యూరియా కోసం రైతులకీ ఎందుకీ హైరానా?

by Ravi |   (  Updated:2025-08-19 01:00:36  IST  )

భారతీయ వ్యవసాయ రంగాన్ని నేటికీ తీవ్రంగా వేధిస్తున్న సమస్య యూరియా కొరత. ప్రతిసారి పంట సీజన్‌ వచ్చిందంటే చాలు..

యూరియా కోసం రైతులకీ ఎందుకీ హైరానా?
X

భారతీయ వ్యవసాయ రంగాన్ని నేటికీ తీవ్రంగా వేధిస్తున్న సమస్య యూరియా కొరత. ప్రతిసారి పంట సీజన్‌ వచ్చిందంటే చాలు.. రైతులు ఎరువుల దుకాణాల ముందు, వ్యవసాయ సహకార కేంద్రాల ముందు కిలోమీటర్ల మేర క్యూలో నిలబడి, రాత్రంతా మెలకువగా ఉండి యూరియా కోసం పడిగాపులు కాసే పరిస్థితి నేటికీ మారలేదు. ఇది ఇప్పటి సమస్య కాదు. ప్రతిసారి పునరావృతం అయ్యే పరిస్థితి.

ఇది కేవలం రైతుల సమస్య మాత్రమే కాదు, దేశ ఆహార భద్రతకు, ఆర్థిక స్థితిగతులకు, పర్యావరణానికి పెనుముప్పుగా పరిగణించబడే సమస్యగా మారింది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే భూమిలో జీవ కణాలను క్షీణింపజేసే, మట్టిని నిస్సారంగా మార్చి నీటిని కలుషితం చేసి, గాలిని విషపూరితం చేసే యూరియాకి ఎందుకంత డిమాండ్ అని? ఇది రైతు అవగాహన లోపమా? లేక ప్రభుత్వాల విధాన వైఫల్యమా? ఇందుకు ప్రత్యమ్యాయం లేదా?

యూరియాకు అంత డిమాండ్ ఎందుకు?

భారతదేశంలో యూరియా వినియోగం ఏటా 350 లక్షల టన్నులకు పైగా ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. రైతుల దృష్టిలో యూరియా లేకుండా వ్యవసాయం సాగదనే అపోహ బలంగా పాతుకుపోయింది. దీనికి ముఖ్య కారణాలు.. యూరియా సబ్సిడీ వల్ల చాలా చౌకగా లభించడం, సులభంగా దొరకడం. పంట పచ్చగా మెరిసేలా ‘తక్షణ ప్రభావం’ చూపడం వంటివి రైతు యూరియా వైపుకు ఆసక్తి చూపేలా చేస్తున్నాయి. అయితే శాస్త్రీయంగా చూస్తే రైతు వేసిన యూరియాలో కేవలం 35-40% మాత్రమే మొక్కలు గ్రహిస్తాయి. మిగతాది గాలిలో ఆవిరైపోయి గాలి కాలుష్యానికి కారణమవుతుంది. భూగర్భ జలాల్లో కలిసి నీటిని కలుషితం చేస్తుంది. దీని ఫలితంగా భూమి సారం తగ్గిపోవడం, పంట నాణ్యత క్షీణించడం, గ్రీన్‌హౌస్ గ్యాస్‌ల ఉద్గారం పెరగడం వంటివి జరుగుతాయి. అలాగే భూగర్భ జలాల్లో నైట్రేట్ పెరుగుతుంది. దీని వలన పిల్లల్లో బ్లూ బేబీ సిండ్రోమ్ వంటి ఆరోగ్య సమస్యలు రావడం కూడా జరుగుతుంది.

రైతుల అవగాహన రాహిత్యం..

రైతులలో ఒక తప్పుడు అపోహ బలంగా పాతుకుపోయింది ఎక్కువ యూరియా వాడితే ఎక్కువ దిగుబడి వస్తుందని.. కానీ వాస్తవం ఏమిటంటే, యూరియా అధిక మోతాదు వాడటం వల్ల మొక్కలు బలహీనంగా మారుతాయి. చీడ పీడల బెడద పెరుగుతుంది, మార్కెట్‌లో పంట నాణ్యత తగ్గుతుంది. నిజానికి రైతులకు సేంద్రియ ఎరువులు, జీవ ఎరువుల ప్రాముఖ్యతపై అవగాహన లేక యూరియాపై ఆధారపడుతున్నారు. కానీ ఇది దీర్ఘకాలంలో రైతుకూ, పుడమికీ హాని కలుగజేస్తుంది. రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం కనిపిస్తోంది. యూరియాకు భారీ సబ్సిడీ ఇచ్చి మైక్రో న్యూట్రియంట్స్‌ సబ్సిడీ ఇవ్వకపోవడం, సంతులిత ఎరువుల వాడకం గురించి రైతులకు అవగాహన కల్పించడంలో విఫలం అయింది. యూరియా సబ్సిడీ కోసం ప్రభుత్వం ప్రతి ఏడాది 1.5–2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ డబ్బు రైతు శిక్షణ, జీవ ఎరువులు, సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహానికి వెచ్చిస్తే దేశం సుస్థిర వ్యవసాయ దిశగా ముందడుగు వేస్తుంది.

యూరియాకు ప్రత్యామ్నాయాలు..

ఒక్క లీటర్ నానో యూరియా నలభై ఐదు కేజీల యూరియా బస్తాకు సమానం. దీని ద్వారా రవాణా, నిల్వ సమస్యలు తగ్గుతాయి. పైగా ఖర్చు తక్కువ, ఫలితం మెరుగ్గా ఉంటుంది. అలాగే జీవ ఎరువులు.. అజటోబాక్టర్, ఫాస్పరస్ సొల్యూబుల్ బ్యాక్టీరియా, మైకోరైజా, ట్రైకోడెర్మా, సూడోమోనాస్ వంటివి వాడటం వలన నేల సారం పెరిగి, పంట నాణ్యత మెరుగవుతుంది. ఇక సేంద్రియ ఎరువుల వాడకం వలన నేల, గాలి కాలుష్యం కాకుండా ఆపుతుంది. అలాగే గోమూత్రం, గో ఆధారిత ఎరువులు, వర్మీ కంపోస్ట్, బయో మాన్యూర్స్ నేలలో సేంద్రియ పదార్థం పెంచి దీర్ఘకాలిక సారాన్ని నిలబెడతాయి. రసాయన, జీవ, సేంద్రియ ఎరువులను సమతుల్యంగా వాడితేనే సుస్థిర వ్యవసాయం సాధ్యం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా మంది రైతులు నానో యూరియా, జీవ ఎరువులు వాడి మెరుగైన ఫలితాలు పొందుతున్నారు.

భవిష్యత్ తరాల కోసం..

ప్రతి సీజన్‌‌లో యూరియా కోసం క్యూల్లో నిలబడటం రైతు సమస్యకు పరిష్కారం కాదు. రైతు దృష్టిలో ఎక్కువ యూరియా ఎక్కువ దిగుబడి అనే అపోహను పోగొట్టాలి. ప్రభుత్వాలు యూరియా సబ్సిడీని క్రమంగా తగ్గించి, జీవ ఎరువులు, సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వా లి. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవితం అందించాలంటే ప్రభుత్వం, వినియోగదారులందరూ కలిసి జీవ, సేంద్రియ వ్యవసాయ దిశగా అడుగులు వేయాలి. భవిష్యత్ తరాల ఆరోగ్యకరమైన జీవితాల కోసం ఇది అందరి బాధ్యత.

జి. అజయ్ కుమార్

63009 27609

Next Story