సినిమా పెద్దలు వివాదాలను తెగేదాక లాగుతారా..?

by Ravi |   (  Updated:2025-05-29 01:16:07  IST  )

టాలీవుడ్‌లో నిర్మాతల దగ్గర నుండి అన్ని విభాగాల్లో రాజకీయాలు బలంగా నాటుకు పోవడంతో నిత్యం సినీ పరిశ్రమ నుండి ఏదో ఒక

సినిమా పెద్దలు వివాదాలను తెగేదాక లాగుతారా..?
X

టాలీవుడ్‌లో నిర్మాతల దగ్గర నుండి అన్ని విభాగాల్లో రాజకీయాలు బలంగా నాటుకు పోవడంతో నిత్యం సినీ పరిశ్రమ నుండి ఏదో ఒక వివాదం తెరమీదకోస్తోంది. సినీ పరిశ్రమ లోని కొందరు పెద్దలు గానీ, నటీనటులు గానీ, కొన్ని విభాగాలకు నాయకత్వం వహించేవారు గానీ తాము అన్నింటికీ అతీతం అని తమను తాము ఒక సూపర్ పవర్‌గా ఊహించుకోవడంతోనే పరిశ్రమలో సమస్యలు పరిష్కరించుకోవడంలో ఘోరంగా విఫలమై సర్వత్రా విమర్శల పాలు కావడం సర్వసాధారణం అయిపోయింది.

దేశ సినీ చరిత్రలో మన తెలుగు సినీ పరిశ్రమది ఓ అరుదైన, ఘనమైన రికార్డు. కానీ ఈ పరిశ్రమ చుట్టూ అల్లుకుంటున్న వివాదాలు, ఆధిపత్య పోరు, రాజకీయాలు అటు ప్రభుత్వాలకే కాదు, ఇటు ప్రేక్షకులకు కూడా తలనొప్పిగానే మారడం టాలీవుడ్ ఎదుగుదలకు ఆమోదయోగ్యం కాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం తెలుగు సినిమా పరి శ్రమకు అలవాటుగా మారింది.

ప్రభుత్వాలతో సఖ్యత ఏది..?

తెలుగు సినీ పరిశ్రమ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభు త్వాలతో ప్రస్తుతం నిజంగా సఖ్యతగా ఉందా లేదా.. అనేది తరచి చూస్తే ఎక్కడో ఒక అడ్డు తెర స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంతో టాలీవుడ్ పెద్దలకు సంబంధాలు బలంగా ఉన్నట్లు కనబడటం లేదు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఈ గ్యాప్‌ను మరింతగా ఎలా పెంచాయో..అందరికే తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకున్న సినీ పరిశ్రమ పెద్దలు.. ఆ ప్రభుత్వం వచ్చాక వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వాలతో ముడిపడే సినీ పరిశ్రమ తమ సమస్యలను పరి ష్కారం చేసుకోవడానికి వారితో సఖ్యతను పెంచుకోవాల్సింది పోయి ఉదాసీన వైఖరి అవలంభించడంతో విమర్శలకు గురవుతోంది. సినీరంగంలోని కొందరు పెద్దల అనాలోచిత చర్య లు, తొందరపాటు, అతితెలివి వెరసి ఇండస్ట్రీ మీద ప్రభుత్వాల ఆగ్రహం తార స్థాయికి చేరుకునే పరిస్థితి ఏర్పడుతోంది.

తెగేదాక వివాదాలను లాగుతారా..?

థియేటర్లకు కూడా పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే అంశంతో తాజాగా మొదలైన థియేటర్ల బంద్ ప్రచారం సినీ పరిశ్రమను మరో వివాదంలోకి లాక్కొచ్చింది. దీనికి ఆ ‘నలుగురు’ కారణమంటే కాదు.. మరో పదిమంది తయారయ్యారనే ప్రచారం పక్కకు పెడితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌తో మొత్తం సీన్ మారిపోయింది. జూన్ 12న పవన్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలోనే థియేటర్ల బంద్ పేరుతో డ్రామాలకు తెరలేపుతున్నారనే ప్రచారంతో మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం, సినీ పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌పై తేల్చుకుంటామని ఉపముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన వరకు వివాదం వచ్చిందంటే.. పరిశ్రమ పెద్దలు ఎంతవరకు తెగేదాక వివాదాలను లాగుతున్నారో అర్థమవుతుంది. సినీరంగం నుండే ఎదిగి ఆ పరిశ్రమ కష్టనష్టాలు అన్నీ తెలిసి నాయకుడిగా, ఉపముఖ్యమంత్రిగా ఎదిగిన నేతకే పరిశ్రమ తీరు అసహనానికి గురి చేయడం గమనార్హం.

హిడెన్ ఎజెండాతో పనిచేయడం వల్లే..

