- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ వివాదంపై.. హైడ్రా స్పందించదా?
కోడి చెరువు భూముల వివాదంపై ఆరోపణలు, ప్రతి ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో అసలు నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. భూమి స్వరూపం, యాజమాన్యం, ఆక్రమణ ఆరోపణలపై అధికారిక స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

కోడి చెరువు భూముల అంశం ప్రస్తుతం ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ వ్యవహారంలో జనసేన అధ్యక్షుడిపై ఆక్రమణ ఆరోపణలు వినిపిస్తుండగా, మరోవైపు అవి నిరాధార ఆరోపణలేనని ఆయన వర్గం చెబుతోంది. అయితే ప్రజలను ఎక్కువగా కలవరపెడుతున్న విషయం ఆరోపణల కంటే, వాటిపై ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం నుంచి స్పష్టమైన సమాధానం లేకపోవడమే.
అటు ఆ మాట.. ఇటు ఈ మాట..
ఈ అంశంపై ఆరోపణలు చేస్తున్న జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు అది ఆక్రమణేనని బల్లగుద్ది చెబుతున్నారు. మరోవైపు జనసేన నాయకుడు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక సందర్భంలో ‘ప్రభుత్వం అది అక్రమ ఆక్రమణ అని నిర్ధారిస్తే, ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తాను’ అని చెప్పిన ఆయన, మరో సందర్భంలో ‘అది ప్రైవేటు భూమి, అందులోకి వచ్చిన వారిపై కేసులు పెడతాను’ అని వ్యాఖ్యానించారు. అలాగే ఆ భూమిని తన గోవులకు గడ్డి కోసం ఉపయోగిస్తున్నానని కూడా చెప్పారు.
నిజాలను తేల్చాల్సింది ప్రభుత్వ సంస్థలే..!
ఈ పరస్పర విరుద్ధంగా కనిపించే ప్రకటనల నేపథ్యంలో ప్రజల్లో సహజంగానే అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. అసలు ఆ భూమి స్వరూపం ఏమిటి? అది చెరువు పరిధిలో భాగమా? ప్రభుత్వ భూమా? లేక చట్టబద్ధమైన ప్రైవేట్ ఆస్తా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది రాజకీయ పార్టీలు కాదు. రెవెన్యూ రికార్డులు, సర్వే పత్రాలు, అధికారిక నివేదికలు, ప్రభుత్వ సంస్థలే నిజానిజాలను తేల్చాలి. ఇక్కడే హైడ్రా, సంబంధిత శాఖల పాత్ర కీలకంగా మారుతోంది. ఇతర భూవివాదాలు, చెరువు ఆక్రమణలు, ప్రభుత్వ భూముల అంశాల్లో వేగంగా స్పందించిన అధి కారులు ఈ విషయంలో మాత్రం ఎందుకు మౌనం పాటిస్తున్నారనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. ఒకవేళ ఆరోపణల్లో వాస్తవం లేకపోతే, అధికారిక రికార్డులను ప్రజల ముందుంచి వివాదానికి ముగింపు పలకాలి. ఆరోపణల్లో నిజం ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
ఒక కేసులో వేగం, మరో కేసులో మౌనం!
చట్టం అందరికీ సమానంగా వర్తించాలనే సూత్రం ప్రజా స్వామ్యానికి పునాది. ఒక వ్యక్తి లేదా రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవస్థ వ్యవహరిస్తోందనే భావన కలిగితే ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. కోడి చెరువు వ్యవహారంలో ప్రభుత్వం, ముఖ్యంగా హైడ్రా, వెంటనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వేరే భూములపై, వేరే ఆక్రమణ ఆరోపణలపై స్పందించినట్లు ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు చెప్పాలి. ఈ అంశం ఇంకా తేలకముందే హైడ్రా ఇతర భూములపై చర్యలు తీసుకుంటూ ఉండటం గురించి కూడా ప్రశ్నలు తలెత్తు తున్నాయి. చట్ట అమలులో ఒకే ప్రమాణం ఉండాలి. ఒక కేసులో వేగం, మరో కేసులో మౌనం ఉంటే వ్యవస్థ నిష్పాక్షికతపై సందేహాలు రావడం సహజం. అందుకే కోడి చెరువు వివాదంపై అధికారిక నిర్ధారణ వెలువడే వరకు ప్రజల సందేహాలను నివృత్తి చేయడం ప్రభుత్వ బాధ్యత.
ప్రభుత్వ కోర్టులోనే బంతి!
ప్రజలకు కావాల్సింది రాజకీయ ఆరోపణలు కాదు. వాస్తవాలు.. ఊహాగానాలు కాదు.. అధికారిక నిర్ధారణ. కోడి చెరువు వివాదంలో నిజం ఏదైనా కావచ్చు. కానీ ఆ నిజాన్ని ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం స్పందించే వరకు ప్రశ్నలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు బంతి ప్రభుత్వ కోర్టులో ఉంది. కోడి చెరువు భూముల అసలు వాస్తవం ఏమిటో ప్రభుత్వం, హైడ్రా ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
- సయ్యద్ రఫీ






