వెండి ధర ఎందుకు పెరుగుతోంది?

by Ravi |   (  Updated:2026-02-11 08:16:50  IST  )

కొన్ని రోజుల క్రితం వరకు ఇంచుమించుగా 10 గ్రాముల బంగారం ధరకు సమానంగా కిలో వెండి ధర ఉండేది. అందుకే “ఎప్పుడైనా కొనచ్చులే” అనే ధీమాతో వెండిని చిన్నచూపు చూసేవాళ్లం. తనను తక్కువగా చూసిన వాళ్ల తిక్క కుదర్చాలని డిసైడ్ అయిందనుకుంటా.. లక్షన్నర నుంచి జెట్ స్పీడ్‌లో రూ.4 లక్షలకు చేరి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

వెండి ధర ఎందుకు పెరుగుతోంది?
X

కొన్ని రోజుల క్రితం వరకు 10 గ్రాముల బంగారం ధరకు అటు ఇటు సమానంగా కిలో వెండి ధరలు ఉండేవి. అందుకే మనం ఎక్కువగా వెండిని పట్టించు‌కునేవాళ్లం కాదు. “ఎప్పుడైనా కొనచ్చులే” అనే ధీమాతో దీని విలువను తక్కువగా చూసే వాళ్లం. తనను తక్కువగా చూసిన వాళ్ల తిక్క కుదుర్చాలని డిసైడ్ అయిందనుకుంటా.. లక్షన్నర నుంచి జెట్ స్పీడ్‌లో రూ.4 లక్షలకు (కిలో వెండి) చేరి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతటితో అయిపోలేదు.. అసలు నేను తగ్గేదేలే, మీకు అందేదేలే అంటూ పెరుగుతూ పోతూనే ఉంది..

ఇంతకీ వెండి కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఇంత భారీగా పెరగటానికి కారణాలేమై ఉంటాయి? ఏముంది దీనికి కూడా ఆ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే కారణం అనుకుంటున్నారా? అలాగే పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా.. ట్రంప్ దిగిపోతే పెరిగిన ఈ ధరలు డమాల్‌మని పడిపోతాయని కలలు కంటున్నారా? అయితే ఇది మీకోసమే..

పారిశ్రామిక రంగాల్లో వాడకంతో..

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏ రోగం వచ్చినా కరోనా వ్యాక్సిన్ వల్లే అన్నట్లుగా ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న సమస్యకు డొనాల్డ్ ట్రంప్‌కు ఆపాదించటం మనకు అలవాటైపోయింది. కానీ నిజానికి వెండి ధరలు పెరగటానికి పలు ఆర్థిక, పారిశ్రామిక, గ్లోబల్ కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు వెండిని ఎక్కువగా ఆభరణాలకు, దేవుళ్ల విగ్రహాలకు, గృహ అలంకరణాలకు, వంట పాత్రలుగా మాత్రమే వాడేవారు.. అంతకు మించి వేరే రంగంలో వెండికి అంత ప్రాధాన్యం ఉండకపోయేది. అయితే, ఇటీవల కాలంలో వెండిని పారి శ్రామిక రంగంలో విపరీతంగా వినియోగిస్తున్నారు. సౌర ప్యానెల్స్, మొబైళ్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, వైద్య పరికరాలు.. ఇలా తదితర వస్తువుల తయారీల్లో వెండిని బాగా వాడుతున్నారు. అందుకే డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరుగుతున్నాయి.

వెండి వాడకం ఎప్పటినుంచో ఉన్నా..

