చరిత్ర పాఠాల మార్పుతో.. విజ్ఞానానికి బదులు విధేయతా నేర్పిస్తారా?

by Ravi |   (  Updated:2025-10-26 01:15:53  IST  )

ప్రారంభమైన అరవై నాలుగేళ్ల తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ తన అస్తిత్యాన్ని కోల్పోయింది. భారతదేశం ప్రజాస్వామ్య దేశమన్నది మరిచి, అధికారంలో ఉన్న వారికి అనుగుణంగా తిరోగమనంలోకి వెళ్లింది.

చరిత్ర పాఠాల మార్పుతో.. విజ్ఞానానికి బదులు విధేయతా నేర్పిస్తారా?
X

ప్రారంభమైన అరవై నాలుగేళ్ల తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ తన అస్తిత్యాన్ని కోల్పోయింది. భారతదేశం ప్రజాస్వామ్య దేశమన్నది మరిచి, అధికారంలో ఉన్న వారికి అనుగుణంగా తిరోగమనంలోకి వెళ్లింది. జీవ పరిణామ సిద్ధాంతం- సైన్సు పాఠ పుస్తకాల్లోంచి తీసి వేయడమే కాకుండా, ఢిల్లీ సల్తనత్, మొఘ లుల ప్రసక్తి లేకుండా సిలబస్ ఏర్పాటు చేశారు. హిందూ తీర్థ స్థలాల విశేషాలు, కుంభమేళా వంటి ఆధ్యాత్మిక సంబంధిత విషయాలను 6నుండి 8వ తరగతి సోషల్ సైన్స్‌లో చేర్చారు. పాఠ్యాంశాల విషయంలో ఎన్‌సీఆర్‌టీ అహేతుకమైన నిర్ణయాలు తీసు కోవడమే కాకుండా, తాము హేతుబద్ధంగా ఈ మార్పులు చేర్పులు చేశామని చెప్పుకున్నది.

అసలు హేతుబద్ధత అంటే ఏమిటీ? నిజాలు అంటే ఏవీ? అనే విషయాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారికి తెలిసినట్టు లేదు. కనీసం ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ సంస్థ అధికారులకు కూడా తెలిసినట్టు లేదు. తెలిసినా, తమ స్వార్థ ప్రయోజనాల కోసం మనసులు చంపుకుని ప్రభుత్వాధినేతల సూచనల మేరకు విధులు నిర్వర్తిస్తున్నట్లుగా ఉంది. మనం మన రాజ్యాంగంలో రాసుకున్నట్టు వైజ్ఞానిక స్పృహ (50A-H)కు విఘాతం కలుగుతున్నందువల్ల, భావితరాలన్నీ అంధకారంలో కూరుకుపోబోతున్నాయి గనక, దేశ పౌరులందరూ ఈ విషయాల మీద దృష్టి సారించాల్సి ఉంది! సహేతుకమైన పాఠ్య ప్రణాళిక కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సి ఉంది!!

ఈ పాఠాలు పెట్టే ధైర్యముందా?

హిందూ తీర్థ స్థలాల విశేషాలు, అత్యంత అనాగరికమైన మహా కుంభమేళా గురించి ఒక కొత్త పాఠం చేర్చడం వల్ల ప్రపంచ జ్ఞానం కలుగుతుందా? వివేచన పెరుగుతుందా? అనవసరంగా హిందుత్వను, తమ హిందూ రాష్ట్ర సాధన ఉద్దేశాన్ని పసి పిల్లల మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేయడం ఎందుకు చేస్తున్నారు? వీటితో పాటు ఒకప్పుడు దేశ విదేశాల్లో విసృత ప్రచారంలో ఉన్న బౌద్ధాన్ని నాశనం చేసిన ఘనుల వంశమైన శృంగ వంశం గురించి పిల్లలకు పాఠం పెడతారా? ఒకవేళ పెట్టినా వాస్తవ చరిత్ర బోధిస్తారన్న నమ్మకమేముందీ? అభూత కల్పనలతో కథలు అల్లి చెపుతారేమో? గత పదకొండేళ్లుగా అధికారంలో ఉన్న ఈ ఆర్ఎస్ఎస్- బీజేపీ ప్రభుత్వం అబద్ధాలతో విద్వేషాన్నే కదా ప్రచారం చేస్తున్నది! మీడియా సంస్థల్ని కొన్నది సరిపోలేదు. ఈడీ, సీబీఐ, కోర్టులు వంటి వ్యవస్థల్ని ధ్వంసం చేసింది సరిపోలేదు. అమెరికాకు గులాంగిరి చేస్తున్నది సరిపోలేదు. అందుకే ఇప్పుడు పాఠశాల విద్యార్థుల మెదళ్లు పాడు చేయడానికి ఒక కొత్త పథకం రూపొందించారు. గతంలో యూపీఏ అధికారంలో ఉండగా, వారి కాలంలో విధించిన ‘ఎమర్జెన్సీ’కి సంబంధించిన పాఠం సోషల్ స్టడీస్‌లో ఉండేది. మరి అలాంటి ధైర్యం ఈ ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఎందుకు లేదు? ధైర్యముంటే తమ ఆధ్వర్యంలో జరిగిన గుజరాత్, మణిపూర్ మారణకాండలు పాఠాల్లో పెట్టాలి.

