- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి, ఉద్యోగాలే మహిళా సాధికారత..
భారతదేశంలో మహిళా సాధికారత, లింగ సమానత్వం, మహిళల హక్కులు, రాజకీయ భాగస్వామ్యం మరియు విద్య ప్రాధాన్యంపై విశ్లేషణ. మహిళల అభివృద్ధి దేశ అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో ఈ వ్యాసంలో తెలుసుకోండి.

స్త్రీ సంస్కృతి, మాతృశక్తి, సృజనాత్మకత, నిరంతర త్యాగాల సమాహారం. స్త్రీ సృష్టి, స్థితి, లయలకు కారకురాలైన శక్తి స్వరూపిణి. సృష్టిని సృజించి, పెంచి, పోషించే అద్భుత శక్తులు స్త్రీ స్వరూపంలోనే ఉన్నాయి.. స్త్రీ కుటుంబ వ్యవస్థకు మూలస్తంభంగా ఉంటూ, దేశ సంస్కృతిని కాపాడుతూ భవిష్యత్తు తరాలను అందించేది. కానీ నేడు నాగరికంగా అనేక మార్పులు చేసుకుంటూ వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఇంకా మహిళా అభివృద్ధి పరిపూర్ణం కాదని అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఆత్మగౌరవాన్ని, ఉనికిని, హక్కులను గుర్తుచేసుకుని గౌరవించుకోవడానికి, మహిళల ప్రేరణకి ఆమోదించబడింది.
అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ..
భారతదేశంలో స్త్రీల ఉద్యోగ అస్తిత్వం ఆర్థిక సాధికారతకు, సామాజిక సమానత్వానికి మూలం. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం దారిద్ర్య నిర్మూలనకు దోహదపడుతోంది. అయినా స్త్రీలకు లింగ సమానత్వం సాధించడం సవాలుగా మారుతోంది. సాంప్రదాయ వస్త్రధారణ పట్ల పలుమార్లు అవమానీయ సమాజపు దుర్భాషాలకు ఎదుర్కొంటున్నారు. ఇక పురుషాధిక్య రంగాలలో స్త్రీలు ప్రతిభ కనబరుస్తున్నా ప్పటికీ ఇంకా కొన్ని చోట్ల స్త్రీ శక్తి వంచనకు గురవుతూనే ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా స్త్రీల పట్ల సహృదయత, సమానత్వ భావం, గౌరవం దక్కడం లేదు. మహిళా అభివృద్ధి, సాధికారత అనేది ఒక దేశ సామాజిక, ఆర్థిక వృద్ధికి మూలాధారం. విద్య, ఆర్థిక స్వతంత్రత, నిర్ణయాధికారం విద్యావంతులు, ఆధునికత తెలిసిన పట్టణ ప్రాంత మహిళలు మాత్రమే అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు.
తెరవెనుక పితృస్వామ్య ధోరణితో..
స్త్రీల రాజకీయ భాగస్వామ్యం చాలా విస్తృతమైనది. ఇది ఓటు హక్కుకి పరిమితం కాదు. రాజకీయాల్లో లింగ అసమానతలను రూపుమాపడానికి, భారత ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలలో 33% రిజర్వేషన్లు కల్పించి సామాజిక సమస్యలపై గొంతు విప్పే అవకాశం కల్పించింది. కానీ స్థానిక సంస్థల్లో ఎన్నికైన మహిళా నాయకురాలు కేవలం నామమాత్రంగా సంత కాలకే పరిమితమవుతున్నారు. తెరవెనుక పితృస్వామ్య ధోరణి చెలామణి అవుతుంది. మహిళలకు నిరక్షరాస్యత, సామాజిక ఒత్తిళ్లు, అడ్మినిస్ట్రేటివ్ అవగాహన కొరత, ఇవన్నీ 73వ రాజ్యాంగ సవరణ ఆశయాలను దెబ్బతీస్తూ వస్తున్నాయి. మహిళల నిజమైన సాధికారతను అడ్డుకుంటూ స్థానిక స్వపరిపాలనలో జవాబుదారీతనాన్ని తగ్గిస్తుంది.
నేటికీ చట్టాలు తెలియని వారెందరో..?
ఇక మహిళలపై జరిగే అన్యాయాలపై, కావలసిన మార్పుల కొరకై సావిత్రిబాయి ఫూలే, రమాబాయి, సరళా దేవి వంటి వారు స్వాతంత్య్రానికి పూర్వమే అనేక ఉద్యమాలు చేపట్టారు.. బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక దేశం పురోగతి మహిళలు సాధించిన పురోగతిని బట్టే కొలుస్తారని ఆనాడే వివరించారు.. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమాన హక్కులు, అవకాశాలను సమర్థిస్తుంది. ఆర్టికల్ 15 లింగ వివక్షతను నిషేధిస్తుంది. వరకట్న నిషేధ చట్టం, సమాన వేతనం మొదలైన చట్టాలు మహిళా అభివృద్ధికి దోహదపడుతున్నా, తమ కోసం ఇన్ని చట్టాలు చేయబడ్డాయన్న విషయం కూడా నేటికీ కొంతమంది మహిళలకు తెలియదు..
మహిళలు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి!
నవ నాగరికంలో విద్యయే సర్వాంతర్యామి.. విద్యావంతులైన స్త్రీలు కుటుంబంతో పాటు సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు. అందుకే విద్య, అవగాహన, అక్షరాస్యత, శిక్షణ ద్వారా మహిళల స్థితిని పెంచాలి. మహిళలు వీటిని వెతకడానికి ప్రయత్నం చేయడం ప్రధానమైనది. మహిళల సాధికారతకి ఎదురయ్యే వివిధ సామాజిక సమస్యల ద్వారా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి మహిళలు ఆత్మవిశ్వాసం, సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అలాగే స్వయం ఉపాధి, వ్యాపారాల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడం చాలా ముఖ్యం. మహిళల స్థితిగతులు బాగుపడితేనే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. కాబట్టి మహిళల హక్కులు గుర్తించడం, వారి సమానత్వాన్ని ప్రోత్సహించాలి.
-హేమలతా అశోక్ ఒరుసు
94948 12216