వెండిని పారిశ్రామిక అవసరాలకు వినియోగించడం 20వ శతాబ్దంలో ప్రారంభమైంది. 21వ శతాబ్దంలో మరింత పెరిగింది. 1930-50 మధ్య ఎలక్ట్రిసిటీ, టెలికమ్యూనికేషన్ కోసం, 1950-80 మధ్య ఎలక్ట్రానిక్స్, ఫోటోగ్రఫీ, రక్షణ రంగాలలో వాడారు. 2000 తర్వాత కంప్యూటర్లు, మొబైళ్లలో విస్తృతంగా ఉపయోగించారు.. ఇక 2010 తర్వాత సౌర ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, 5G టెక్నాలజీ వలన డిమాండ్ ఎక్కువైంది. పారిశ్రామిక రంగాల్లో వెండికి ఇంత డిమాండ్ ఉండటానికి కారణం.. వెండి తక్కువ ధర, మంచి కండక్టివిటీ, తక్కువ ఆక్సిడేషన్, బ్యాక్టీరియా-వైరస్ నివారణ లక్షణాలతో ఉపయోగపడుతోంది. వేడిని వేగంగా పంపుతుంది. చాలా తక్కువ పరిమాణంలోనే మంచి ఫలితం ఇస్తుంది. పైగా వెండిని నాణ్యత తగ్గకుండా రీసైకిల్ చేసి మళ్లీ ఉపయోగిం చవచ్చు. ఈ కారణాల వల్ల వెండి ధరలు పెరిగాయి.

అంతర్జాతీయ అనిశ్చితి..

ఇక అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడడం, ద్రవ్యోల్బణం పెరగడం, షేర్ మార్కెట్‌ పడిపోవటం, ప్రపంచ ఆర్థిక, రాజకీయ అస్థిరతలు వంటి కారణాలు ఇన్వెస్టర్లను 'సేఫ్ హేవెన్ (ఆర్థిక భద్రత)' బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడి పెడతారు. ఈ కారణంగా డిమాండ్ పెరిగి బంగారం వెండి ధరలు అమాంతం పెరుగుతాయి. మరో ఆసక్తి‌కరమైన విషయమేమిటంటే.. BRICS దేశాలు డాలర్ బదులు బంగారం, వెండి రూపంలో ట్రాన్సాక్షన్ చేసే యోచనలో ఉన్నాయి. దీంతో ప్రభుత్వాలు, పెద్ద పెట్టుబడి దారులు వెండి నిల్వలను పెంచుకుంటున్నారు. ఈ కారణాల వల్ల కూడా ధరలు అధికంగా పెరుగుతున్నాయి.

గనుల తగ్గుదల..

ఇక సరఫరా పరిమితులు కూడా వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. ఎందుకంటే.. వెండి నేరుగా గనుల ద్వారా లభించడం కష్టం. దీనిని జింక్, కాపర్ వంటి ఇతర లోహాల తవ్వకాల్లో ఉప ఉత్పత్తిగా వెలికి తీస్తారు. అయితే కొన్నాళ్లుగా పెద్ద గనుల తవ్వకాల ఉత్పత్తి తగ్గు తుండటం, కొత్త ప్రాజెక్టుల ఆలస్యం వంటి కారణాల వల్ల వెండి ఉత్పత్తి తగ్గుతోంది. సప్లై కన్నా డిమాండ్ ఎక్కువ అవ్వటంతో సాధారణ పెట్టుబడిదారులు మాత్రమే కాదు, ప్రభుత్వాలు, పెద్ద సంస్థలు కూడా వెండి నిల్వలను పెంచుకో వడానికి ప్రయత్నిస్తున్నాయి.

సురక్షిత పెట్టుబడి..

భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు, సౌర పవర్, ఇతర పరి శ్రమల్లో సబ్‌స్టిట్యూట్ (Alternative Materials) వస్తే వెండి డిమాండ్ కొంత తగ్గే అవకాశం ఉంది. అలాగే, కొత్త గనుల తవ్వకాలు పెరగడం వల్ల సరఫరా పెరిగి ధరలు కొంత తగ్గవచ్చు.. అయితే, ఇది పూర్తి క్షీణతగా చెప్పలేం. అందుకు అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం వెండి మీద పెట్టుబడి పెట్టడం, సేఫ్ పెట్టుబడిగా చూడవచ్చు..

- ధవణి రెడ్డి యేళ్ళ

జర్నలిస్టు

Next Story