నామినేటెడ్ పాలకవర్గంతో.. రైతులకు మేలు జరిగేనా..?

by Ravi |   (  Updated:2026-01-21 00:45:45  IST  )

సహకార సంఘాలలో ఎన్నికలను రద్దు చేస్తూ నామినేటెడ్ పదవుల నియామకానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు వ్యవసాయ సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించి డైరెక్టర్ల మద్దతుతో చైర్మన్ పదవి దక్కుతుండేది.

నామినేటెడ్ పాలకవర్గంతో.. రైతులకు మేలు జరిగేనా..?
X

సహకార సంఘాలలో ఎన్నికలను రద్దు చేస్తూ నామినేటెడ్ పదవుల నియామకానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు వ్యవసాయ సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించి డైరెక్టర్ల మద్దతుతో చైర్మన్ పదవి దక్కుతుండేది. కానీ ప్రభుత్వం ప్రస్తుతం డైరెక్టర్లను, చైర్మన్, వైస్ చైర్మన్‌లను నామినేటెడ్‌గా నియమిస్తే సంఘంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేకపోలేదు. రైతుల ఓట్లతో ఎన్నుకున్న పాలకవర్గానికి తెలియకుండా కొందరు చైర్మన్లు అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.. అలాంటిది ఎలాంటి ఎన్నికలూ లేకుండా నామినేటెడ్ పోస్టులు చేస్తే రైతులకు న్యాయం జరుగుతుందా? అనే సందేహాలు రైతులలో నెలకొన్నవి. రైతులచే ఎన్నుకో‌బడే చైర్మన్‌లను నామినేటెడ్‌గా ప్రకటించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు.

రైతులకు పదవులు దక్కేనా..?

సొసైటీలో ప్రభుత్వం నామినేటెడ్‌గా పదవులు భర్తీ చేస్తే అందులో ఏ పార్టీకి చెందని రైతులకు ఆ పదవులు దక్కుతాయా అనే సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పార్టీకి చెందిన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఉంటారు అందులో ఒకవేళ చైర్మన్ అవకతవకలకు పాల్పడితే చైర్మన్‌ను ఎవరు ప్రశ్నిస్తారు. అంతా ఒక గూటికి చెందిన నాయకులే కనుక ప్రశ్నించే అవకాశం అక్కడ ఉండదు.. సొసైటీలో 13 మంది డైరెక్టర్లు ఉండగా, ఏడుగురితో చైర్మన్ పదవి కైవసం చేసుకోవచ్చు. కొన్ని సొసైటీలలో రెండు పార్టీలకు చెందిన డైరెక్టర్లు చెరో సగం విజయం సాధిస్తే అక్కడ సొసైటీ పాలక వర్గంలో తీసుకునే నిర్ణయాలన్నిటిలోనూ ప్రతిపక్ష డైరెక్టర్‌లకు వివరించాల్సి ఉంటుంది గనుక అక్కడ అవకతవకలకు తక్కువ అవకాశాలు ఉంటాయి.

సహకార సంఘాల ఏర్పాటు ముఖ్య ఉద్దేశం...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు 01 ఆగస్టు 1964 నుండి ఒక ప్రత్యేక చట్టం ద్వారా అమలు చేయబడ్డాయి. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు, పంట రుణాలు రైతుల వద్దకు నేరుగా చేరేందుకు ఒక గొప్ప ఆలోచనతో సహకార సంఘాలు అప్పట్లో ఏర్పాటు చేయబడ్డాయి. సహకార సంఘ చట్టంలో సభ్యులుగా చేరిన రైతులకు ఓటు హక్కు కల్పించారు. సంఘానికి ఎన్నికలు జరిగే సమయంలో అందులో సభ్యత్వం ఉన్న ప్రతి రైతు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. రైతులు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండానే పాలకవర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ప్రతిపాదనలు ఉన్నాయి.

నామినేటెడ్ పదవులకు ఖర్చు ఉండదా...?

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ఖర్చులు తగ్గించాలని సొసైటీ ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్‌గా నియమించాలని భావిస్తోంది. కానీ నామినేటెడ్‌గా పదవులు దక్కితే వాళ్లకు ఖర్చులు ఉండవా? అనేది ప్రశ్నతకంగా మారింది. నామినేటెడ్ పదవుల విపరీతమైన డిమాండ్ ఉంది. పదవి పొందిన వారు రాజకీయ పార్టీల మీటింగ్‌లు పెడితే దాని ఖర్చు వారు భరిం చాల్సిందే. లేదా పార్టీకి ఫండింగ్ ఇయ్యాల్సిందే. ఇది ముందు నుంచి అనేక నామినేటెడ్ పదవులలో జరుగుతున్న తంతే...

ఎన్నికల ఖర్చులే కారణం అయితే...

ఎన్నికలు నిర్వహించేందుకు అయ్యే ఖర్చు‌లే నామినేటెడ్‌కు కారణమైతే ప్రాథమిక సహకార సంఘ ఎన్నికలలో సంఘం మొత్తానికి కలిపి ఓకే పోలింగ్ బూత్‌లో ఎన్నికలు నిర్వహిస్తారు. దానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. అదే గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రతి గ్రామంలో పోలింగ్ బూతులు నిర్వహిస్తారు వీటికి ఖర్చు చాలా ఎక్కువ. రెండిటినీ పోలిస్తే గ్రామపంచాయతీ ఎన్నికల ఖర్చు వ్యయం ఎక్కువే అవుతుంది. రాబోయే రోజులలో ఎన్నికల ఖర్చులు తగ్గించాలంటే సర్పంచ్, పాలకవర్గం, ఎంపీపీ, పాలకవర్గం, జడ్పీటీసీ పాలకవర్గాలను కూడా నామినేటెడ్ పదవులుగా ప్రకటించాలి కదా..

-సింగిరెడ్డి అశోక్ రెడ్డి

76618 01107

Next Story