దేశంలో పాలన మార్పు గాలులు.. మళ్లీ బీహార్‌ నుంచేనా?

by Ravi |   (  Updated:2025-10-14 01:01:02  IST  )

దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చిన చరిత్ర బీహార్‌ ప్రజలకున్నది. లోక్‌నాయక్‌గా పిలువబడ్డ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఎమర్జెన్సీ అనంతరం బీహార్‌ నుంచే చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా

దేశంలో పాలన మార్పు గాలులు.. మళ్లీ బీహార్‌ నుంచేనా?
X

దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చిన చరిత్ర బీహార్‌ ప్రజలకున్నది. లోక్‌నాయక్‌గా పిలువబడ్డ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఎమర్జెన్సీ అనంతరం బీహార్‌ నుంచే చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా పెనుసంచలనం కలిగించింది. అపరకాళిగా గుర్తింపు ఉన్న ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ఓటమికి బీహార్‌లోనే బీజం పడింది. 11 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్న మోడీ పాలనకు కూడా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెరపడనుందనే సంకేతాలు వస్తున్నాయి.

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందు నుంచే సీఎం నితీశ్‌ కుమార్‌ వ్యవహార శైలిపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతూ వస్తున్నది. ఏ ఎండకాగొడుగు పట్టే నితీశ్‌ కుమార్‌ పదవీ కాంక్ష ఎటువంటిదో దేశ ప్రజలందరికీ తెలిసిందే.

ఈ నాయకుడిపై ఏహ్య భావంతో..

నితీశ్‌ కుమార్‌‌ది పదవిని కాపాడుకోవడమే ఏకైక సిద్ధాంతం. ఎవరితోనైనా కలవగలడు, విడిపోగలడు అని నిరూపించుకుంటూనే వస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ప్రారంభ సమయంలో ఇటు వైపు ఉన్న ఆయన అమాంతంగా ఎన్‌డీఏ వైపు తిరిగి తన నైజాన్ని మరోమారు నిరూపించుకున్నారు. ఒకసా రి బీజేపీతో కలిసి అధికారంలో ఉన్నారు. తప్పు చేశానని బీజేపీతో కలవనని నమ్మించి మరోసారి రాష్ట్ర ప్రజల్ని వంచించారు. తీరా ఆర్‌జేడీతో కలసి అధికారంలోకి వచ్చి మళ్లీ ప్లేటు ఫిరాయించి బీజేపీ పంచన చేరారు. ఇవన్నీ నితీశ్‌ కుమార్‌ పట్ల బీహార్‌లో ఒక విధమైన ఏహ్య భావనకు కారణాలయ్యాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం 80 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని, అందుకే ఆ లెక్కలు చూపడం లేదని తేజస్వి ఆరోపణల్లో నిజం ఉందని బీహార్‌ ప్రజలు నమ్ముతున్నారు.

అడ్డంగా దొరికిన ఈసీ

ఎన్నికల కమిషన్‌ బీహార్‌లో చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఆ రాష్ట్రంలో ప్రకంపనలకు కారణమైంది. ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఆ రాష్ట్రంలో సుమారు 65 లక్షల ఓటర్లను తొలగించడం పెను దుమారాన్ని రేపింది. ఇందులో 18 లక్షల మంది చనిపోయారని, 52 లక్షల మంది బీహార్‌లో లేరని వచ్చిన లీకుల వైనంపై ప్రతిపక్షాలు ఆరా తీశాయి. ఈ తరుణంలోనే ఈ విషయంపై ప్రతిపక్షాలు, మీడియా కూడా సీరియస్‌గా దృష్టి సారించాయి. గత లోక్‌సభ ఎన్నికల ఓటరు లిస్టులను చేతబట్టుకుని ఇంటింటికీ తిరగడంతో అసలు నిజాలు బహిర్గతమయ్యాయి. ఓటర్లను తొలగించడం కోసం ఎన్నికల సంఘం చేసిన కుట్ర బయటకు వచ్చింది. పార్కులో ఆడుకునే చిన్న పిల్లలతో సంతకాలు చేయించి వేల మందిని ఓటరు లిస్టుల నుంచి తొలగించిన ఘటనలు వెలుగుచూశాయి.

