిని పేల్చేసి, శెభాష్ అనిపించుకున్నాయి. మన దేశ సైనిక వైమానిక దళాల సత్తా ఏమిటో ప్రపంచానికి చూపించాయి. అయితే దేశ నిఘా వర్గాలు, రక్షణ సిబ్బంది మాత్రం ‘పహెల్గాం’ లో జరగబోయే ఉగ్రదాడిని ముందస్తుగా పసిగట్టడంలో విఫలమయ్యాయి. దాడి చేసిన ఉగ్రవాదులను ఇప్పటి వరకు దొరకపట్టలేక పోయాయి. ఈ విష యంలో మనం వెనుకబడి ఉన్నామని రుజువు అవుతున్నది. ఈ పాటికి ఉగ్రవాదులు పొలిమేరలు దాటి పోయి, ఎక్కడో జన జీవనంలో కలిసిపోయి ఉండి ఉంటారు. ప్రభుత్వ దృష్టి యుద్ధం వైపు కన్నా, ఉగ్రవాదులను సజీవంగా దొరకపట్టుకొని, వారిని విచారించి, ఈ దాడికి మూలం పసిగట్టి, ప్రపంచం ముందు పెట్టి, ఆ తరువాత ఆ మూలాన్ని అంతం చేస్తే, ఇప్పుడు, ఈ మిస్టరీ మిగిలిపోయి ఉండేది కాదు.

ఇది, ఎలా ఉందంటే.. ! ఒక ఇంటి తలుపుకు గెడపెట్టకుండా, అశ్రద్ధతో పడుకొని ఉంటే, ఒక అపరిచితుడు వచ్చి మర్డర్ చేసి పోతే, ఆ ఇంటి పెద్దలు ఆ హంతకుడిని పట్టుకునే ప్రయత్నంపై దృష్టి పెట్టకుండా, ఒక భూమి తగాదాలో ఉన్న ప్రత్యర్ధి పంపించాడేమోనని అనుమానించి, నేరుగా వెళ్లి అతని ఇల్లు తగలబెట్టినట్లు ఉన్నది, ఈ వ్యవహారమంతా. మన జాగ్రత్తలో మనం ఉండి ఉంటే, ఆ హంతకుడు ఇంట్లోకి వచ్చేవాడు కాదు. వచ్చిన హంతకుడిని పట్టుకుంటే, వాడు ఎందుకు ఈ దాడి చేశాడు, వాడిని ఎవరు పంపించారో తెలిసిపోయేది. ఆ తర్వాత చర్యలు తీసుకుంటే అర్థవంతంగా, ప్రయోజనాత్మకంగా ఉండేది.

నిఘా వర్గాల, రక్షణ శాఖల నిర్లక్ష్యంతో దేశ పౌరుల నిండు ప్రాణాలు పోయాయి. ఆ ఉగ్రవాదులను పట్టుకోలేకపోతే ఇంకెంత ప్రమాదమో ఆలోచించాలి. వీరిని పట్టుకోకుండా యుద్ధానికి దిగి, మన సైనికుల ప్రాణాలు, దేశ సంపదను పోగొట్టుకున్నాం. ఉగ్రవాదులను పట్టుకోకుండా, జోరుమీద యుద్ధానికి ఎందుకు దిగినం. దిగినొల్లం హఠాత్తుగా మధ్యలోనే ఎందుకు ఆగిపోయినం. మధ్యల ఈ ట్రంప్ ఏంది? పాకి స్తానోళ్లు గెలిసినం అని సంబుర పడుదేంది? మనం మన సైనిక ప్రతాపం ఏందో చూపించినా.. అసలు ఉగ్రవాదులు ఏరి? అని మనలో ఈ నిరాశ ఏంది?

- సయ్యద్ రఫీ

చిత్ర దర్శకుడు

Next Story