- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీడీపీలో భారత్ ర్యాంక్‌కు ఎందుకు పడిపోయింది.. కారణాలు ఇవేనా?
భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే MSMEలు, కుటీర పరిశ్రమలు, స్వదేశీ AI అభివృద్ధి, పరిశోధన పెట్టుబడులు మరియు తయారీ రంగ బలోపేతం ఎంత ముఖ్యమో తెలిపే వ్యాసం.

స్థూల జాతీయోత్పత్తి రీత్యా మన ఆర్థిక వ్యవస్థ నాలుగవ స్థానం నుంచి మూడవ స్థానానికి ఎదుగుతున్నదని మన పాలకులు మొన్నటి వరకు చెప్పేవారు. అయితే ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్ ఏప్రిల్ 2026 ప్రకారం భారత జీడీపీ పరంగా 4.15 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక పరిమాణంతో ఆరో స్థానానికి తగ్గిపోయింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్ తొలి అయిదు స్థానాల్లో ఉండగా, భారత్ 4.15 ట్రిలియన్ డాలర్లతో ఆరవ స్థానంలో ఉంది.
2031 నాటికి భారత మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యమ వుతుంది? మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశీయ తయారీ రంగంలో ఎలక్ట్రానిక్స్ రక్షణ ఉత్పత్తులను అధికం చేయలేక పోతున్నాము. ఉత్పత్తులను అధికం చేసి దిగుమతులను తగ్గించలేకపోతున్నాము.
వాటిని ప్రోత్సహిస్తేనే ముందుకెళతాం..
ఎరువుల ఉత్పత్తి విషయంలో స్వయం సమృద్ధిని సాధించలేకపోతున్నాము. మేక్ ఇన్ ఇండియా రంగంలో 27 సెక్టార్లలో వస్తు సేవల ఉత్పత్తి జరుగుతున్నా.. స్థూల జాతీయ ఉత్పత్తిలో msme ల వాటా ఆశించిన మేరకు జరగటం లేదు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తే, ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థిక వ్యవస్థలో సార్థక డిమాండ్ ఏర్పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌లే అభివృద్ధి పరంగా మొత్తం పారిశ్రామిక రంగానికి ఇంజిన్‌లాగా పనిచేస్తు న్నాయని ఆర్థిక శాస్త్రవేత్తలు గుర్తించారు. 145 కోట్ల మంది జనాభా గల మన దేశంలో పేదరికం పోవాలన్నా, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, ఆదాయ అసమానత్వం తగ్గాలన్నా.. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు MSMEల అభివృద్ధితోనే సాధ్యం.
కుటీర పరిశ్రమలను బలోపేతం చేయాలి!
ఈ MSMEల ద్వారా నేడు మనదేశంలో 97% ఉద్యోగ కల్పన జరుగుతున్నది. భారీ పరిశ్రమల ద్వారా కేవలం 3 శాతం మాత్రమే ఉద్యోగిత ప్రజలకు లభిస్తున్నది. కుటీర పరిశ్రమల రంగంలో ప్రస్తుతం దేశంలో 6.3 కోట్ల సంస్థలు ఎనిమిది వేల రకాల ఉత్పత్తులను చేస్తూ మన స్థూల జాతీయ ఉత్పత్తికి 30 శాతం కల్పిస్తున్నాయి. దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో ఇది 33 శాతంగా ఉంది. ఈ పరిశ్రమలన్నీ అసంఘటిత రంగంలో ఉన్నాయి. వీటిని సంఘటిత పరిచి ఆర్థిక పరమైన సాంకేతిక పరమైన తదితర సబ్సిడీలు కల్పిస్తే చిన్న తరహా పరిశ్రమలు ఉపాధి కల్పనలో ఆదాయాలు పెంపొందించడంలో దేశంలో ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. ఇదే విధంగా ఐటీ ఎగుమతులను ప్రోత్సహించాలి.
నూతన ఆవిష్కరణల్లో ముందంజ!
