సినిమా నిర్మాణంలో ఎడిటింగ్ ఎందుకు ముఖ్యమైన భాగం?

by Ravi |   (  Updated:2025-08-09 01:15:01  IST  )

సినిమా అనేది కేవలం కథకు దృశ్య రూపం ఇచ్చే కళ మాత్రమే కాదు. అది భావోద్వేగాలు, కళాత్మకత, సాంకేతికతలతో కూడిన సమ్మేళనం.

సినిమా నిర్మాణంలో ఎడిటింగ్ ఎందుకు ముఖ్యమైన భాగం?
X

సినిమా అనేది కేవలం కథకు దృశ్య రూపం ఇచ్చే కళ మాత్రమే కాదు. అది భావోద్వేగాలు, కళాత్మకత, సాంకేతికతలతో కూడిన సమ్మేళనం. ఆ సమ్మేళనాన్ని సమర్థవంతంగా ప్రదర్శించడానికి ఉపయోగపడే కీలక ప్రక్రియలలో ఎడిటింగ్ ఒకటి. అది సినిమాకు చివరి రూపం ఇచ్చి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో అత్యంత కీలకమైన దశ. ఒక సినిమా రూపొందే మార్గంలో చిత్రీకరణ, నటన, సంగీతం ఎంత ముఖ్యమో, ఎడిటింగ్ కూడా అంతే ముఖ్యం.

సినిమా దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు ఎంతో సమన్వయంతో గొప్ప కలయికతో పని చేస్తారు. తమ ఆలోచన, ఊహ, దార్శనికతలతో కథానుగుణంగా ఫిలింని షూట్ చేస్తారు. ఆ షూట్ అంతా నటీనటుల నటన, సెట్స్, సంగీతం ఇలా అనేకమైన వాటి సహకారంతో రూపొందుతుంది.

కథకు రిథమ్ నిర్ణయించడంలో..

అట్లా షూట్ చేసిన ఫుటేజ్‌ను కత్తిరించి, తిరిగి అమర్చి ఒక సున్నితమైన, చక్కటి కథను రూపొందించే ప్రక్రియ ఎడిటింగ్. ఈ ప్రక్రియలో ఎడిటర్ పాత్ర కథన నిర్మాణంలో, భావోద్వేగాల ఉత్తేజంలో, సినిమాకు ఒక రిథమ్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే సినిమా నిర్మాణంలో ఎడిటింగ్ సాంకేతికతతో కూడిన కళ. అంతేకాదు ఫిల్మ్ షూటింగ్ సమయంలో చిత్రీకరించిన వివిధ దృశ్యాలను, శబ్దాల్ని, నేపథ్య సంగీతాన్ని ఒక క్రమబద్ధమైన రూపంలో పునర్ రూపొందించి ఒక సంపూర్ణ కథగా పునః కల్పన చేసే ప్రక్రియ ఎడిటింగ్. అట్లని అది కేవలం సాంకేతికత మాత్రమే కాదు అది ఒక భావ ప్రకటన కూడా . ఆటర్ అయిన ఒక దర్శకుడి ఊహకు ప్రాణం పోసే ప్రక్రియ. అందుకే “కెమెరా చూస్తుంది, ఎడిటింగ్ చెబుతుంది”.

భావోద్వేగాలని పెంపొందించేది..

మౌలికంగా ఎడిటింగ్ కథను సమన్వయం చేయడంలో ఉపయోగపడుతుందని చెప్పాలి. అది ముఖ్యంగా సినిమా కథను స్పష్టంగా చెప్పడంలో సహాయపడుతుంది. నిజానికి మనకు తెలిసి ఒక సినిమా అనేక దృశ్యాలతో రూపొందుతుంది. వాటిని క్రమబద్ధంగా అనుసంధానించటం ద్వారా దర్శకుడి ఊహ ప్రేక్షకుల మనసుని తాకుతుంది. సినిమాకు ఒక సహజసిద్ధమైన కథా గమనం ఉండాలి. అది సృజనాత్మక ప్రవాహంగా రూపొందాలి. అట్లా రూపొందడంలో ఎడిటింగ్ సినిమాలో భావోద్వేగాలని పెంపొందిస్తుంది. అంతేకాదు దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా సినిమాటోగ్రాఫర్ చిత్రించిన దృశ్యాలను భావోద్వేగపరంగా ప్రేక్షకుల హృదయాలను స్పృశించేలా చేయడం ఎడిటింగ్ ముఖ్య లక్ష్యం.

