- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాదా బైనామాకు సై.. ఇప్పటికైనా రైతులకు ప్రయోజనాలు లభించేనా?
భూమి ఉన్నన్ని రోజులు భూ సమస్యలు ఉంటాయనేది నానుడి. దీన్ని నిజం చేస్తూ తెలంగాణలో ఎన్ని చట్టాలు మార్పులు తెచ్చినా భూమి సమస్యలు మాత్రం

భూమి ఉన్నన్ని రోజులు భూ సమస్యలు ఉంటాయనేది నానుడి. దీన్ని నిజం చేస్తూ తెలంగాణలో ఎన్ని చట్టాలు మార్పులు తెచ్చినా భూమి సమస్యలు మాత్రం పూర్తిగా పరిష్కారం కావడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాదా బైనామాల ద్వారా భూమి హక్కులు కలిగి ఉన్న వాళ్లకు పూర్తి హక్కులు ఇవ్వడానికి తెచ్చిన జీవో వివాదాస్పదమైంది. ప్రజలు తమ భూమి సమస్య పరిష్కారం కోసం పెట్టుకున్న అర్జీలను పరిష్కరించడానికి తీసుకొచ్చిన జీవో 112 కోర్టు కేసుల వల్ల నాలుగున్నర సంవత్సరాలు పెండింగ్‌లో ఉంది.
2020లో తెచ్చిన ఈ 112 జీవో కనుక అమలై ఉంటే ధరణిలో కాస్తూ కాలమ్ లేకపోయినా సాదా బైనామా కలిగిన యజమానుల భూమి సమస్యలు పరిష్కారమయ్యేవి. కోర్టులో స్టే తెచ్చిన వారి లక్ష్యం ఏమో కానీ, లక్షలాది మంది సాధారణ ప్రజలు తమ భూమి సమస్యతో నాలుగున్నర సంవత్సరాల పాటు గోస పడ్డారు. ఈ మధ్యకాలంలో దళారులు రంగంలోకి దిగారు. పూర్వపు భూ యజమానులతో అనేక పైరవీలు జరిగిపోయాయి. ఇప్పుడు కోర్టు స్టే ఎత్తివేయడంతో నాలుగున్నర సంవత్సరాలుగా తమ భూమిని అమ్ముకోలేక, వారసులకు బదిలీ చేయలేక ఇబ్బంది పడుతున్న వారికి ఊరట దొరికినట్లయింది. ఒక ప్రజా ప్రయోజన వాజ్యం రాజ్యాధికార మార్పిడిలో ఒక అస్త్రంగా ఉపయోగపడిందని రాజకీయ విశ్లేషకులు అభి ప్రాయపడుతున్నారు.
సాదా బైనామా అంటే?
సాదా బైనామా అనేది ఒకప్పుడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కాకుండా, సాధారణ తెల్ల కాగితంపై చేసుకున్న భూమి కొనుగోలు ఒప్పందం. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో భూమి లావాదేవీలకు సంబంధించి పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు దూరంగా ఉండటం, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలతో చాలామంది భూమిని ఈ విధంగానే కొనుగోలు చేశారు. ఇలాంటి భూములపై వారికి కేవలం భౌతిక యాజమాన్యం మాత్రమే ఉండేది. కానీ చట్టబద్ధంగా యజమానిగా గుర్తించబడకపోవడంతో ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా మిగిలిపోయారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం 2020లో జీవో 112ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం, 2014 జూన్ 02 కంటే ముందు సాదా బైనామా ద్వారా భూమిని కొనుగోలు చేసిన వారు దరఖాస్తు చేసుకుంటే, ఆ భూములను క్రమబద్ధీకరించి, వారికి అధికారిక పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం ఒక గడువును కూడా నిర్ణయించింది. ఈ గడువులోగా లక్షలాది మంది రైతులు తమ సాదా బైనామా భూములను క్రమబద్ధీకరించుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు.