ప్రపంచ ఆవిష్కరణ సూచికలో 2015లో భారత్ 81వ స్థానంలో ఉండగా 2025 నాటికి 38 వ స్థానానికి ఎదగడం మంచి పరిణామం. అయితే జీడీపీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం చేసే ఖర్చు కేవలం 0.64 శాతం మాత్రమే. అదే అమెరికాలో 3.48 శాతం సౌత్ కొరియాలో 4.91% జర్మనీలో 3.1 శాతం జపాన్‌లో 3.3% చైనాలో 2.8% ఆయా దేశాల స్థూల జాతీయ ఉత్పత్తిలో ఖర్చు చేస్తున్నాయి.. ఫలితంగా మన దేశంలో చదువుకున్న వారంతా 70% వలస బాట పట్టారు.. ఐఐటీలలో, ఐఐ ఎస్సిలో, ఐఐఎంలో చదివిన పట్టభద్రులలో 50 శాతం వరకు విదేశాలలో స్థిరపడిపోతున్నారు.. ఇంకెలా దేశం సాంకేతిక స్వావలంబన సాధిస్తుంది? దేశాభివృద్ధి ఎలా జరుగుతుంది? మన ఐఐటీలలో, ఎన్ఐటీల్లో చదువుకున్న యువత పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాలలో ఉద్యోగాలు పొందేందు కు వలస పోయి వీరంతా ఆ దేశాలలో ఆర్థిక అభివృద్ధికి గణనీయమైన కృషి చేస్తున్నారు. ప్రపంచ అగ్రగామి కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి వాటి సీఈఓలుగా మనవారు ఉండటం సంతోషించదగ్గ విషయమే. మన ప్రభుత్వాలు వారిని ఉపయోగించుకొని ఉంటే మన దేశం ఇంకా అభివృద్ధి చెంది ఉండేది. గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు మనవాళ్లే వలస వెళ్లి ఉండే వాళ్లు కాదు.
సొంత ఏఐ ప్లాట్‌ఫామ్‌లు ఎక్కడ?
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచ సాంకేతిక దృశ్యాన్ని మారుస్తున్న యుగంలో భారతదేశం ఒక కీలకమైన మలుపు దగ్గర ఉన్నది. ఐటీ శక్తిగా మన దేశానికి ఎంతో ఖ్యాతి, విశాలమైన సాంకేతిక ప్రతిభ ఉన్నప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇంకా సొంతంగా ఏఐ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేయలేదు.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజాలను ప్రపంచానికి అందించిన దేశం మనది. కానీ OPEN AI నుంచి విడుదలైన చాట్ జీపీటీకి, లేదా చైనాకు చెందిన డీప్‌సీక్‌కు సమానమైన సొంత ఏఐ ఉత్పత్తులను మనం ఇంకా తయారు చేయలేదు. ఈ లోటు ఇప్పుడు మన ముందు ఒక పెద్ద సవాల్‌ని నిలబెట్టింది. అది సేవా ప్రధాన స్థాయి నుంచి ఉత్పత్తి సృష్టికర్త స్థాయికి ఎద గాల్సిన సవాలు.. ఈ దిశగా పెట్టుబడి పరిశోధనలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల మధ్య మరింత సమగ్ర సహకారం అవసరం. సరైన మౌలిక సదుపాయాలు, నిధులు లేకుండా స్వదేశీ ఏఐ అభివృద్ధి అసాధ్యం. 2026 ఆర్థిక సర్వే ప్రకారం ఆర్ అండ్ డి రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం వాటా మనదేశంలో 41 శాతం మాత్రమే అదే చైనాలో 77% అమెరికాలో 75% పెట్టుబడులు జరగడం వలన ఆదేశాలలో శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందంజలో ఉన్నాయి.
ఇలా చేయి కలిపితే ఎలా?
2026 మే నెలలో మన పెట్టుబడిదారులు 20.5 బిలియన్ డాలర్లతో అమెరికాలో వివిధ రంగాల్లో పెట్టు బడులు పెట్టడానికి తద్వారా 4 లక్షల ఉద్యోగాలు అక్కడ కల్పించేందుకు ఒప్పందం చేసుకున్నారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఆనాడు మన పెట్టుబడిదారులు పోరాడితే నేడు సామ్రాజ్యవాదంతో చేయి కలుపుతున్నారు. అలాంటప్పుడు దేశంలో ఉద్యోగ కల్పన గానీ ఉత్పత్తులలో పెరుగుదల గానీ ప్రజల జీవన ప్రమాణాలు గానీ ఇంకెలా పెరుగుతాయి?
-డా. సమర్ స్నేహ ఎనుగొండ,
81794 49079






