- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాజిక న్యాయం అమలయ్యేనా?
అనాదిగా భారతీయ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు అట్టడుగులోకి నెట్టబడ్డారు. ఏళ్ల తరబడి సామాజిక వివక్షత

అనాదిగా భారతీయ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు అట్టడుగులోకి నెట్టబడ్డారు. ఏళ్ల తరబడి సామాజిక వివక్షత, అణిచివేతకు గురై ఆత్మగౌరవం లేకుండా జీవించారు.. స్వాతంత్రం వచ్చాక కూడా వీరి జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదు.. మెజార్టీగా వీరు ఉన్నప్పటికీ అగ్రకుల ఆధిపత్యమే కొనసాగింది. అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక వారి జీవితాల్లో కొంత మార్పు మొదలైంది. ఈ వర్గాలలో పరిమిత విద్య, ఉద్యోగ, అవకాశాలు లభించాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ అవకాశాలు కూడా లభించాయి. ఈ క్రమంలో కొంత చైతన్యం ప్రారంభమైనది. ఈ చైతన్యం ద్వారా ఆధిపత్య వర్గాలపై దిక్కార స్వరం ప్రారంభమైనా.. పదవుల కోసం పెదవులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా 78 ఏళ్ల స్వాతంత్య్ర భారత దేశంలో అగ్రకులాల కుట్రలకు ఏదో రూపంలో అణగారిన వర్గాలు బలైపోయారు..
ఆ వర్గాల వాటా వారికి దక్కేనా?
భారత రాజ్యాంగ హక్కులతో వెనుకబడిన వర్గాలలో బానిసత్వ విముక్తి పోరాటం మొదలై దేశవ్యాప్తంగా మేమెంతో మాకు అంత వాటా అనే సిద్ధాంతం బలపడుతోంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు సైతం ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ పార్టీలకు సబ్బండ వర్గాలను కలుపుకోకపోతే తమ ఉనికి ప్రశ్నార్థకం అని స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో మొదట కులగణన అంశం తెరపైకి తెచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కులగణన ప్రక్రియ పూర్తిచేసి బీసీ వర్గాలకు అవకాశాలు కల్పించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే స్థానిక సంస్థలు, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. మరోవైపు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసింది. అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సైతం జనగణనతో పాటు కులగణన చేయ డానికి సిద్ధపడింది. ఇది ఒక ప్రజా డిమాండ్‌గా ముందుకెళ్లడంతో కేంద్రం ఆ దిశగా అడుగులు వేయక తప్పలేదు.. మొత్తంగా అటు ప్రజల డిమాండ్.. ఇటు రాజకీయ పార్టీల అవ సరాల దృష్ట్యా సామాజిక న్యాయంపై చర్చ జరుగుతుంది. అంతర్గ తంగా హిందూ ఎజెండా అని చెప్పుకునే బీజేపీ, సెక్యులర్ ఎజెండా అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలు అనేక రూపాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీల ఎజెండాను ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరి అంతిమంగా ఈ సామాజిక న్యాయం క్షేత్ర స్థాయిలో విజయవంతం అవుతుందా? లేదా ఒక మిధ్యగా మిగులుతుందా? అనేది చూడాలి.
ప్రజలను మభ్యపెట్టడానికా..?
అయితే రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు పదవులు లభించినా.. అధికారాలు ఇస్తారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు ధనస్వామ్య ప్రజాస్వామ్యంలో జనరల్ స్థానంలో అట్టడుగు వర్గాలు గెలిచే అవకాశం లేదు.. ఇప్పటికే మెజార్టీ నామినేటెడ్ పదవులను, ఉన్నత అధికారులలో తమకు అనుచరులుగా ఉండే అగ్రకులాలే వారికే ఇచ్చారు.. ఈ విషయంలో అన్ని పార్టీలు ఒకటే.. కింది కులాలకు పదవులిచ్చినప్పటికీ అవి రబ్బర్ స్టాంప్ లాంటివే.. రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ఆమోదించిన బీసీ రిజర్వేషన్స్ బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెండింగ్‌లోనే పెట్టింది. ఈ బిల్లు విషయం తేలకముందే రాష్ట్రం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంది. అప్పుడు అధికార వికేంద్రీకరణకు కేంద్ర బిందువైన స్థానిక సంస్థలలో అట్టడుగు వర్గాలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? మరోవైపు ఇటీవల కేంద్రం విడుదల చేసిన జనగణన గెజిట్‌లో కులగణన చేర్చకపోవడం చర్చనీయాంశంగా మారిం ది. ప్రభుత్వాలు ప్రజలను మభ్య పెట్టడానికి మాత్రమే ఈ సాధ్యం కాని బిల్లులు ఆమోదిస్తున్నారా? దేశంలో కులగణన చేయడమంటే సామాజిక న్యాయం, వనరుల సమాన పంపిణీకి విధాన రూప కల్పనగా చెప్పవచ్చు. ఎవరి వాటా ప్రకారం వారికి అవకాశాలు కల్పిస్తూ వనరుల పునఃపంపిణీ జరగడమే.. ఇదే కులగణన సిద్ధాంతానికి అర్థం. ఈ దేశ నిర్మాణంలో తన రక్త మాంసాలు దారపోసిన ఈ వర్గాలు అధికారంలోకి రావడమే నిజమైన సామాజిక న్యాయం. రాజకీయ పార్టీలు బడుగు బలహీన వర్గాలకు పదవులు, అధికారం ఇస్తున్నట్టు అగ్రకుల పార్టీలు కపట ప్రేమ చూపితే మాత్రం మూల్యం చెల్లించక తప్పదు..
సంపతి రమేష్ మహరాజ్
79895 78428






