మహిళా ఉద్యోగుల.. ప్రత్యేక సెలవులపై సమగ్ర సమాచారం

by Ravi |   (  Updated:2026-06-12 01:00:28  IST  )

మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, పిల్లల సంరక్షణ సెలవులు, గర్భస్రావం, గర్భాశయ శస్త్రచికిత్స, ప్రత్యేక ఆకస్మిక సెలవులు వంటి సౌకర్యాలపై పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల జీవోలు, అర్హతలు, ప్రయోజనాలు, సెలవుల నిబంధనలపై సమగ్ర సమాచారం.

మహిళా ఉద్యోగుల.. ప్రత్యేక సెలవులపై సమగ్ర సమాచారం
X

సమాజాభివృద్ధి, పాలనా వ్యవస్థలో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకం. వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే, వారి ఆరోగ్యం, కుటుంబ బాధ్యతలు, పిల్లల సంరక్షణ వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేక సెలవులను కల్పించింది. అందుకే వారికి పలు ప్రయోజనకరమైన ప్రత్యేక సెలవులను చట్టబద్ధంగా ఏర్పాటు చేసింది. ఈ సెలవులపై మహిళా ఉద్యోగులు పూర్తి అవగాహన కలిగి ఉండటం అవసరం.

ప్రసూతి సెలవు..

(జీవో 152 dated 04.05.2010) ప్రసూతి సెలవును 120 రోజుల నుండి 180 రోజులకు (6 నెలలు) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సౌలభ్యం ఇద్దరి కంటే తక్కువగా సజీవులైన సంతతి గల మహిళా ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే, సజీవంగా ఉన్న ఒక బిడ్డ కలవారికి లేదా అసలు పిల్లలు లేని వారికి మాత్రమే ఈ 180 రోజుల ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది. కాన్పు ముందస్తు సెలవు (Confinement) జీవో 38 Fin & Plg Dept, dated 13.08.1992 - కాన్పు కోసం ఆసుపత్రిలో చేరిన తేదీ, లేదా కాన్పుకు ముందు అనారోగ్య పీడితురాలైన తేదీ నుండి (ఉద్యోగిని అభ్యర్థన మేరకు) ప్రసూతి సెలవును ముందస్తుగా కూడా మంజూరు చేయవచ్చును.

గర్భస్రావం లేదా అకాల ప్రసవం

దురదృష్టవశాత్తూ గర్భస్రావం లేదా అకాల ప్రసవం జరిగిన సందర్భాలలో మహిళా ఉద్యోగుల శారీరక, మానసిక కోలుగోలుకై ఈ సెలవు ఉపయోగపడుతుంది. అధికారిక మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా ఆరు వారాలకు మించకుండా ఈ ప్రత్యేక సెలవును మంజూరు చేయవచ్చును.

పిల్లల సంరక్షణ సెలవు..

(జీవో 209 dated 21.11.2016) పిల్లల పెంపకం, వారి అనారోగ్యం లేదా వారి పాఠశాల పరీక్షల సమయంలో ఉపయోగించుకొనుటకు 90 రోజుల సెలవును తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈ సెలవును సర్వీసు మొత్తంలో ఒకే విడతలో గరిష్టంగా 15 రోజులకు మించకుండా, విడతల వారీగా వినియోగించుకోవచ్చును. ఈ సెలవును పొందేందుకు పిల్లల వయస్సు 18 సంవత్సరాలలోపు ఉండాలి (ఒకవేళ వికలాంగులైన పిల్లలైతే వయోపరిమితి 22 ఏళ్లు). చట్టబద్ధంగా దత్తత తీసుకున్న లేదా సరోగసి ద్వారా పిల్లలను పొందిన మహిళా ఉద్యోగులకు కూడా ఈ సెలవు సమానంగా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పిల్లల సంరక్షణ సెలవును 90 రోజుల నుండి 180 రోజులకు పెంచడం జరిగింది. పిల్లల వయోపరిమితిని కూడా తొలగించింది.

గర్భాశయ శస్త్రచికిత్స సెలవు..

జీవో 52 dated 01.04.2011 గర్భాశయ సంబంధిత వ్యాధుల కారణంగా గర్భాశయ శస్త్రచికిత్స చేయించుకున్న మహిళా ఉద్యోగులకు కోలుకోవడానికి గాను 45 రోజుల ప్రత్యేక సెలవును ప్రభుత్వం అనుమతించింది. దీనికి సంబం ధించి అధీకృత వైద్యుడి ధృవీకరణ పత్రం సమర్పించాలి.

ప్రత్యేక ఆకస్మిక సెలవులు..

కుటుంబ నియంత్రణ, ఇతర ప్రత్యేక విభాగాల పరిధిలో మహిళా ఉద్యోగులకు క్రింది విధంగా సెలవులు లభిస్తాయి. ట్యూబెక్టమీ శస్త్రచికిత్సకు 14 రోజులు, పునఃసంధాన శస్త్రచికిత్సకు 21 రోజులు, సాల్పింజెక్టమీకి 14 రోజులు, IUD (Intra Uterine Device) అమరిక 1 రోజు

మహిళా ఉద్యోగులకు అదనపు సౌకర్యం

సాధారణ ఆకస్మిక సెలవులకు అదనంగా సంవత్సరానికి 5 రోజులు ప్రత్యేక ఆకస్మిక సెలవులను మహిళలకు ప్రభుత్వం కల్పించింది. వివిధ విభాగాల వారీగా అదనపు సెలవుల జీవోల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ఉపాధ్యాయులు (Teachers) 5 రోజులు (జీవో 374, dated 16.03.1996). జూనియర్ లెక్చరర్లు 5 రోజులు (జీవో 3, dated 05.01.2011). ITI పాలిటెక్నిక్ లెక్చరర్లు 5 రోజులు (జీవో 59, dated 22.07.2008), డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 5 రోజులు (జీవో 129, dated 25.10.2011). ఉపాధ్యాయులు 7 రోజులు (జీవో 47, dated 12.02.1965). నర్సింగ్ ఉద్యోగులు సంవత్సరానికి రెండు సార్లు (ఒక విడతకు 12 రోజులకు మించకుండా) ప్రత్యేక సెలవులు లభిస్తాయి. అన్ని విభాగాల్లో పని చేసే ప్రభుత్వ మహిళా ఉద్యోగులు 5 రోజులు. ( జీవో 142 dated.1.9.2018).

ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం కల్పించిన ఈ సెలవులు కేవలం రాయితీలు మాత్రమే కాకుండా వారి హక్కులు, సంక్షేమానికి నిదర్శనం. ప్రసూతి, చిన్నారుల సంరక్షణ, శస్త్రచికిత్సల సందర్భాల్లో ఇచ్చే సెలవులు వారు ఆరోగ్యంగా కోలుకుని విధుల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు సహాయపడతాయి. సంబంధిత నిబంధనలు, జీవోలు, అర్హతలను తెలుసుకుని దరఖాస్తు చేసుకుంటే సకాలంలో ప్రయోజనాలు పొందవచ్చు. మహిళా ఉద్యోగులందరూ ఈ సమాచారాన్ని సద్వినియోగం చేసుకొని వ్యక్తిగత జీవితాలను విజయవంతంగా సమతుల్యం చేసుకోగలరు.

-మనోహర్ రావు చిలప్పగారి

రిటైర్డ్ గవర్నమెంట్ అఫీషియల్

96406 75288

Next Story