- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పైలట్ మండలాల్లోనే ఇన్ని సమస్యలా.. భూ భారతి ప్రజల కష్టాలు తీర్చుతుందా?
రైతు భరోసా కొరకు గతంలో అమలు చేసిన భూ ప్రక్షాళన కార్యక్రమం, కొత్త పట్టాదారు పాసు పుస్తకాల చట్టం అమలు కాలక్రమంలో అటకెక్కింది.

రైతు భరోసా కొరకు గతంలో అమలు చేసిన భూ ప్రక్షాళన కార్యక్రమం, కొత్త పట్టాదారు పాసు పుస్తకాల చట్టం అమలు కాలక్రమంలో అటకెక్కింది. వీటిని గమనించిన ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్నికల హామీలలో భాగంగా అధి కారంలోకి వస్తే భూసమస్యల పరిష్కారానికి కొత్త విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి భూభారతి చట్టాన్ని రూపొందించింది. ఏప్రిల్ 14 నుంచి భూభారతిని అమలులోకి తెచ్చింది.
అయితే ఇల్లు అలకగానే పండగ కాదు. కొత్త చట్టం అమలులోకి తీసుకువచ్చినా, దానిని సమర్ధవంతంగా ఉపయోగంలోకి తేవాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే. వారు చిత్త శుద్ధితో పని చేస్తే కొంతలో కొంతైనా రైతులకు ఉపశమనం దొరకవచ్చును.
లోపాలను సరిదిద్దుటకై..
2018లో రెండోసారి పాలన పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖను నిర్లక్ష్యం చేసింది. రైతులకు భూమి హక్కును దాఖలు పరిచే పట్టాదారు పాసు పుస్తకాల చట్టం-1971 రద్దు చేసి, దాని స్థానంలో కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాల చట్టం - 2020ని అమల్లోకి తెచ్చింది. మరో ఉత్తర్వును జారీ చేసి గ్రామ రెవెన్యూ అధికార వ్యవస్థను రద్దు చేసింది. దీంతో రెవెన్యూ పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. రైతుల కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. అందుకే గతంలోని రెవెన్యూ విధాన లోపాలను సరిదిద్దుటకై భూభారతిని రూపొందించింది. అయితే దశాబ్ద కాలంగా కిందిస్థాయి రెవెన్యూ అధికార యంత్రాంగం నిర్వీర్యం కావడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు అధికారులు, ఇతర సిబ్బంది కొరత ఆ శాఖను వెంటాడుతోంది. అందుకే దాని పటిష్ట అమలుకై రెవెన్యూ శాఖలోని ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేసింది. అయితే ప్రజల కష్టాలను తీర్చడంలో రెవెన్యూ ఉద్యోగులు ఎంత మేరకు పని చేస్తారనేది ఇప్పుడు సవాలుగా మారనుంది.
సగం సమస్యలు ఇవే..
భూభారతి అమల్లోకి వచ్చిన రెండోవరోజే ప్రభుత్వం నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలను పైలట్ మండలాలుగా తీసుకుంది. ఏప్రిల్ 17 నుంచి గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ చిన్న మండలం.. ఇందులో కేవలం తొమ్మిది గ్రామాలున్నాయి. కానీ వచ్చిన దరఖాస్తులు మాత్రం అన్ని మండలాల కంటే అధికం. మొత్తం దరఖాస్తులలో రైతులు ఎక్కువగా ఏ సమస్యలపై పరిష్కారం కోరుతున్నారో చూస్తే.. నాలుగు మండలాల దరఖాస్తులలో కొత్త పాస్ పుస్తకాలకై 30%, సాదాబైనామా దరఖాస్తులు 24% ఉన్నాయి. అసైన్డ్ భూముల సమస్యలపై 17% దరఖాస్తులు వచ్చాయి. సాదాబైనామా, అసైన్డ్ భూ సమస్యలను కలిపితే 41%. అంటే ఈ రెండే మొత్తంలో సగానికి దగ్గరగా ఉన్నాయి.
వింత నిర్ణయాలతో సమస్యలు జటిలం..
