- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ నిమిషం నిబంధనతో.. భవిష్యత్తు అంధకారం
With the inter minute rule.. the future of the students is dark

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యాశాఖ అధికారుల అనాలోచిత వైఖరి అసంఖ్యాక విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. ఏ రెండు గడియారాలూ ఒకే సమయం చూపవన్న వాస్తవం తెలిసి కూడా నిమిషం నిబంధనను ఇంటర్ అధికారులు అమలు పరచడం వల్ల విద్యార్థుల బంగారు భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతున్నది.
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదంటూ పరీక్షల నిర్వహణ సందర్భంగా విధిస్తున్న ఈ నిబంధన పలువురు విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారుతున్నది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో లోపాల్ని పరిష్కరించలేని అధికారులు, ప్రైవేటు సంస్థల దూకుడును అడ్డుకోవడంలో విఫలమైన పాలకులు ఏదో గొప్ప పని చేస్తున్నామని చాటుకోవడానికి ఈ నిమిషం నిబంధన విధిస్తున్నారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థ పట్ల సమాజంలో విశ్వాసం కలిగించేలా వ్యవహరించాల్సిన వారే అందుకు భిన్నమైన వైఖరి అవలంబించడం సిగ్గుపడాల్సిన విషయం.
పరీక్షల పరమార్థం ఇదేనా?
పరీక్షలు లక్ష్యాత్మక సోపానాలు. విద్యావ్యవస్థలో అంతర్భాగంగా గుర్తింపు పొందిన పరీక్షలు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నవి. విజ్ఞానాన్ని వెలికి తీయాల్సిన పరీక్షలు విద్యార్థుల ముందడుగుకు అవరోధం కాకూడదు. ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి అధికారులు పరీక్షల కాలంలో విద్యార్థులను అనుక్షణం భయభ్రాంతులకు గురిచేసే నిమిషం నిబంధన రుద్దుతున్నారు. ఇదే విషయాన్ని విస్తృత ప్రచారంలోకి తెచ్చామని గర్వపడుతున్నారు. ఈ నిబంధన కారణంగా పలువురు విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతున్న వాస్తవాన్ని వారు ఇప్పటికీ గుర్తించడం లేదు. గత ఇంటర్ పరీక్షల్లో నిజామాబాద్ జిల్లాలో పది మంది, వేములవాడలో ఇద్దరు నిమిషం నిబంధనతో పరీక్షలకు దూరమయ్యారు. అలాగే పాలేరు నియోజకవర్గం నుంచి ఖమ్మం నగరానికి పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థినికి సమయానికి బస్సు దొరకక పది నిమిషాలు ఆలస్యంతో ఇంటర్ పరీక్ష రాయలేకపోయింది. ఇలా నిమిషం నిబంధన చాలా మంది విద్యార్థుల బంగారు భవిష్యత్‌ను ప్రశ్నార్ధకం చేస్తున్నది.
మీ బాధ్యతల్ని తేలికగా తీసుకోలేదా?
పరీక్షలకు ఎంత ముందుగా బయలుదేరినా కొత్త చోటు, దూరం, రవాణా సౌకర్యాల కొరత వంటి సమస్యలు విద్యార్థుల ఆలస్యానికి కారణాలవుతున్నాయి. పరీక్ష పేపర్ల లీకేజీ, అవినీతి కార్యకలాపాల నియంత్రణ, సమయపాలన లక్ష్యాలుగా నిమిషం నిబంధన అమలు చేస్తున్నామని ప్రకటించుకున్నవారు, తన బాధ్యతల్ని తేలికగా తీసుకున్న సందర్భాలు లేవా? పరీక్ష హాల్ టికెట్ పత్రాల్లో కేంద్రం పేరు ఒక దాని బదులు మరొకటి ఉండడం, చేతితో రాసిన పరీక్ష పత్రాలు పెట్టడం వంటి తప్పిదాలు ముందు సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ అర్థం పర్థం లేని నిమిషం నిబంధన చట్రాల్లో విద్యార్థులను బిగించవద్దు. కాబట్టి ఇంటర్ పరీక్షల విషయంలో భవిష్యత్తులో నిమిషం నిబంధనను బేషరతుగా ఉపసంహరించడం ఉత్తమం.
సభావట్ కళ్యాణ్
ఏబీవీపీ రాష్ట్ర నాయకులు
90143 22572






