ఈ ఒప్పందంతో.. దేశ రైతాంగానికి ఉరే!

by Ravi |   (  Updated:2026-02-15 01:00:33  IST  )

With This Deal A Death Blow to the Country’s Farming Community

ఈ ఒప్పందంతో.. దేశ రైతాంగానికి ఉరే!
X

భారత్-అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దేశ రాజకీయాల్లోనే కాకుండా వ్యవసాయ రంగంలోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. అమెరికా అధికార వర్గాలు దీన్ని తమ రైతులకు లాభదాయకమని పేర్కొనడంతో.. ఈ ఒప్పందం రైతాంగానికి ముప్పుగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి. ఈ నేపథ్యంలో, ఈ వాణిజ్య ఒప్పందం దేశ రైతాంగ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ప్రశ్న మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించ‌డం సైతం స‌ర్వత్రా విమ‌ర్శల‌కు కార‌ణ‌మైంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత‌లు, పలువురు ప్రతిపక్ష నేతలు ఈ వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయం, పాడి పరిశ్రమలకు సంబంధించిన ప్రయోజనాలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా, మోడీ ప్రభుత్వం ఎవరి విజ్ఞప్తుల‌ను ప‌ట్టించుకోకుండా ముందుకు వెళ్లడంతో అన్ని వ‌ర్గాల నుంచి వ్యతిరేక‌త వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే మోడీ ప్రభుత్వ నిరంకుశపూరిత వైఖ‌రికి నిర‌స‌న‌గా.. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా రైతు సంఘాలు స‌మ్మె నిర్వహించాయి.

పంట మనది – లాభం పరాయిది..

ఈ ఒప్పందం మీద అమెరికా మంత్రి బ్రూక్ రోలిన్స్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం అమెరికా రైతులకు లాభదాయకమని అభివర్ణించారు.. కానీ, భార‌తీయ రైతుల‌కు ఈ ఒప్పందం శ‌ర‌ఘాతంలా మారిన విష‌యం ప్రధాని మోడీ ఆయ‌న ప‌రివారం ఎందుకు గుర్తించ‌డం లేదో? కేంద్ర ప్రభుత్వం స‌మాధానం చెప్పాలి. అమెరికా సోయాబీన్ ఆయిల్, డిస్టిలర్స్ గ్రెయిన్స్‌కు భారత మార్కెట్ తలుపులు తెరవడం ద్వారా దేశీయ రైతును తన నేలపైనే పోటీ చేయలేని స్థితికి నెట్టివేస్తున్నారు. చౌక విదేశీ దిగుమతులు పాడి, పశుసంవర్థక రంగాలను కూల్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తాయి. ‘పంట మనది – లాభం పరాయిది’ అనే దోపిడీ విధానాన్ని దేశంపై ప్రధాని మోడీ బలవంతంగా రుద్దుతున్నారు.. ఎంఎస్‌పీ హామీలతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం నేడు అంతర్జాతీయ డంపింగ్‌కు ద్వారాలు తెరిచి రైతును బలి చేస్తోంద‌న్న వాద‌న‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.. రైతు రక్షణ ముసుగులో అమెరికా బహుళజాతి సంస్థల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నది. ఈ ఒప్పందం భారత ఆహార భద్రతను బలహీనపరిచే కుట్రనే.

కనీస చర్చ లేకుండానే..

దేశానికి సంబంధించిన ఇంత‌టి కీల‌క నిర్ణయం తీసుకునే ముందు... రాష్ట్రాలను సంప్రదించకపోవడం, పార్లమెంటులో చర్చ జరపకపోవడం, రైతు సంఘాల అభిప్రాయాన్ని లెక్కలోకి తీసుకోకపోవడం ప్రజాస్వామ్య విలువల స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవ‌ర్తించారు. ఇది రాజ్యాంగ విలువ‌ల్నీ పాత‌రేయ‌డం కింద‌కు వ‌స్తుంది. ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసి రైతుకు చట్టబద్ధ రక్షణ కల్పించాల్సిన అసవరముంది. దేశాన్ని పోషించే రైతును బలి చేసి ఏ ప్రభుత్వం నిలబడలేదన్న విష‌యం మోడీ గుర్తించుకోవాలి. ఈ ఒప్పందం పాడి పరిశ్రమపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. అమెరికా నుండి పౌల్ట్రీ ఉత్పత్తులు, డిస్టిలర్స్ గ్రెయిన్స్ (పశువుల మేతగా వాడేవి) దిగుమతి అయితే, దేశీయ పశుగ్రాసం ధరలు పడిపోయతాయి. పాడి రైతులకు ఆదాయం తగ్గుతుంది. మన అవసరాలకు సరిపడా ఆహారాన్ని మనమే పండించు‌కోకుండా, దిగుమతులపై ఆధారపడితే.. భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల దేశంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం లేక‌పోలేదు. అందుకే రైతులు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, దానిని ఒక చట్టపరమైన హక్కుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికైనా వెనక్కి తీసుకోండి!

రాష్ట్ర జాబితాలో ఉన్న వ్యవసాయం గురించి కేంద్రం నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాష్ట్రాలను సంప్రదించ కపోవడంపై ఆగ్రహం క‌ల్పించ‌డం జ‌రుగుతున్నది. వ్యవసాయ రంగంలోకి బహుళజాతి సంస్థల ప్రవేశం వల్ల రైతు కేవలం ఒక 'కూలీ'గా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశం. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల కేంద్ర-రాష్ట్రాల స‌యోధ్య పోతుంది. ఇంతటి కీలకమైన మార్కెట్ మార్పులపై పార్లమెంటులో చర్చ జరగకపోవడం వల్ల, భవిష్యత్తులో తలెత్తే లోటుపాట్లను సరిదిద్దే అవకాశం లేకుండా పోతుంది. అమెరికా వంటి దేశాల్లో యాంత్రీకృత వ్యవసాయం వల్ల ఖర్చులు తక్కువ, కానీ భారత్‌లో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు.. వీరిద్దరి మధ్య పోటీ అనేది అసమానమైనది. ఈ విష‌యాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఒప్పందాన్ని వెన‌క్కి తీసుకొని... భార‌త రైతాంగాన్ని ఆదుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాం.

- డా. రేఖ బోయలపల్లి

ఉపాధ్యక్షురాలు, తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్

Next Story