తాజా పరిణామాలతో పవన్ కల్యా‌ణ్ ఎపిసోడ్‌తో ఫిలిం చాంబర్ ప్రముఖులు, నిర్మాతలు భుజాలు తడుముకునే పరిస్ధితికి రావడానికి కారణమైంది. థియేటర్ల బంద్‌పై బలమైన ప్రచారం జరుగుతుంటే ముందుగానే దీనిపై స్పందించని ఫిలిం ఛాంబర్ పెద్దలు గానీ, నిర్మాతలు గానీ ఇపుడు సర్దుబాటు చేసుకునే రీతిలో మాట్లాడటం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే కదా.. చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలందరూ కలిసికట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యా‌ణ్ సూచించినా తలకెక్కించుకోని సినీ పెద్దల వైఖరిని ఏమనాలి..? టాలీవుడ్‌లో కొందరు ఎవరికి వారు తమ సొంత ‘హిడెన్ ఎజెండా'తో పనిచేయడం మొత్తం పరిశ్రమకే చెడ్డపేరు వచ్చేలా తయారైంది.

దాసరి లాంటి పెద్దరికం ఏది..?

గతంలో తెలుగు సినిపరిశ్రమలో 24 క్రాప్ట్స్‌లో ఎక్కడ ఏ వ్యక్తిగత వివాదమైనా, ప్రభుత్వంతో సమస్య అయినా దాసరి నారాయణరావు నేతృత్వంలో పెద్దలు సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసేవారు. ఆయన తదనంతరం ‘ఎవరికివారే యమునాతీరే' అన్న చందంగా ఇండస్ట్రీ మారిపోవడంతో సమస్యలు పరిష్కారం కాకపోగా వివాదాలు మరింత జఠిలమవుతున్నాయి. సినిమాకి ఆదాయ వనరైన ప్రేక్షకుడి సమస్య పట్టించుకోని సినీ పరిశ్రమ తమ సమస్యలే ‘ఆకాశమంత సమస్యగా’ భావించి మోనోపలీగా ముందుకుపోవడం తోనే టాలీవుడ్‌కు ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. పరి శ్రమలో కొందరు పెద్దల మధ్య ఉన్న ఈగో కారణంగా పెద్దరికం మాటకు కాలం చెల్లేలా వారికి వారే శాసనం రాసుకోవడంతో సమస్యలు పెరిగిపోవడంతో పాటు, ప్రభుత్వాల కన్నెర్రకు కారణమవుతున్నాయి.

ఐకమత్యమే పరిశ్రమకు బలం!

తెలుగు సినీ పరిశ్రమ బాగుపడాలంటే, కష్టాలనుండి గట్టెక్కాలంటే ఐకమత్యమే బలమనే సూత్రాన్ని నమ్మాలి. కలిసి ఉంటే కలదు సుఖం. అనే మాటలు సినిమాల్లో చెప్పడమే కాకుండా తమంతట తామే ఆచరిస్తే పరిశ్రమకు పట్టిన మకిలి వదులుతుంది. నిర్మాతల దగ్గర నుంచి అన్ని విభా గాల వారు సమన్వయంతో తమ సమస్యల పరిష్కా రానికి సమిష్టి వ్యూహంతో పనిచేస్తే ఈ సమస్యలు పరిష్కారం కావడం పెద్ద విషయమేమీ కాదు. కొన్ని సమస్యల పరిష్కారానికి సమయం పట్టవచ్చేమో గానీ పరిష్కారం కానీ సమస్యలేమీ టాలీవుడ్‌లో పాతుకుపోలేదు. ముందుగా సినిమాకు ప్రాణమైన ప్రేక్షకుడికి ఎదురవుతున్న ఇబ్బందుల నుండి నిర్మాత వరకు ఫేస్ చేస్తున్న సమస్యలపై సమగ్రంగా ఆలోచన చేస్తే ప్రభుత్వాలు పరిష్కార మార్గాలను చూపిస్తాయి. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మూడు వేల థియేటర్లలో వేలాది మందికి ఉపాధి కల్పించిన థియేటర్లు నేడు 1600కు పడిపోవడానికి కారణాలు అన్వేషించుకోవల్సిన అవసరం ఉంది. సినీ పరిశ్రమలో గుత్తాధిపత్యం, ఆ నలు గురి చుట్టే ఇండస్ట్రీ తిరగాలనుకోవడం, చిన్న సినిమాకు అవ కాశం లేకుండా చేస్తున్న పరిణామాలు, ప్రేక్షకుల సమస్యలపై దృష్టి సారించకపోవడం, ప్రభుత్వాలతో సఖ్యతగా వ్యవహరించకపోవడం ఇవేవీ తెలుగు సినీ పరిశ్రమకు క్షేమకరం కాదు.

- అడపా దుర్గ

9000725566

Next Story