ఓయూకు పూర్వ వైభవం వచ్చేనా?

by Ravi |   (  Updated:2025-12-10 00:30:55  IST  )

శతాబ్దం పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థగా నిలిచింది. శాస్త్రవేత్తలు, కవులు, కళాకారులు, పరిపాలనాధి కారులు

ఓయూకు పూర్వ వైభవం వచ్చేనా?
X

శతాబ్దం పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థగా నిలిచింది. శాస్త్రవేత్తలు, కవులు, కళాకారులు, పరిపాలనాధి కారులు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ నాయకులు ఇలా అనేక మంది ఈ నేలపై విద్యను పొందారు. అయితే గత రెండు దశాబ్దాలుగా విశ్వవిద్యాలయం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. గత ప్రభుత్వాలు ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేయడంతో మౌలిక వసతులు, బోధన నాణ్యత, పరిశోధనా అవకాశాలు బలహీ‌నపడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా ప్రయత్నాలు విశ్వవిద్యాలయానికి కొత్త ఆశను నింపాయి. ఆగస్టు నెలలో యూనివర్సిటీ విద్యార్థులు, ఫ్రొఫెసర్లతో సమావేశమై పలు శంకుస్థాపనలు చేసిన ఆయన, డిసెంబర్ 10న మళ్లీ విశ్వవిద్యాలయంలో సమావేశం నిర్వహించడం చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ అవకాశాన్ని రాజకీయాలకు అతీతంగా వినియోగించి, సమస్యలను పరిష్కరించుకోవడం విశ్వవిద్యాలయ వర్గాల బాధ్యత. ముఖ్యంగా ఉస్మానియా అభివృద్ధికి కీలక అంశమైన ఫ్రొఫెసర్ల కొరతను తీర్చుకోవడం ముఖ్యం. 2013లో జరిగిన నియామకాలు ఆ తర్వాత జరగకపోవడంతో ఒప్పంద, పార్ట్‌టైం ఆచార్యులపై బోధన ఆధారపడుతోంది. వారికి 12 నెలలుగా జీతాలు లేవు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వీరికి ఉద్యోగ భద్రత, యూజీసీ నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వాలని హామీ ఇచ్చినందున ఇప్పుడు దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసు కోవాలి. మరొక పెద్ద సమస్య పాతకాలపు భవనాలు, హాస్టళ్ల శిథిలావస్థ, డిజిటల్ క్లాస్‌రూముల లేమి, ఏఐ యుగంలో కూడా సాంప్రదాయ తరగతి గదులు కొనసాగడం విచారకరం. ప్రతి విభాగంలో డిజిటల్ క్లాస్‌రూంలు, కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయించుకోవాలి. ఇక పరిశోధన మౌలిక వసతుల లోపం విశ్వ విద్యాలయ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. పరిశోధనలో ఆధునీకరణ లేకపోతే, ఓయూ తన జాతీయ స్థానాన్ని తిరిగి పొందడం కష్టం. అందుకే నిధులను కోరాలి. అలాగే హాస్టళ్ల సమస్యలు, యూని వర్సిటీకి ఫీజు రియంబర్స్‌మెంట్ రూపంలో వచ్చే బకాయిలు విడుదల చేయించుకోవాలి. ఇవన్ని ముఖ్యమంత్రికి వివరించినట్లయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం కోసం సమగ్ర ప్రణాళికతో ఈ విశ్వవిద్యాలయం పూర్వ వైభవాన్ని తిరిగి అందుకోవడం ఖాయం.

-డా. ఏ శంకర్

99514 50009

Next Story