సంపూర్ణ సాధికార‌తే.. మ‌హిళాభ్యుద‌యం!

by Ravi |   (  Updated:2026-03-08 00:30:52  IST  )

భారత్‌లో మహిళల సామాజిక స్థాయి పెరిగినా ఇంకా లింగ వివక్ష పూర్తిగా తొలగిపోలేదు. గ్రామీణ మహిళల సమస్యలు, పితృస్వామ్య భావజాలం, ఆరోగ్య సమస్యలు వంటి అంశాలపై సమగ్ర సంస్కరణల అవసరాన్ని ఈ వ్యాసం వివరిస్తుంది.

సంపూర్ణ సాధికార‌తే.. మ‌హిళాభ్యుద‌యం!
X

గత రెండున్నర శతాబ్దాల్లో మహిళల సామాజిక స్థాయి పెరిగింద‌నడంలో సందేహం లేదు.. అయినప్పటికీ సాధించిన దానితో సంతృప్తి చెందడం ఆధునిక భావనకు విరుద్ధం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతిఫలించాలి. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నా లింగ వివక్ష పూర్తిగా తొలగిపోలేదు.. విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు పెరిగినా అక్కడా కూడా మహిళలు వివక్షను, అణచివేతను ఎదుర్కొంటున్నారు. కుటుంబం, సమాజం రెండింటిలోనూ ఎదురయ్యే ఈ పరిస్థితి మహిళా సాధికారతకు అడ్డంకిగా మారుతోంది. కేవలం చట్టాల ద్వారా వారికి అవకాశాలు కల్పించడం మాత్రమే సరిపోదు.. నేటికీ కుటుంబాల్లో బలంగా నాటుకుపోయిన పితృస్వామ్య భావజాలం మహిళల స్వేచ్ఛను నిరోధి‌స్తోంది. సాంస్కృతిక విలువలు, మత నియమాలు కూడా చాలా సందర్భాల్లో పురుషాధిక్యానికి మద్దతుగా నిలుస్తు‌న్నాయి. అందువల్ల ప్రభుత్వాలు సమగ్ర సామాజిక సంస్కరణ కార్యక్రమాలను చేపట్టాలి. విద్య, సాహిత్యం, కళలు వంటి రంగాల ద్వారా మహిళలపై గౌరవభావం పెంపొందించాలి. పురుషులు కూడా చైతన్యం పొందినప్పుడే మహిళలకు నిజమైన రక్షణ, గుర్తింపు లభిస్తుంది. అభివృద్ధి జరుగుతున్న దేశంగా ఉన్నప్పటికీ లింగ సమానత్వంలో భారత్ ఇంకా వెనుకబడింది. ముఖ్యంగా గ్రామీణ మహిళల పరిస్థితి ఆందోళనకరం. వ్యవసాయ కూలీల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నా వారు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పులు, పురుగు మందుల ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అలాగే పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు నగరాలకే పరిమితం కావడంతో గ్రామీణ మహిళలకు అవకాశాలు తగ్గుతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధిని గ్రామాలు, చిన్న పట్టణాల వరకు విస్తరించడం అవసరం. మహిళాభ్యు దయాన్ని కొందరు సాధించిన విజయాలతో మాత్రమే కొలవలేం. దేశంలో అనేక మహిళలు పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వ్యవ సాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు కూడా మహిళల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.. అసంఘటిత రంగాల్లో పనిచేసే మహిళలు ఇంకా శ్రమ దోపిడీకి గుర వుతున్నారు. కాబట్టి మహిళల అభ్యున్నతి కోసం కేవలం ప్రచార కార్యక్రమాలు కాకుండా వారి జీవన పరిస్థితులను మెరుగుపరిచే సమగ్ర విధానాలు అవసరం. మహిళలు పురుషులతో సమానంగా గౌరవంతో జీవించే సమాజం ఏర్పడిన ప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుంది.

- రోజా నాగ‌పురి

Next Story