విశాఖపైనే ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టి ఎందుకంటే..?

by Ravi |   (  Updated:2025-11-13 00:46:13  IST  )

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు సరైన గమ్యస్థానంగా మారింది. విశాఖపట్నంలో జరగబోయే CII భాగస్వామ్య సమ్మిట్ 2025 సంపన్న భవిష్యత్తు కోసం, సహకారం, ప్రపంచ వ్యాపార భాగస్వామ్యాలను పెంపొందిస్తుంది.

విశాఖపైనే ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టి ఎందుకంటే..?
X

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు సరైన గమ్యస్థానంగా మారింది. విశాఖపట్నంలో జరగబోయే CII భాగస్వామ్య సమ్మిట్ 2025 సంపన్న భవిష్యత్తు కోసం, సహకారం, ప్రపంచ వ్యాపార భాగస్వామ్యాలను పెంపొందిస్తుంది. విశాఖ మరో అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం పలుకుతోంది. భారత పరిశ్రమల సమాఖ్య (CII) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌‌లోని విశాఖపట్నంలో 30వ భాగస్వామ్య సదస్సు 2025ను నిర్వహించనుంది.

పెట్టుబడులను ఆకర్షించేందుకు..

భారత ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పరిశ్రమ అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (DPIIT), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నవంబర్ 14-15 తేదీల్లో ఈ సదస్సును నిర్వహించనున్నాయి. దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించాలన్నది ఈ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ ఉద్దేశ్యం. ఈ సదస్సు ఆలోచనలు, దృక్పథాలను మార్పిడి చేసుకోవడానికి, కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి భాగస్వామ్యాలను ఏకీకృతం చేయడానికి ఒక అద్భుతమైన వేదికను అందిస్తుంది. గూగుల్‌తో కుదిరిన డేటా సెంటర్ ఒప్పందం ఈ విదేశీ పెట్టుబడులకు మరింత ఊతాన్ని ఇవ్వనుంది.

గ్లోబల్ ఇమేజ్‌ కోసం ప్రయత్నమే...

ఈ సమ్మిట్‌ నవ్యాంధ్రప్రదేశ్‌లో నాలుగోసారి జరుగుతోంది. గతంలో 2016, 2017, 2018 సంవత్సరాల్లో విశాఖపట్నం ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ సదస్సు ‘టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్-నావిగేటింగ్ ది జియో ఎకనామిక్ ఆర్డర్’ అనే థీమ్‌తో జరగ‌నుంది. మొత్తం 13 సెషన్లు జరుగుతాయి. ఇందులో 29 మంది వాణిజ్య మంత్రులు, 80 మంది గ్లోబల్ సీఈవోలు, 40 దేశాల ప్రతినిధులు, 13 మంది కేంద్రమంత్రులు పాల్గొనే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్యం, ఆసియా, పశ్చిమాసియా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని అంచనా.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ వల్లే..

ఆంధ్రప్రదేశ్, గ్రీన్ ఎనర్జీ, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఇన్నో వేషన్‌ రంగాల్లో దేశానికి ఆదర్శంగా మారుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, వంటి గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థలు రాష్ట్రంపై దృష్టి సారిస్తున్నాయి. త్వరలోనే ఏపీ కృత్రిమ మేధస్సు, ఇన్నోవేషన్ హబ్‌గా మారుతుంది. అందుకే పక్క రాష్ట్రాలు కూడా పోటీపడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గుచూపడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలే కారణం. దీనివల్లే పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి.

10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం!

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ. ప్రాంతాల సమగ్ర ఆభివృద్దిపై దృష్టి. తదనుగుణంగానే అనంతపురం, చిత్తూరులో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, ప్రకాశం జిల్లాలో సీబీజీ, నెల్లూరులో డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా, రిఫైనరీ, ఉత్తరాంధ్రలో ఫార్మా, మెడికల్ డివైస్, స్టీల్ సిటీ, డేటా సిటీలు ఏర్పాటవుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ డేటా సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇందులో ఎన్ని ఒప్పందాలు కుదురుతాయి, అందులో ఎన్ని ఆచరణలోకి వస్తాయన్నది కీలక పరిమాణం.

వాస్తవ రూపం దాల్చితేనే..

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వాతావరణం మళ్లీ ఊపందుకుంటున్న సంకేతాలు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఎక్కువ ఒప్పందాలు ప్రకటనల దశలోనే ఉన్నాయి. మౌలిక సదు పాయాలు, ఆవిష్కరణ సామర్థ్యాన్ని సృష్టించే సహకార వేదికగా ఈ శిఖరాగ్ర సమావేశం రూపొందించబడింది. యువత- నైపుణ్యాలు, ఉపాధి, వ్యవస్థాపకత- పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రజల ఆకాంక్షలతో.. మమేకం చేస్తూ గూగుల్ ప్రాజెక్ట్‌ వంటివి వాస్తవ రూపం దాల్చితేనే రాష్ట్ర ఆర్థిక సత్తా ఏమిటో తెలుస్తుంది. ప్రచారం కాదు, అమలు మాత్రమే నిజమైన మైలురాయి.

(రేపు విశాఖలో 30వ భాగస్వామ్య సదస్సు 2025)

-వాడవల్లి శ్రీధర్

99898 55445

Next Story