బలవంతంగా మార్పిడులు చేసుంటే..?

చరిత్ర పాఠ్యాంశాల్లో మొఘలుల పరిపాలనా కాలాన్ని తొలగించినందుకు ఎన్‌సీఈఆర్‌టీ చెపుతున్న కారణాలు ఏవంటే, మొఘలులు పెద్ద ఎత్తున మత మార్పిడులు చేశారు, సొంత తండ్రుల్ని, అన్నదమ్ముల్ని చంపి రాజ్యాధికారం చేపట్టారు, హిందూ దేవాలయాల్ని కూల్చారు. హిందువుల్ని ద్వేష భావంతో చూశారు. వారిపై జిజియా పన్ను విధించారు. పైగా వారి మూలాలు ఈ దేశంలో లేవు. వారంతా దోపిడి దారులు, దేశాన్ని దోచుకునిపోయారని చెబుతున్నారు. మరి ఈ కారణాల్లో వాస్తవాలు ఎన్ని? అవాస్తవాలు ఎన్ని అనేది ప్రశ్న. హిందూ ప్రచారంలో ప్రముఖుల అభిప్రాయాల ప్రకారం పరిశీలిస్తే, స్వామి వివేకానంద ప్రకారం, మొఘలుల కాలంలో బెంగాల్‌లో ముస్లింల జనాభా పెరగడానికి కారణం, ఆ రోజుల్లో హిందువులైన భూస్వాముల, జమీందార్ల ఆగడాలు, హిందూ పురోహితుల కఠిన నియమాలు. వీటి నుంచి తప్పించుకోవడానికి పేద హిందూ రైతులు ఇస్లాంలోకి మారేవారు. దానివల్ల మొఘల్ చక్రవర్తి రక్షణ వారికి లభిస్తూ ఉండేది. ఇక కొందరేమో వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి ఇస్లాం స్వీకరించేవారు. అంతేగాని, మొఘలులు బలవంతంగా అధికారికంగా హిందువుల్ని ఇస్లాంలోకి మార్చిన దాఖలాలు లేవు. అలా అని చరిత్ర పుటల్లో ఎక్కడా నమోదు కాలేదని చెప్పారు.. పైగా అణగారిన వర్గాల వారు నిరుపేదలు, నిరాశ్రయులు సైతం ముస్లింల పాలనలో అంటే మొఘలుల పాలనలోనే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నారని నమోదు చేశారు.. మనం ఆలోచించినా.. మొఘలులు బలవంతంగా మత మార్పిడులు చేసి ఉంటే ముస్లింల జనాభా శాతం చాలా పెరగాల్సింది కదా? మరి ఆ రోజుల్లో హిందువులు 80-85 శాతమున్నారు కదా? పోనీ తర్వాత అయినా ముస్లిం జనాభా పెరిగారా అంటే అదీ లేదు.. 2011లో జరిగిన జనాభా లెక్కల్లో సైతం, ముస్లింల జనాభా 14-23 శాతం మాత్రమే ఉందని తేలింది!

ఆ రోజుల్లో రాజవంశ హత్యలు సహజం!

ఇక మొఘలులు స్వంత తండ్రుల్ని, కుటుంబీకులను చంపి రాజం హస్తగతం చేసుకునేవారు. ఇది నిజమే! అయితే ఈ విషయం కేవలం ముస్లిం రాజులకూ మొఘలులకూ మాత్రమే పరిమితం కాలేదుగా.. ప్రాచీన యుగంలో, మధ్య యుగంలో ఆధునిక యుగంలోనూ సింహాసనం కోసం, లేదా అధికారం కోసం, రాజు కుటుంబాలలో హత్యలు సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. ఇందుకు అశోకుడు, హర్యాంక వంశం, గుప్త వంశం, రాజపుత్ర వంశాలు లేవా? ఆ రోజుల్లో రాజ్యం కోసం కుటుంబాలలో కుట్రలూ, హత్యలు సహజంగా జరుగుతూనే ఉండేవి. ఆ విషయం దాచిపెట్టి, మొఘలులను మాత్రమే క్రూరులుగా, చూపడం సరైంది కాదు. ఇక్కడ హిందూ ముస్లిం తేడా లేదు. రామాయణంలో మాత్రం ఏమైంది? వాలిని చంపించి సుగ్రీవుడు రాజ్యానికి రాలేదా? రావణున్ని చంపించిన విభీషణుడు రాజు కాలేదా? అహేతుకమైన నిర్ణయాలు తీసుకుని, తాము హేతుబద్ధంగా సిలబస్ మార్చామని చెప్పుకుంటున్న ఎన్‌సీఈఆర్‌టీ-కేంద్ర ప్రభుత్వం ఇకనైనా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది.

- దేవరాజు మహారాజు

విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్,

99086 33949

Next Story