- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త విత్తన బిల్లు ఎవరి కోసం?
భారతదేశంలో వ్యవసాయం వేల ఏళ్ల చరిత్ర కలిగి ఉన్నప్పటికీ, సంప్రదాయంగా విత్తనాల ఉత్పత్తి రైతుల చేతుల్లోనే ఉండేది. పండిన పంటలోని ఉత్తమ భాగాన్ని విత్తనంగా నిల్వ చేసుకొని తదుపరి సీజన్‌కు

భారతదేశంలో వ్యవసాయం వేల ఏళ్ల చరిత్ర కలిగి ఉన్నప్పటికీ, సంప్రదాయంగా విత్తనాల ఉత్పత్తి రైతుల చేతుల్లోనే ఉండేది. పండిన పంటలోని ఉత్తమ భాగాన్ని విత్తనంగా నిల్వ చేసుకొని తదుపరి సీజన్‌కు వాడుకునే పద్ధతి సహజమైన వ్యవసాయ సంస్కృతి.. కానీ హరిత విప్లవం తర్వాత హైబ్రిడ్, వాణిజ్య విత్తనాల ప్రవేశంతో పరిస్థితులు మారాయి. గత రెండు దశాబ్దాల్లో కార్పొరేట్ విత్తన కంపెనీలు మార్కెట్‌ను గట్టిగా పట్టుకొని, రైతులు విత్తనాల కోసం పూర్తిగా కంపెనీలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. దేశంలో ప్రస్తుతం 540 పైగా విత్తన కంపెనీలు దాదాపు 70 వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 5 వేల కోట్ల రూపాయల విలువైన నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయనే అంచనా ఉంది. ఇటీవల మెదక్ జిల్లా రుక్మాపూర్ గ్రామంలో వరి రైతులు నకిలీ విత్తనాల కారణంగా పంట దిగుబడి భారీగా తగ్గిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఘటన దీనికి ఉదాహరణ. ఇటువంటి సందర్భాల్లో రైతులు ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ ఫిర్యాదు చేయాలి? అన్న దానిపై ఇప్పటికీ సరైన వ్యవస్థ లేకపోవడం పెద్ద సమస్య. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదించిన ‘విత్తనాల బిల్లు 2025’ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రభుత్వం విత్తనాల నాణ్యతను మెరుగుపరచడం, నకిలీలను అరికట్టడం, రైతులకు రక్షణ కల్పించడమే ఉద్దేశమని చెబుతున్నప్పటికీ, రైతు సంఘాలు, నిపుణులు ఈ బిల్లుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక, సంప్రదాయ విత్తనాల సంరక్షణ, రైతులు స్వయంగా తయారుచేసుకునే విత్తనాల హక్కుల విషయాలు బిల్లులో బలంగా లేవని వారు పేర్కొంటున్నారు. నకిలీ విత్తనాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం అందించే విధానం స్పష్టంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే విత్తనాల ధరల నియంత్రణ, కృత్రిమ కొరత సృష్టించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు చేర్చాలని కోరుతున్నారు. వ్యవసాయం దేశంలో 46 శాతం పైగా ప్రజలకు జీవనాధారంగా ఉండడం వల్ల ఈ చట్టాన్ని రైతుల అభిప్రాయాలతో, గ్రామస్థాయి చర్చలతో రూపొందించాలని కోరుతున్నారు. రాబోయే ఈ చట్టం రైతుల ప్రయోజనాలను కాపాడుతుందా? విత్తనాల వ్యాపారాన్ని మరింత కార్పొరేట్ ఆధారంగా మార్చుతుందా? అన్నది రాబోయే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
- పులి రాజు,
99083 83567






