- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏకకాల ఎన్నికలకు.. ఏకాభిప్రాయం కుదిరేనా?
2024 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో 96.88 కోట్ల ఓటర్లు కలిగిన దేశం. దేశంలో ఏదో ఒక మూల

2024 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో 96.88 కోట్ల ఓటర్లు కలిగిన దేశం. దేశంలో ఏదో ఒక మూల తరుచుగా ఎన్నికలు జరుగుతుండడంతో ప్రజా వ్యయం పెరగడంతో పాటు పాలనలో అంతరాయం, ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతున్నది. అందుకే ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అనే వాదనను ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. అయితే, రాజ్యాంగపరమైన, చట్ట పరమైన సవాళ్లను అధిగమించి ఇది విజయవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల విశ్వాసాన్ని పొందాల్సి ఉంటుంది, మరి ఇది సాధ్యమా?
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రజలు మెచ్చిన ప్రజా ప్రతినిధులను ఎన్నుకొనే స్వేచ్ఛ ప్రజాస్వామ్య దేశాల్లో కలిగి ఉంది. అయితే దేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తరచుగా విధించకుండా ఉండటానికి, ప్రజా వ్యయాన్ని తగ్గించడానికి, పాలనకు అంతరాయాన్ని తగ్గించడానికి, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఎన్నికలలో ఓటర్ల భాగస్వామ్య శాతాన్ని పెంచడానికి, మన దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం అవసరం.
నిరంతర ఎన్నికల ప్రక్రియను నివారించడానికి..
మన దేశంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు 1952, 1957, 1962, 1967లలో దేశవ్యాప్తంగా లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1967 తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చీలిక రావడం, అనేక రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత, రాష్ట్రపతి పాలన విధించడం, కొన్ని రాష్ట్ర అసెంబ్లీలు అకాలంగా రద్దు కావడం వంటి కారణాలతో ఏకకాల ఎన్నికలకు తెరపడింది. ఆ తర్వాత దేశంలో ప్రతి ఏడాది దేశంలో ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నిరంతర ఎన్నికల ప్రక్రియను నివారించడానికి కేంద్రం ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అమలు చేయాలని 2023 సెప్టెంబర్ 2న మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమించింది. ఆ కమిటీ వివిధ వర్గాల వారి అభిప్రాయాలు తీసుకొని ఏకకాల ఎన్నికలు నిర్వహించాలని, అలాగే ఈ ఎలక్షన్ నిర్వహించిన వందరోజులలోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రతిపాదించింది. ఇవి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు అనే రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను 2024 డిసెంబర్ 17న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులు ప్రస్తుతం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉన్నాయి.
ఈ రాష్ట్రాలు మద్దతు ఇస్తాయా?
అయితే, ఏకకాల ఎన్నికలు కోసం కేంద్రం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, వాటిని నిర్వహించడంలో మాత్రం అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు 2024లో జరిగాయి, తదుపరి ఎన్నికలు 2029లో జరగనున్నాయి. కానీ, కొన్ని రాష్ట్రాల ఎన్నికలు 2023లో జరిగాయి, వాటి తదుపరి ఎన్నికలు 2028లో జరుగుతాయి. అదే సమయంలో.. కొన్ని రాష్ట్రాల ఎన్నికలు 2025, 2027లో జరగాల్సి ఉంది. వాటి అసెంబ్లీల గడువు 2030 నుండి 2032లో ముగుస్తున్నాయి. 17 రాష్ట్రాల ఎన్నికలను సర్దుబాటు చేసి 2029లో నిర్వహించవచ్చు. కానీ 2025 నుండి 2027 వరకు ఎన్నికలు జరిగే మిగితా రాష్ట్రాల అసెంబ్లీలను 2029 లోక్‌సభ ఎన్నికలతో సమకాలీకరించడానికి ఒకటి నుండి మూడు సంవత్సరాల ముందుగానే వాటి శాసనసభలను రద్దుచేసి 2029 ఎన్నికలతో సమకాలీకరించడం కష్టమైన పని. ఒకవేళ చేయాలనుకున్నా పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ కావలసి ఉంటుంది. అలాగే స్థానిక ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ సవరణల కోసం కనీసం యాభై శాతం రాష్ట్రాల ఆమోదం అవసరం కావచ్చు. ఈ బిల్లులకు ముందుగానే పదవీకాలం కోల్పోయే రాష్ట్రాలు మద్దతు ఇవ్వకపోవచ్చు. ఇక రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సంపాదించడం ఇంకా కష్టం. ఏది ఏమైనా, ప్రజా వ్యయాన్ని తగ్గించడానికి, పాలనకు అంతరాయాన్ని తగ్గించడానికి మన దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం అవసరం. అయితే, 2029లోనే రాజ్యాంగపరమైన, చట్టపరమైన సవాళ్లను అధికమించి ఇది విజయవంతంగా అమలు అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి..
డాక్టర్ సురేందర్ అడ్కి
రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్
94404 49339