బీఆర్ఎస్ ప్రభుత్వం సాదాబైనామా అమలు కోసం జీవో నం. 112ను తేదీ. 12-10-2020లో జారీ చేసింది. ఇదిలా ఉండ గానే 29-10-2020లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాల చట్టాన్ని అమ ల్లోకి తెచ్చింది. అప్పటికే సాదాబైనామా దరఖాస్తుల అమలును దృష్టిలో ఉంచు కుని జీవో నం. 120ను జారీచేసి సాదాబైనామాల గడువును మరో నెల వరకు పొడిగించింది. అయితే ఈ జారీ చేసిన జీవోలు రద్దు చేయబడిన పట్టాదారు పాసు పుస్తకాల చట్టం-1971ని అనుసరించి చేయడం వింతల్లో కెల్లా వింత. మరి రద్దైన చట్టంలోని సాదాబైనామాలు ఎలా క్రమబద్ధి కరించబడతాయో ఉత్తర్వులిచ్చిన అత్యున్నతాధికారులకే తెలియాలి! అధికారుల హాస్యాస్పద నిర్ణయాలతో సమస్యలు మరింత జటిలం కావడంతో విసిగి వేసారిన రైతులు హైకోర్టులో కేసులు ఫైల్ చేయడం, సాదాబైనామాల అమలు నిలిచిపోవడం మనందరికి తెలిసిన చరిత్రే.
అధికారుల అలసత్వం కారణంగా..
రాష్ట్రంలో గత పదేళ్లుగా రెవెన్యూ సదస్సులు నిర్వహిం చలేదు. అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికై ధరణిలో ఎలాంటి మార్గాలను చూపెట్టలేదు. దానిలోని మాడ్యూల్స్‌ను పూర్తి చేయడమనేది పద్మవ్యూహంగా మారి రైతులు పరిష్కారాల కోసం తిరగడమే మానేసి, ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుకున్నారు. ప్రభుత్వ విధానాలు పక్కన పెడితే రెవెన్యూ అధికారుల వైఫల్యాలు కూడా ఇందులో లేకపోలేదనిపిస్తుంది. సాదాబైనామాల అమలు కోసం ప్రభుత్వం 2016లో జీవో నం.153ను, 2017లో జీవో నం.217లను జారీ చేసింది. వీటి ప్రకారం సాదాబైనామాలను క్రమబద్ధీకరించే అధికారం తహశీల్దార్లకు కట్టబెట్టటం జరిగింది. పైగా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత సమయం కూడా ఇచ్చింది. 2020లో కొత్త చట్టం అమలయ్యే వరకు వారి అధికారాల్లోను ఎలాంటి కోతలు విధించబడలేదు. అయినా ఉన్నతాధికారులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారనడానికి ఇప్పుడు వచ్చిన దరఖాస్తులే నిదర్శనం.
రాజకీయ జోక్యం మంత్రదండం కాదు!
జూన్ 2 నుంచి పూర్తి స్థాయిలో భూ భారతి చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ పైలట్ మండలాలోని దరఖాస్తుల పరిష్కారాలే ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇక రాష్ట్రం మొత్తం సంగతి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రైతు సమస్యలు కేవలం రాజకీయ ప్రేరేపితంతో పరిష్కారం కావు. రాజకీయ జోక్యమనేది అధికారులను పని చేయడానికి కొంత వెసులుబాటు కల్పిస్తుందనేది వాస్తవం. అయితే రాజకీయ జోక్యం సమస్యలను పరిష్కరించే మంత్రదండమేమీ కాదని అధికారులు అర్థం చేసుకోవాలి. అధికారుల దగ్గర సత్వర పరిష్కారాలు చూపే అద్భుత శక్తులేమి లేకపోవచ్చు. కానీ చిత్తశుద్ధితో పని చేస్తే కొంతలో కొంతైనా రైతులకు ఉపశమనం దొరకవచ్చు. అందుకే రెవెన్యూ అధికారులు, ఇతర సిబ్బంది వారి వైఖరి మార్చుకొని, రైతుల కష్టాలకు మానవీయ కోణంలో పరిష్కారాలు చూపడం అత్యవసరం.
డాక్టర్ సందెవేని తిరుపతి
చరిత్ర పరిరక్షణ సమితి ,
98496 18116






