- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల.. ఏళ్లుగా మారినా బకాయిలు చెల్లించరా?
విద్య పాఠశాలకు, పాఠాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది వ్యక్తిత్వానికి శిల్పం, కుటుంబాలకు పునాది, సమాజానికి మార్గదర్శక

విద్య పాఠశాలకు, పాఠాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది వ్యక్తిత్వానికి శిల్పం, కుటుంబాలకు పునాది, సమాజానికి మార్గదర్శక శక్తి, దేశ భవిష్యత్తుకు రూపకర్త. ఈ ‘శక్తివంతమైన సాధ నాన్ని’ పేదలకు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకాన్ని ప్రారంభించింది. దీని వల్ల విద్యార్థుల భారం తగ్గి, తల్లిదండ్రులకు ఊరట కలిగింది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని కేవలం ఆర్థిక సాయంగా కాక, సామాజిక సమానత్వ సాధనంగా తీర్చిదిద్దారు.
ఆయన హయాంలో లక్షల మంది పేద విద్యార్థులు ఉచితంగా ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ వంటి కోర్సుల్లో ప్రవేశించి కలలను నెరవేర్చుకున్నారు. ఈ పథకం ఉన్నత విద్యకు 'రాజమార్గం'గా నిలిచింది. ఆయన మృతితో పథకం బలహీనమై, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాం లో నిధుల కొరత, ఆలస్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో నిరసనలు, ధర్నాలు, కోర్టుల తలుపులు సాధా రణం అయ్యాయి. అప్పటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సుప్రీంకోర్టు మూడు నెలలకోసారి చెల్లింపులు చేయాలన్న ఆదేశాలిచ్చినా, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కారణంగా అమలు ఆలస్యమైంది. తెలంగాణ ఏర్పాటై పదకొండేళ్లు గడిచినా, ఈ పథకం పునరుజ్జీవించకపోవడం ఆందోళన కలిగించే విషయం.
ఈ వివక్ష దేనికి..?
ప్రస్తుతం ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకం, ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిధుల విడుదలలో కాలయాపన కారణంగా తన ఉనికిని కోల్పోయింది. నిధుల విడుదలకు ఏళ్ల తరబడి జాప్యం జరగడం వల్ల లక్షలాది విద్యార్థుల భవితవ్యాలు అంధకారం అవుతున్నాయి. ఈ కాలయాపన గణాంకాల్లో కనిపించదు. ప్రతి విద్యార్థి కన్నీళ్లలో, ప్రతి తల్లిదండ్రుల బాధలో, ప్రతి మూసివేసిన కళాశాల గేటులో ప్రతిధ్వనిస్తుంది. కళాశాలలు విద్యార్థుల పరీక్ష ఫీజులను సైతం సంబంధిత యూనివర్సిటీలకు చెల్లించకుండా పరీక్షల నిర్వహణను బహిష్కరించే పరిస్థితి నేడు తలెత్తి, చివరికి గత్యంతరం లేక ప్రభుత్వం అన్నీ యూనివర్సిటీలకు ‘మే’ నెల రోజుల సెలవుల ప్రకటన చేసిం ది. ఒకవైపు ‘విద్య హక్కు’ అని గొంతెత్తే ప్రభుత్వాలు.. మరో వైపు కేవలం విద్యా నిధుల విషయంలో మౌనం చాటుతున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి బకాయిలు 10 వేల కోట్లకు చేరుకున్నా వదిలేయడం జరిగింది. ప్రతియేటా 14 లక్షల నిరుపేద విద్యార్థులు, తల్లిదండ్రుల బాధలు ఎవరికీ పట్టడం లేదు. గత నాలుగేళ్ల పాత బకాయిలను ‘వన్ టైమ్ సెటి ల్మెంట్’ కింద ఏక కాలంలో చెల్లిస్తామని, ఏప్రిల్ నెల నుండి ‘ప్రతినెలా’ 12 నెలల కాలంలో చెల్లిస్తామని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో, వేర్వేరు సందర్భాలలో చేసిన ప్రకటనలు, హామీలు సైతం ఇంకా కార్యరూపం దాల్చలేదు.
నెల..ఏళ్లుగా మారినప్పటికీ
ప్రతి నెలా మెస్ ఛార్జీల రూపంలో విద్యార్థుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయాలనే స్పష్టమైన మార్గదర్శకాలుండగా, క్షేత్రస్థాయిలో ఈ విధానం పూర్తిగా ధ్వంస మైంది. వై.ఎస్. మరణానంతరం ఉపకారవేతనాల మంజూరులో జాప్యం పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం, ‘ప్రతి నెల’ కాకుండా ‘మూడునెలలకు ఒకసారి’ చెల్లింపులకే తాత్కాలిక అనుమతి ఇవ్వాలని కోరింది. కోర్టు ఆమోదంతో ఆ తీర్మానం తాత్కాలికమని భావించినా, ప్రభుత్వం దానిని శాశ్వతమయ్యేలా వాడు కుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా గత ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమే కాక, చెల్లింపులను సంవత్సరాల పాటు నిలిపివేస్తూ, వేల కోట్ల బకాయిలను పెంచింది. ఫలితంగా, ఒకవైపు నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు ఆవిరైపోగా, మరోవైపు ఈ పథకంపై ఆధారపడి నడిచిన ప్రైవేట్ కళాశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి ధీటుగా పనిచేసిన గ్రామీణ ప్రాంతాల ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు సైతం మూతపడే పరిస్థితి. ప్రభుత్వం చెల్లిస్తుందన్న నమ్మకంతో పిల్లలను చేర్చిన తల్లిదండ్రులు, కాలయాపనతో చివరికి స్వంతంగా ఫీజులు చెల్లించే గత్యంతరం లేకుండా పోతోంది. ఇలా, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కళాశాలలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా నలుగుతున్నారు. కావున ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి గతంలో ఆయన చెప్పినట్టుగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను 12 నెలల కాలంలో చెల్లించే విధానాన్ని అమలు పరచాలి.
- నంగె శ్రీనివాస్
విద్య, సామాజిక విశ్లేషకులు,
94419 09191