న్యాయ వివాదం..స్టే విధించడం
ప్రభుత్వం సాదా బైనామా క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించిన వెంటనే, దీనిపై హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని, ఇది నిబంధనలకు అనుగుణంగా లేదని పిటిషనర్లు వాదించారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు 2020 నవంబర్‌లో ఈ జీవో అమలుపై స్టే విధించింది. దీనితో సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల వేలాది మంది రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భూమి కలిగి ఉన్నా, దానిపై పూర్తి హక్కులు లేకపోవడంతో వారంతా అనేక సమస్యలను ఎదుర్కొన్నారు.
స్టే ఎత్తివేత.. తాజా పరిణామాలు..
తాజాగా, హైకోర్టు ఈ పిటిషన్‌పై సమగ్ర విచారణ జరిపి, ఆగస్టు 26న స్టేను ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో గత నాలుగున్నర సంవత్సరాలుగా నిలిచిపోయిన క్రమబద్ధీకరణ ప్రక్రియ మళ్లీ ఊపందుకున్నది. అయితే, స్టే ఎత్తి వేసినప్పటికీ, హైకోర్టు కొన్ని మార్గదర్శకాలను ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని, పకడ్బందీగా ఈ ప్రక్రియను అమలు చేయాల్సి ఉంటుంది.
రైతులకు లభించే ప్రయోజనాలు..
సాదా బైనామా క్రమబద్ధీకరణతో రైతులకు భూమిపై చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు లభిస్తాయి. దీనితో వారు తమ భూమిని నిరభ్యంతరంగా అమ్ముకోవచ్చు. బహు మతిగా ఇవ్వవచ్చు లేదా వారసులకు సంక్రమించవచ్చు. అధికారిక పట్టా ఉన్న భూమిపై బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. దీంతో రైతులు వ్యవసాయ రుణాలు, ఇతర రుణాలను సులభంగా పొందవచ్చు. ఇది వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. సాదా బైనామా భూమి ఉన్న రైతులకు ఇప్పటి వరకు రైతుబంధు, రైతు బీమా, పంట రుణాల వంటి ప్రభుత్వ పథకాలు అందలేదు. క్రమబద్ధీకరణ తర్వాత వారికి అధికారిక పట్టాదారు పాస్ పుస్తకం లభి స్తుంది. దీంతో వారు అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. సాదా బైనామా భూములకు సంబంధించి తరచుగా కుటుంబ సభ్యుల మధ్య, లేదా ఇతరులతో వివాదాలు తలెత్తుతుంటాయి. క్రమబద్ధీకరణ ద్వారా భూమిపై ఒక స్పష్టత వస్తుంది. వ్యవసాయ అభివృద్ధి భూమిపై యాజమాన్య హక్కులు ఉండటంవల్ల రైతులు వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు.
భవిష్యత్తు కార్యాచరణ
హైకోర్టు తీర్పుతో ఇప్పుడు ప్రభుత్వంపై ఈ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన బాధ్యత పెరిగింది. దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది రైతుల వివరాలను ప్రభుత్వం తిరిగి పరిశీలించి, అర్హులైన వారికి త్వరగా పట్టాలు అంద జేయాలి. ఈ ప్రక్రియలో పారదర్శకత, వేగం ఉండేలా చూ డాలి. ఒకప్పుడు అనధికారికంగా ఉన్న ఈ భూములకు అధికారిక గుర్తింపు లభించబోతున్నది. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక కొత్త ఊపునిస్తుంది. ఇది తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోతుం ది. ఒక్క పిటిషన్‌తో రిజిస్ట్రేషన్లు ఆగిపోయి రెండు లక్షల పైచిలుకు భూ యజమానులు అవస్థలు పడ్డారు. ప్రస్తుతం కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్లు-మ్యూటేషన్ల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం కూడా రానున్నది.
- డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్
97003 02973






