నిరుద్యోగులను నిస్తేజంలోకి నెడతారా..?

by Ravi |   (  Updated:2025-01-29 00:45:37  IST  )

గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుండి 61 ఏళ్లకి పెంచి నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టింది.

నిరుద్యోగులను నిస్తేజంలోకి నెడతారా..?
X

గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుండి 61 ఏళ్లకి పెంచి నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టింది. అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందుల సాకులు చూపుతూ మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 2 సంవత్స రాలు పెంచాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే జరిగితే స్వరాష్ట్ర సాధనలో భాగస్వామ్యం అయి, కోటి ఆశలతో కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థి నిరుద్యోగ యువతకి తీరని అన్యాయం చేసుడే అవుతది అని ప్రభుత్వం గుర్తించాలి. ఆ నిర్ణయం ముమ్మాటికీ నిరుద్యోగ యువత జీవితాలను నిస్తేజంలోకి నెట్టి వేసే ప్రయత్నమే అవుతుంది.

అసలు తెలంగాణ ఉద్యమం మొత్తం ఉద్యోగ నియామకల నినాదం మీదనే కొనసాగింది కదా...? నిజాం పాలనలోను, సమైక్య పాలనాలోనూ తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువతకు దక్కవలసిన ఉద్యోగల కోసమే ఆరు దశాబ్దాల ఆత్మ గౌరవ పోరాటలు కొనసాగింది. న్యాయంగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు దక్కవలసిన ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసమే ముల్కి-గైర్ ముల్కి పోరాటం అయినా, ఇడ్లీ -సాంబార్ గో బ్యాక్ ఉద్యమం అయినా, 1969 కాల్పులు అయిన, పాల్వంచ పోరాటం అయినా, తొలి దశ ఉద్యమం నుండి మలి దశ పోరాటం వరకు ఆరు దశాబ్దాల ఉద్యమంలో విద్యార్థి, నిరుద్యోగ యువత పాల్గొని సమైక్య పాలకుల తుపాకీ తూటాలకి బలి అయింది, కేసుల పాలు అయింది.

ఉద్యమంలో కీలకపాత్ర వారిదే!

ఇక్కడ ప్రధానంగా ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాలలో ఎక్కువ నష్టపోయింది, విద్యార్థులు, నిరుద్యోగ యువతనే అనేది అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. తొలి దశ ఉద్యమంలో అయినా, మలిదశ పోరాటంలో అయినా విద్యార్థి, నిరుద్యోగ యువత సంవత్సరాల తరబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ కళాశాల తరగతులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చి వివిధ పోరాట పద్ధతుతో తమ న్యాయమైన పోరాటం కొనసాగించారు... ఈ సమ యంలో విద్యార్థి, నిరుద్యోగ యువతపై కేసులు కావడం ఒక ఎత్తు అయితే... లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి తమ చదువులు కోల్పోయారు, యూనివర్సిటీ వార్షిక పరీక్షలు ఎగ్జామ్స్ రోజు కూడా వాయిదా పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నాటి చదువులు గందరగోళం మధ్య కొనసాగి అనేక రకాలుగా విద్యార్థులు నష్ట పోయింది... తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఉద్యోగాలు వస్తాయానే కదా...? అప్ప టికి చదువులు పూర్తి అయి, ప్రభుత్వ నోటిఫికేషన్‌ల కోసం ఒక వైపు ఎదురు చూస్తూనే మరొక వైపు తెలంగాణ రాష్ట్రం వస్తే మంచి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చి తమ బతు కులు బాగుపడతాయాని తెలంగాణ నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి పోరాడింది.

ఆర్థిక ఇబ్బందుల సాకు చూపి..

చివరికి ఉద్యమ సమయంలో సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌లు అంతత మాత్రమే విడుదల అయినా, కనీసం ప్రయివేట్ సెక్టార్‌లో కూడా సరైన జాబ్స్ దొరకక విద్యార్థులు ఉద్యమంలో చదువుకు దూరం అయి, సంపాదించే వయసులో యువత ఉద్యమం బాట పట్టి తమ విలువైన యవ్వనం కోల్పోయి, ఉద్యోగాలకు ఏజ్ బార్ అయి తీవ్ర కుంగుబాటుకు గురి అయి, నిస్పృహకి లోనూ అయి స్వరాష్ట్రంలో అయినా తమ బతుకులు మారుతాయని విద్యార్థి, నిరుద్యోగ యువత ఎదురు చూస్తోంది. కానీ ఆర్థిక ఇబ్బందుల సాకులు చూపుతూ మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు ప్రభుత్వం పెంచాలనుకుంటే స్వరాష్ట్ర సాధనలో భాగస్వామ్యం అయి, కోటి ఆశలతో కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థి నిరుద్యోగ యువతకి తీరని ద్రోహం చేసుడే అవుతది అని ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యో గులు చాలా మంది రిటైర్మెంట్ నాటికి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ నిర్ణయాన్ని వ్యతికిస్తున్నారు.

ఈ ఆలోచన ఉంటే విరమించుకోవాలి!

నవ యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తే తక్కువ పే స్కేల్‌తో... ఎక్కువ పని, ప్రజెంట్ జనరేషన్ ఆలోచనలతో వేగంగా పని చేయగలుగుతారనే కనీస సోయి కూడా ప్రభుత్వ పెద్దలకు లేకపోవడం శోచనీయం. ఆరు దశాబ్దాల ఆత్మగౌరవ పోరాటంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత తొలి దశ ఉద్యమంలో సమైక్య పాలకుల తుపాకీ తూటలకి ఎదురు నిలిచి ప్రాణాలు కోల్పోయి, మలిదశ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న ఆ విద్యార్థి అమరుల కన్న కల ఒక్కటే తమ తర్వాత తరం విద్యార్థి, నిరుద్యోగ యువతకు అయినా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కాలనే...!

అమరుల ఆశయాలు విద్యార్థి, నిరుద్యోగ యువత ఆశలు వమ్ము చేయకుండా గత ఎన్నికల సంద ర్భంగా విద్యార్థి, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసి, ప్రభుత్వ అన్ని శాఖలలో ఖాళీగా పోస్ట్‌లను భర్తీ అయ్యేలా జాబ్ కేలండర్ విడుదల చేయాలనీ, ఆర్థిక ఇబ్బందుల పేరుతో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 63 సంవత్సరాలకి పెంపు ఆలోచనపై ఏమైనా ఉంటే ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని కోరు తున్నాం. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి నిరుద్యోగ సోదరులు మరో పోరాటానికి సిద్ధం కాక తప్పదు. ఉద్యోగ విరమణ వయసు పెంపుపై జరుగుతున్న ప్రచారంపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం.

అనంతుల మధు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,

తెలంగాణ యువజన సంఘం,

95058 66698

Next Story