అన్నింటి డిసైడింగ్ ఫ్యాక్టర్

ఒకే సన్నివేశాన్ని, దానిలోని గానం సంగీతం, స్పందనలతో కలిపి ఎడిటింగ్ చేస్తే, దాని ప్రభావం చూపరుల‌పైన రెట్టింపు అవుతుంది. ఇక సినిమా కథ కథనాలు ముందుకు కదిలే క్రమంలో వేగం (పేస్), లయ (రిథమ్)ల నియంత్రణ మొత్తంగా ఎడిటింగ్‌లోనే రూపొందుతుంది. సినిమా ఎక్కడ వేగంగా సాగాలి, ఎక్కడ నెమ్మదిగా ఆలోచింపజేయాలి అనేది ఎడిటింగ్ లోనే నిర్ణయించబడుతుంది. ఇక సినిమా కథలో వున్న సాంస్కృతిక అంశాలు వాటి అవసరాల్ని కూడా ఎడిటింగ్‌లో సరిచేయవచ్చు. సినిమాలలో ప్రాంతీయ సంప్రదాయాలు, పండుగలు, నృత్యాలు, సంప్రదాయ సంగీతం లాంటివన్నీ ఎడిటింగ్ ద్వారానే హైలైట్ అవుతాయి. టైం అండ్ స్పేస్‌ల నిర్వహణ కూడా ఎడిటింగ్ ప్రక్రియలోనే జరుగుతుంది. సినిమాల్లో ఫ్లాష్‌బ్యాక్‌లు, ప్యారలల్ స్టోరీలైన్లు, టైమ్ లాప్స్ లాంటివన్నీ ఎడిటింగ్ లో వున్న పరిపక్వత ద్వారానే చక్కగా అమలవుతాయి.

చేతితో రీల్‌ కటింగుతో మొదలై..

విశ్వవ్యాప్తంగా పేరెన్నికగన్న మాంటేజ్ ప్రక్రియ కూడా ఎడిటింగ్‌లోనే రూపొందింది. నిజానికి సినిమా తొలి రోజుల్లో సినిమా ఎడిటర్లు రా ఫుటేజీని కట్ చేసి, స్ప్లైస్ చేసి, తిరిగి క్రమబద్ధం చేసి, సన్నివేశాలు, సంఘటనల క్రమాన్ని సృష్టించేవారు. అప్పుడు వారు సినిమా వేగం, వాతావరణం, కథనం, సంగీతం వంటి అంశాలను ప్రభావితం చేసే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే వారు. దర్శకుడు, నిర్మాతలతో కలిసి పనిచేసి ‘ఫైనల్ కట్’ రూపకల్పనలో భాగస్వాములు అయ్యే వారు. సినిమా చరిత్రలో తొలిదశల్లో ఎడిటింగ్ అంటే ఫిల్మ్ స్ట్రిప్‌ను చేతితో కట్ చేసి, గ్లూతో అతికించడం మాత్రమె చేసేవాళ్లు. ఆ తర్వాత ‘ఫ్లాట్‌బెడ్’ యంత్రాల వలన ఈ ప్రక్రియ సులభమై, వేగవంతమై, కచ్చితమైన ప్రక్రియగా మారింది.

కంప్యూటర్లలో ఎడిటింగ్‌.. ఓ విప్లవం

ఇక ఆధునికత సాంకేతికత అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో నాన్-లీనియర్, డిజిటల్ ఎడిటింగ్ వలన ఎడిటర్లు డిజిటైజ్ చేసిన ఫుటేజీని కంప్యూటర్లలో నేరుగా ఎడిట్ చేయగలుగుతున్నారు, ఫిజికల్ ఫిలింను తాకాల్సిన అవసరమే లేకుండా పోయింది. వివిధ ఎడిటింగ్ విధానాలను పరిశీలిస్తే లీనియర్ ఎడిటింగ్ అంటే సీక్వెన్షియల్ క్రమంలో దృశ్యాలు కలపడం. నాన్ లినియర్ ఎడిటింగ్ అంటే డిజిటల్ పద్ధతిలో ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ నుంచి దృశ్యాన్ని కట్ చేసి మార్చే విధానం. ఇక మాంటేజ్‌లో చిన్న చిన్న దృశ్యాల కలయిక ద్వారా భావాన్ని, కాలాన్ని రూపొందించడం.

సినిమా సమిష్టి కళారూపం..

జంప్ కట్, మాచ్ కట్, ఇన్ విజిబుల్ కట్ లాంటి ప్రయోగాత్మక పద్ధతులు కూడా సినిమా చూసే ప్రేక్షకుల్లో మానసిక దృశ్యానుభూతిని కలిగించాడంలోనూ ఆ అనుభూతిని మలచడంలోనూ కీలకంగా మారాయి. సినిమాలో "డైజెటిక్" (కథలో భాగమైన) శబ్దాలు, నాన్ డైజెటిక్ (నేపథ్య సంగీతం, బాహ్య శబ్దాలు) కూడా ఎడిటింగ్ లో భాగం. ఉత్కంఠభరితమైన సన్నివేశంలో నేపథ్య సంగీతం ఎలా కలుపుకోవాలో ఎడిటర్ నిర్ణయిస్తాడు. ఒక నిశ్శబ్దం కూడా ఎంతో గొప్ప సంభాషణలా మారవచ్చు. అది ఎడిటింగ్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నిజానికి తెరమీద ఆవిష్కృతమయ్యే వాస్తవికత, వ్యాపారాత్మకత లాంటివన్నీ ఆ సినిమా రూపొందే క్రమంలో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌లతోపాటు ఎడిటర్ ముఖ్య భూమికను పోషిస్తారు. అందుకే సినిమా సమిష్టి కళారూపంగా నిలబడింది.

- వారాల ఆనంద్

94405 01281

Next Story