లిస్టులో మృతులు.. కోర్టులో హాజరు

రాహుల్‌ గాంధీ ఏకంగా ఎన్నికల కమిషన్‌ లెక్కల్లో మృతిచెందినట్టు చూపించిన వారిని తన నివాసానికి పిలిపించుకుని వారితో ముచ్చటిస్తూ, టీ తాగుతూ ఉన్న ఫోటోలు, వీడియోలను విడుదల చేయడంతో బీహార్‌లో గెలుపుకోసం బీజేపీ ఎన్నికల కమిషన్‌ను ఎలా వాడుకుంటున్నదో చాలా అర్థవంతంగా దేశ ప్రజల ముందు పెట్టారు. సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్‌ ఎస్‌ఐఆర్‌పై కోర్టు జరుపుతున్న విచారణ సమయంలో ఓటరు లిస్టులో మృతిచెందినట్టు చూపించిన వారిని కోర్టు హాలులో ప్రవేశపెట్టి సంచలనం సృష్టించారు. ఈ పరిణామాలన్నీ బీహార్‌లో జరుగనున్న ఎన్నికల రణక్షేత్రంపై దేశ ప్రజల దృష్టిని సారించేలా చేశాయి.

ముఖచిత్రాన్ని మార్చిన రాహుల్ ప్రచారం..

రాహుల్‌ గాంధీ బీహార్‌లోనే ఓటరు అధికార యాత్ర చేపట్టి దేశ ప్రజల్ని బీహార్‌లో రాజకీయ మార్పువైపు చూసేలా చేశారు. మహాఘట్‌ బంధన్‌లోని అన్ని పార్టీల నేతలను కలుపుకుని మొత్తంగా 16 రోజుల పాటు 25 జిల్లాలో 1300 కిలో మీటర్లు పైగా చేసిన యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసింది. ఎస్‌ఐఆర్‌లోని అవకతవకలను ఎత్తి చూపుతూ ఎన్నికల కమిషన్‌, బీజేపీ ఒక్కటే అని నిరూపించడంలో రాహుల్‌ విజయం సాధించారు. బీహారీ పద్ధతులను అనుసరించడం, వారిలా టవల్‌ను మెడపై వేసుకోవడం, ద్విచక్రవాహనాలను స్వయంగా నడుపుతూ, హైవే వెంట దాబాలు సందర్శిస్తూ స్థానికులతో మమేకమయ్యారు. మహిళలు, దళితులు, ముస్లింలు, యాదవులు, గిరిజన, ఓబీసీ, ఈబీసీ వర్గాల వారి సమస్యలను ప్రస్తావిస్తూ ముందుకు కదులుతూ ఆయా వర్గాల్లో విశ్వాసాన్ని నింపారు. గత ఎన్నికల్లో ఏకంగా 12 సీట్లను గెలుచుకున్న సీపీ ఐ(ఎం.ఎల్‌) సహా ప్రధాన పక్షాలైన సీపీఐ, సీపీఎంలు పేద, అణగారిన వర్గాల పార్టీలుగా మరింత పట్టు పెంచుకున్నాయి. రాష్ట్రంలో పని చేస్తున్న జార్ఖండ్‌ ముక్తి మోర్చా, లోక్‌ జనశక్తి పార్టీ వంటి కొత్త పార్టీలు కూడా ఈసారి మహాఘట్‌ బంధన్‌ కూటమిలో భాగమవడంతో రాష్ట్రంలోనూ, అనంతరం దేశంలోనూ మార్పు తథ్యమే.

-డా. ముచ్చుకోట సురేష్ బాబు

99899 88912

Next Story